
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆగ్రోస్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో తమ సంస్థ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా, అలాగే ప్రైవేటు వ్యక్తుల భూముల్లోనూ బంకులు ఏర్పాటు చేసుకునేలా ఆగ్రోస్ నిర్ణయించింది. ఇప్పటికే ఆగ్రోస్‌కు చెందిన భూముల్లో బంకుల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ముగిసింది. టెండర్లలో ఎక్కువ కోట్ చేసిన వారికి బంకులను కూడా కేటాయించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో రాష్ట్రంలో గుర్తించిన ఏడు ప్రాంతాల్లో బంకులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.
వీటిలో ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ (చింతల్), జగిత్యాల, వరంగల్, భూపాలపల్లిల్లో ఉన్న ఆగ్రోస్ భూముల్లో ఏర్పాటు చేయగా, మరో బంక్ సూర్యాపేటలోని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ బంక్‌లకు హిందుస్తాన్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థ పెట్రోల్ సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.
రూ.50 లక్షల డిపాజిట్..
ఆగ్రోస్ ఆధ్వర్యంలో ఉన్న భూములను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంపై ఆ సంస్థ దృష్టి సారించింది. సంస్థకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతోపాటు, వాటిని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సంస్థకు ఆదాయ వనరులను సమకూర్చాలని నిర్ణయించింది. ఆగ్రోస్ భూముల్లో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు హక్కులు పొందిన యజమానులు స్థల వినియోగానికి ముందుగా రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ సొమ్ముతో పెట్రోల్ బంకు నిర్మాణం చేసి ఇస్తారు. అనంతరం 30 ఏళ్లపాటు సదరు వ్యక్తికి బంకు లీజుకు ఇస్తారు. దీంతోపాటు యజమాని పెట్టిన పెట్టుబడి, ఖర్చులు, నిర్వహణ ఖర్చులు మినహా వచ్చిన లాభంలో 40 శాతం ఆగ్రోస్‌కు వాటాగా చెల్లించాలి. 60 శాతం యజమాని తీసుకోవడానికి వీలు కల్పించారు.
పెట్రోల్ బంక్ ఆగ్రోస్ పేరుతోనే ఉంటుంది. అదేవిధంగా ఆగ్రోస్ భూముల్లో కాకుండా ప్రైవేటు వ్యక్తుల భూముల్లో ఏర్పాటు చేసే పెట్రోల్ బంక్‌ల విషయంలో 20 శాతం ఆగ్రోస్‌కు వాటాగా చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. బంక్ నిర్వహించే యజమానులు పెట్రోల్ సరఫరాకు హెచ్‌పీసీఎల్ సంస్థకు రూ.5 లక్షల డిపాజిట్ చేస్తే సరిపోతుంది. పెట్రోల్ బంక్‌లకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే అవకాశం కల్పిస్తామని ఆగ్రోస్ సంస్థ ఎండీ సురేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment