![Indian Bank rolls out IB SAATHI to enhance banking services - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/16/indian-bank-ib-saathi.jpg.webp?itok=ZPPc_Cd2)
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ‘ఐబీ సాథీ’ (IB SAATHI - సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్‌క్లూజన్)ను రూపొందించింది.
‘ఐబీ సాథీ’ కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్‌ఎల్ జైన్ చెన్నైలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం
‘ఐబీ సాథీ’ కార్యక్రమం ద్వారా ఇండియన్ బ్యాంక్ తన అన్ని శాఖలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు కస్టమర్లకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ కరస్పాండెంట్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తారు.
(కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..)
ఇందు కోసం 2024 మార్చి నాటికి సుమారు 5,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను నియమించుకోవాలని ఇండియన్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని భావిస్తోంది.
36 రకాల సేవలు
ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం 10,750 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 10 మంది కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సంఖ్యను 15,000లకు, కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్‌ల సంఖ్య 15కు పెరుగుతుందని అంచనా.
ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ తన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్‌లకు 36 రకాల సేవలు అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా సేవలు పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment