ఓయూలో పెట్రోల్‌ బంక్‌ | HPCL Petrol Bunk in Osmania University Hyderabad | Sakshi
Sakshi News home page

ఓయూలో పెట్రోల్‌ బంక్‌

Published Mon, Jun 10 2019 8:48 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

HPCL Petrol Bunk in Osmania University Hyderabad - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా క్యాంపస్‌లో సౌకర్యాలు కల్పించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రాంచంద్రం తెలిపారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో క్యాంపస్‌ విద్యార్థులకు సైకిల్‌ కూడా ఉండేది కాదన్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఐదుగురిలో ఒకరికి బైక్, అందరికీ సెల్‌ఫోన్లు ఉన్నాయన్నారు. క్యాంపస్‌లోని 25 హాస్టళ్లలో సుమారు  2,500 బైక్‌లు, 8వేల స్మార్ట్‌ ఫోన్లు, 5వేల వరకు కంప్యూటర్లు ఉన్నాయని వివరించారు. వీటితో పాటు 300 వరకు కార్లు కూడా ఉన్నాయన్నారు. ఈ వాహనాలకు పెట్రోలు, సెల్‌ఫోన్లకు సిగ్నల్‌ సమస్య ఉందన్నారు. పెట్రోల్‌ కోసం విద్యార్థులు తార్నాక, విద్యానగర్‌ వైపు వెళ్లాల్సి వస్తోందన్నారు. యూటర్న్‌ కారణంగా ఎటు వెళ్లినా అర లీటర్‌ పెట్రోల్‌ అవుతుందన్నారు. అందుకే విద్యార్థులు, అధ్యాపకుల అవసరాలను గుర్తించి క్యాంపస్‌లో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. గతంలో కబ్జాకు గురై ఇటీవల ఓయూకు దక్కిన మెకాస్టార్‌ ఆడిటోరియం పక్కనున్న సుమారు ఎకరం స్థలంలో బంక్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సెల్‌ టవర్స్, హాస్టల్‌ విద్యార్థుల వంటల కోసం గ్యాస్‌ పైప్‌లైన్, ఉచిత వైఫై, సౌర విద్యుత్తు తదితర వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే వసతులతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.   

పదేళ్ల లీజు..  
ఓయూలో పెట్రోల్‌ బంక్‌ కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని హెచ్‌పీసీఎల్‌ సంస్థకు పదేళ్లకు లీజుకు ఇచ్చిన్నట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి చెప్పారు. ప్రతి ఐదేళ్లకు రెన్యూవల్‌ చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఏడాదికి రూ.50 లక్షల వరకు అద్దె లభిస్తుందన్నారు. గతంలో లీజుకిచ్చిన ఓయూ భూములను ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్‌ చేసుకునేలా గత ఒప్పందాలను సవరించామన్నారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేయనున్న పెట్రోల్‌ బంక్‌ ఇటు ఓయూ, అటు ఇఫ్లూ విద్యార్థులకు, ఉద్యోగులకు, మాణికేశ్వర్‌నగర్‌ వాసులకు ఉపయోగపడుతుందన్నారు. ఓయూ భూముల లీజు వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగ పర్చాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీశైలంగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో లీజుకు ఇచ్చిన భూముల అద్దె చెల్లింపులు, విధివిధానాలు పారదర్శకంగా ఉండాలన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement