‘బంధన్’కు లైన్‌క్లియర్
♦ ఆర్‌బీఐ నుంచి పూర్తిస్థాయి లెసైన్స్
♦ ఆగస్టు 23 నుంచి కార్యకలాపాలు
♦ దాదాపు 600 శాఖలతో ప్రారంభం
ముంబై : సూక్ష్మ రుణాల సంస్థ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్‌ఎస్) ప్రతిపాదిత బ్యాంకుకు రిజర్వ్ బ్యాంకు నుంచి పూర్తి స్థాయి లెసైన్సు లభించింది. దీంతో.. బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. బీఎఫ్‌ఎస్ డెరైక్టర్ చంద్ర శేఖర్ ఘోష్ బుధవారం ఈ విషయాలు తెలిపారు. తమ కేంద్ర కార్యాలయం ఉన్న కోల్‌కతాలోనే బ్యాంకును కూడా ఆవిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. ముందుగా 500-600 శాఖలతో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఘోష్ తెలిపారు.
తూర్పు, ఈశాన్య రాష్ట్రాలపైనా, బ్యాంకింగ్ సేవలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలపైనా ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో బీఎఫ్‌ఎస్‌కి ఉన్న 2,200 కార్యాలయాలు, 17,000 పైచిలుకు ఉద్యోగులు, 66 లక్షల పైగా కస్టమర్లు, రూ. 10,000 కోట్లకు పైగా రుణ ఖాతాలు అన్నీ కూడా తొలి రోజు నుంచే బంధన్ బ్యాంకులో భాగమవుతాయని ఘోష్ పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ బృందంలో 20 మంది సభ్యులు ఉంటారని, ఇతరత్రా సంస్థల నుంచి 850 మంది ఉద్యోగులను తీసుకున్నామని తెలిపారు.
2006లో కోల్‌కతాలో బంధన్ ఫైనాన్షియల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ క్యాపిటల్, టాటా సన్స్ వంటి దిగ్గజాలు పోటీపడినప్పటికీ.. ఇన్‌ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐడీఎఫ్‌సీతో పాటు బంధన్ బ్యాంకుకు గతేడాది ఏప్రిల్‌లో ఆర్‌బీఐ సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చింది.
చిన్న మొత్తాల్లో రుణాలు..
బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన తొలి రోజు నుంచే చిన్న మొత్తాల్లో రుణాల మంజూరీ కూడా ఉండగలదని ఘోష్ వివరించారు. దాదాపు రూ. 10 లక్షల దాకా గృహ, వాహన రుణాలను ఇచ్చే అవకాశాలున్నాయని తెలి పారు. ప్రస్తుతం సూక్ష్మ రుణాల సంస్థగా 22.4 శాతం వడ్డీ రేటు విధిస్తుండగా, బ్యాం కుగా మారిన తర్వాత ఈ రేటు తగ్గుతుందని ఆయన చెప్పారు. ఇదంతా కూడా డిపాజిట్ల సమీకరణను బట్టి ఉండగలదన్నారు. ప్రస్తుతానికి డెబిట్ కార్డులు మాత్రమే ఇవ్వనున్నామని, క్రెడిట్ కార్డులు ఉండబోవని ఘోష్ చెప్పారు. ఐఎఫ్‌సీ, సిడ్బీ తదితర షేర్‌హోల్డర్లు రూ. 500 కోట్లు సమకూర్చగలరన్నారు. ఇక, తొలి మూడేళ్లలో తమకు అదనంగా నిధులు అవసరం లేదని, 2018 నాటికల్లా ఐపీవోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఘోష్ తెలిపారు.
దక్షిణాదిన 4 రాష్ట్రాల్లో విస్తరణ..
ప్రస్తుతం తమ కార్యకలాపాలున్న ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ఉండగలవని ఘోష్ తెలిపారు. కొత్తగా ప్రారంభించే శాఖల్లో దాదాపు 200 బ్రాంచీలు మెట్రో, పట్టణ ప్రాంతాల్లోనూ మిగతావి సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉంటాయని ఆయన తెలిపారు. 2,200 పైగా కార్యాలయాలు.. ఖాతాదారులకు ఇంటి వద్దే సర్వీసులు అందించే విధమైన సేవా కేంద్రాలుగా ఉంటాయని ఆయన చెప్పారు. మొదటి రోజు నుంచే 250 ఏటీఎం సెంటర్లు అందుబాటులో ఉండగలవన్నారు. లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వివరించారు.