door step
-
షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి
దానాలు, విరాళాల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ అనే సోషల్ వెంచర్‌కు శ్రీకారం చుట్టింది దిల్లీకి చెందిన అనుష్క జైన్. దాతల ఇంటికి వెళ్లి వారు ఇచ్చే దుస్తులు, పుస్తకాలు... మొదలైన వాటిని తీసుకొని ఎన్జీవోలకు పంపిణీ చేస్తుంది షేర్ ఎట్ డోర్ స్టెప్. ఏఐ టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతో కనెక్ట్ అవుతోంది.... ‘ప్రతిరోజు పిల్లల బట్టలు, యూనిఫాంను చేతితో ఉతికేదాన్ని. షేర్ ఎట్ డోర్ స్టెప్ ద్వారా వాషింగ్ మెషిన్ అందిన తరువాత నాకు చాలా శ్రమ తప్పింది. ఎంతో టైమ్ మిగులుతోంది. ఈ టైమ్‌లో పిల్లలకు కథలు చెబుతున్నాను’ అంటోంది బెంగళూరుకు చెందిన ఒక బామ్మ. బెంగుళూరు నుంచి జైపూర్ వరకు ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. దిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన అనుష్కకు ‘షేరింగ్’ కాన్సెప్ట్ కొత్త కాదు. గతంలోకి వెళితే... తన ప్రతి పుట్టినరోజుకి ‘ఇవి కావాలి అవి కావాలి’ అని కాకుండా ‘ఈరోజు ఏ ఎన్జీవోకు వెళదాం’ అని తల్లిని అడిగేది. నగరంలో ఉన్న ఏదో ఒక ఎన్జీవోకు వెళ్లి అక్కడ ఉన్నవారికి స్వీట్లు పంచేది. అలా ‘షేరింగ్’ అనే కాన్సెప్ట్ తనతోపాటు పెరిగి పెద్దదైంది. దాతృత్వానికి సంబంధించి కాలేజీ రోజుల్లో తనకు స్పష్టత వచ్చింది. చాలామందికి దానం చేయాలనే కోరిక ఉన్నా, సమయం లేకపోవడం వల్ల దూరభారం వల్ల చేయలేకపోతున్నారు. ‘డొనేషన్ ఏ స్వచ్ఛంద సంస్థకు ఇస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది;’ అనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు’ అంటున్న అనుష్క ఈ సమస్యకు ఒక పరిష్కారం వెదకాలనుకుంది. తన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అనుష్క నైట్‌షిఫ్ట్‌లో డ్యూటీ చేసేది. పగటిపూట సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టేది. ఉద్యోగంలో చేరినా ఎన్జీవోలకు డొనేట్ చేయాలనే ఆలోచన అనుష్కను వదలలేదు. దీంతో ఒక వెబ్సైట్ రూపొందించి డొనేట్ చేయాలనుకుంటున్నవారు తమ ఐటమ్స్‌ను రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. రిజిస్టర్ కాగానే పొద్దున్నే వెళ్లి వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చేది. పికప్స్ రెండు వందలు దాటిన తరువాత ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. అక్కడ మరో కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘మా వెబ్సైట్లోకి వచ్చి పికప్ బుక్ చేయండి. మీరు విరాళంగా ఇవ్వాలనుకుంటున్న వస్తువు, అది తేలికైనదా, బరువైనదా అనేది తెలియజేయండి. మా ఏజెంట్లు నిర్ణీత సమయంలో మీ ఇంటి ముందు ఉంటారు. మీ విరాళాన్ని మాకు అనుబంధంగా ఉన్న ఎన్జీవోలలో ఒకదానికి పంపిస్తాం’ అంటూ అనుష్క చేసిన ప్రకటనకు అద్భుత స్పందన వచ్చింది. ఏ వస్తువులు ఏ ఎన్జీవోకు వెళ్లాలి... అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికత సహాయం తీసుకుంటుంది అనుష్క. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ ద్వారా కంపెనీలకు మార్కెటింగ్ సొల్యూషన్స్‌ను అందించడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)కు సంబంధించిన కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది. ఇండివిడ్యువల్స్‌తో పాటు కార్పొరేట్ డోనర్స్ కోసం డోర్‌స్టెప్ డొనేషన్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ దేశీయంగా తిరుగులేని విజయం సాధించిన తరువాత ఈ కాన్సెప్ట్‌ను విదేశాలలో ప్రచారం చేయాలని ఆలోచన చేసింది. తొలి అడుగుగా సింగపూర్‌లో ప్రచారం చేసింది. అక్కడ లభించిన స్పందన అమితమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో మరింత వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది అనుష్క. ఎంతో శక్తి ఇస్తుంది దానం చేయడానికి అవసరమైన స్ఫూర్తిæ ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉండవచ్చు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే ఉన్నత ఆలోచన మాత్రం దేశాల సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకటి చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం అనే పని మనకు ఎంతో శక్తి ఇస్తుంది. – అనుష్క జైన్ -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ‘ఐబీ సాథీ’ (IB SAATHI - సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్‌క్లూజన్)ను రూపొందించింది. ‘ఐబీ సాథీ’ కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎల్ జైన్ చెన్నైలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ‘ఐబీ సాథీ’ కార్యక్రమం ద్వారా ఇండియన్ బ్యాంక్ తన అన్ని శాఖలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు కస్టమర్లకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ కరస్పాండెంట్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) ఇందు కోసం 2024 మార్చి నాటికి సుమారు 5,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని ఇండియన్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని భావిస్తోంది. 36 రకాల సేవలు ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం 10,750 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 10 మంది కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సంఖ్యను 15,000లకు, కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ల సంఖ్య 15కు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ తన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లకు 36 రకాల సేవలు అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా సేవలు పెరగనున్నాయి. -
ఫ్యామిలీ డాక్టర్: తలుపు తట్టి.. నాడి పట్టి
ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు షబీరా. రామకుప్పం మండలం కెంచనబల్ల . ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుతోనే జీవనం సాగిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారు. గతంలో వైద్య సేవల కోసం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకుప్పంలోని పీహెచ్‌సీకి ఆటోలో వెళ్లాల్సి వచ్చేది. అక్కడ గంటల కొద్దీ క్యూలో ఉంటేనే వైద్యం అందేది. ఇప్పుడా అవస్థలు తప్పాయి. ఇంటి దగ్గరకే డాక్టర్, వైద్య సిబ్బంది వచ్చి బీపీ, షుగర్ స్థాయిని పరిశీలించి మందులు అందజేస్తున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య ఉందని గుర్తించిన డాక్టర్లు గతవారం 108 ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించారు. ఇలా నడవలేని, కదలేని స్థితిలో చాలా మందికి ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. వ్యాధుల బారిన పడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందనే బెంగ ఇక ఉండబోదు. నాణ్యమైన వైద్యం ఇంటి తలుపు తడుతోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్య, వైద్య రంగాలను రెండు కళ్లుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువచేసేందుకు ఇంటి వద్దే వైద్యం(ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్) అందించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే సకాలంలో చికిత్స ద్వారా కోలుకునే అవకాశం ఉంటుందని గ్రహించి ఆ మేరకు చర్యలు చేపట్టడం విశేషం. చిత్తూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజీలేని నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ వైద్యం ప్రతి ఒక్కరికీ చేరువ అవుతోంది. దాదాపు 4వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరి«ధిలోకి తీసుకురావడం, పొరుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం కల్పించడం విశేషం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు నడుం బిగించారు. ఏళ్ల తరబడి ఖాళీగా వున్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. ఈ క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇంటి వద్దకే వైద్యం అనే నినాదంతో ప్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. గత నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది ఉగాది నుంచి పూర్తి స్థాయిలో ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం అమలుకానుంది. డేటా యాప్‌లో రోగుల ఆరోగ్య వివరాలు ఫ్యామిలీ డాక్టర్స్ గ్రామ పర్యటనకు ముందురోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఆ గ్రామంలో పర్యటిస్తారు. ప్రతి ఇంటా ఆరోగ్య సర్వే నిర్వహిస్తారు. 14 రకాల రక్తపరీక్షలతో పాటు వివిధ ప్రాథమిక వైద్య పరీక్షలు చేపడతారు. ఇందుకు సంబం«ధించిన పూర్తి ఆరోగ్య వివరాలను డేటా ఎఫ్పీసీ యాప్‌లో పొందుపరు స్తారు. కుటుంబం, అందులోని వ్యక్తులు, వారి వివరాలను పూర్తి స్థాయిలో డేటా యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఇలా నెలకు రెండుసార్లు ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం నిర్వహిస్తారు. 67 రకాల మందులు నూతన విధానంలో భాగంగా ఇంటి వద్దకే వెళ్లి ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వ హిస్తారు. 104 (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనంలోని మెడికల్ ల్యాబ్‌లో 14 రకాల రక్తపరీక్షలు అందుబాటులో ఉంటాయి. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యుల సూచనల మేరకు రక్తపరీక్షలు చేపడతారు. అలానే అనారోగ్య సమస్యలను గుర్తించి బాధితులకు అప్పటికప్పుడే మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ వాహనంలో 67 రకాల మందులు సిద్ధం చేశారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం శస్త్ర చికిత్సల అనంతరం బాధితుడి పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందుబాటులో వైద్యులు జీఓ 143 ప్రకారం ప్రతి పీహెచ్‌సీలోనూ 14 మంది వైద్య సిబ్బంది ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది వైద్యులను నియమించింది. అదేవిధంగా టెక్నీషియన్స్, డిజిటల్ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో నియమించి విలేజ్ హెల్త్ క్లినిక్‌లను బలోపేతం చేసింది. పకడ్బందీగా అమలు జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు వైద్యాన్ని తీసుకొచ్చింది. డాక్టర్లు రోగుల ఇంటి వద్దకే వెళ్లి సేవలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. విజయవంతంగా జరుగుతోంది. – హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్ -
సీఎం జగన్ బాటలోనే పంజాబ్ ప్రభుత్వం
చండీగఢ్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందిన ‘ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ’ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముక్తసర్ జిల్లాలో పత్తి రైతులకు రీయింబర్స్మెంట్ కింద రూ.41.89 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్(ఎంపీఎస్)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు. చదవండి👉🏾 (సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ) -
నిన్న వడ్డీ రేట్ల కోత.. రేపు సర్వీస్ ఛార్జీల పెంపు..
న్యూఢిల్లీ: సామాన్యులు పొదుపు చేసి దాచుకునే సొమ్ముపై ఇప్పటికే వడ్డీ కోత పెట్టిన తపాలా శాఖ తాజాగా మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డోర్‌స్టెప్ అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. వడ్డీ తగ్గింపు దేశంలో మారుమూల పల్లెలకు కూడా విస్తరించిన ఇండియన్ పోస్టల్ శాఖ చాలా ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీంతో లక్షల మంది ప్రజలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలను పొదుపుగా దాచుకున్నారు. ప్రారంభంలో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడిని పోస్టాఫీసులు అందించాయి. అయితే రాను రాను వడ్డీని తగ్గిస్తూ పోయాయి. జులై 1 నుంచి లక్ష లోపు పొదుపు మొత్తాలకు చెల్లించే వడ్డీని సాలుకు 2.75 నుంచి 2.50 శాతానికి తగ్గించింది. జులై 1 నుంచి ఈ తగ్గింపును అమల్లోకి తెచ్చింది. వడ్డీ తగ్గింపుతో ఖాతాదారులు ఉసూరుమంటున్నారు. ఇది చాలదన్నట్టు సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చింది. ‘డోర్‌స్టెప్’కు సర్వీస్ ఛార్జీ పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు అందించే సదుపాయం పోస్టల్ శాఖ కల్పించింది. తాజాగా ఉచిత సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. డోర్ స్టెప్ సేవలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రతీ ఒక్క సేవకు రూ. 20 వంతున సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని చెప్పింది. ఆగష్టు 1 నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి రానుంది. -
ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం ఉండదు. కాల్ చేస్తే చాలు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ కస్టమర్ ఇంటికే వచ్చి కావాల్సిన పనులను చక్కబెట్టి వెళతారు. ప్రభుత్వరంగ బ్యాంకులు కరోనా కాలంలో ఈ వినూత్నమైన ఆలోచనను ఆచరణలో పెడుతున్నాయి. ఇలా కస్టమర్ల ఇంటి వద్దే సేవలు అందించేందుకు గాను 12 ప్రభుత్వరంగ బ్యాంకులు కలసి ‘పీఎస్బీ అలయన్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ కంపెనీ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోనుంది. వారి ద్వారానే బ్యాంకింగ్ సేవలను చేపట్టనున్నాయి. కరోనా వైరస్ కల్పిస్తున్న ఆటంకాల నేపథ్యంలో పీఎస్‌బీలు ఈ విధమైన ఆవిష్కరణతో ముందుకు రావడాన్ని అభినందించాల్సిందే. 12 పీఎస్‌బీల తరఫున ఒకే ప్రామాణిక నిర్వహణ విధానాన్ని పీఎస్బీ అలియన్స్ అనుసరించనుంది. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవలను సైతం కరస్పాండెంట్ల ద్వారా అందించనుంది. ఎస్బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంకు డిప్యూటీ సీఈవో రాజిందర్ మిరాఖుర్ను పీఎస్బీ అలియన్స్ సీఈవోగా నియమించడం కూడా పూర్తయింది. నమూనాపై కసరత్తు.. ‘‘నమూనాను ఖరారు చేసే పనిలో ఉన్నాము. వివిధ రకాల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవడం ద్వారా వారి టెక్నాలజీ, మానవవనరులను వినియోగించుకునే ఆలోచన ఉంది. లేదా సొంతంగా ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా అన్ని పీఎస్‌బీల పరిధిలోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు దీన్ని వినియోగించుకునేలా ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. దీనివల్ల అందరూ ఒకే వేదికపైకి వస్తారు’’ అని మిరాఖుర్ వివరించారు. అత్యతి టెక్నాలజీస్, ఇంటెగ్రా మైక్రోసిస్టమ్స్‌ను పీఎస్బీ అలయన్స్ నియమించుకుంది. రూ.14 కోట్ల మూలధనాన్ని బ్యాంకులు సమకూర్చాయి. 2010లో నిర్వహణ రిస్క్‌లను అధ్యయనం చేసేందుకు పీఎస్‌బీలు ‘కార్డెక్స్ ఇండియా’ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు దీన్నే పీఎస్బీ అలయన్స్గా పేరు మార్చడంతోపాటు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను మార్చి, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందులో చేర్చాయి. కార్డెక్స్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులకు సైతం వాటా ఉండగా, వాటి వాటాలను వెనక్కిచ్చేశాయి. ‘‘పీఎస్‌బీలు అన్నీ కలసి ప్రమోట్ చేస్తున్న సంస్థ ఇది. విడిగా ఒక్కో బ్యాంకు 10 శాతానికి మించి వాటా కలిగి ఉండదు. ప్రస్తుతానికి ప్రతీ బ్యాంకు ఒక ప్రతినిధిని నియమించుకున్నాయి. రానున్న రోజుల్లో ఎంత మంది అవసరం అన్నది చూడాలి’’ అని మిరాఖుర్ చెప్పారు. ఖర్చులు ఆదా చేసుకోవడంతోపాటు ఎన్నో ప్రయోజనాలు పీఎస్బీ అలయన్స్ రూపంలో పొందొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘వనరులను చక్కగా వినియోగించుకోవచ్చు. ఉమ్మడిగా ఒకే విధమైన అవగాహన కలిగిన సిబ్బంది ఉండడం అనుకూలత. దీనివల్ల ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందొచ్చు’’ అని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ పేర్కొన్నారు. కస్టమర్ల ఇంటి వద్దే సేవలను అందించడం వల్ల బ్యాంకు శాఖలకు వచ్చే రద్దీని తగ్గించొచ్చని.. దీనివల్ల వైరస్ విస్తరణను నియంత్రించడంతోపాటు బ్యాంకు సిబ్బందికి ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. కొన్ని బ్యాంకుల పరిధిలో.. ‘ప్రస్తుతం అయితే కొన్ని పీఎస్‌బీలు తమ పరిధిలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుని.. వారి ద్వారా కస్టమర్లకు ఇంటి వద్దే సేవలను అందిస్తున్నాయి. పీఎస్బీ అలయన్స్ ఏర్పాటుతో కరస్పాండెంట్లను అన్ని పీఎస్‌బీలు తక్కువ వ్యయాలకే వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది’ అని రాజిందర్ మిరాఖుర్ తెలిపారు. నాన్ ఫైనాన్షియల్ సేవలైన చెక్కులను తీసుకోవడం, అకౌంట్ నివేదిక ఇవ్వడం, టీడీఎస్ సర్టిఫికెట్, పే ఆర్డర్లను ప్రస్తుతానికి కస్టమర్లు ఇంటి వద్దే పొందే అవకాశం ఉంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా ఆర్డర్ చేసి ఇంటివద్దకే తెప్పించుకోవచ్చు. ఫైనాన్షియల్ సేవల్లో నగదు ఉపసంహరణ సేవ ఒక్కటే అందుబాటులో ఉంది. నెట్ బ్యాంకింగ్ పోర్టల్, మొబైల్ యాప్, ఫోన్‌కాల్ రూపంలో ఇంటి వద్దకే సేవలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో సేవకు రూ.88 చార్జీతోపాటు, జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వసూలు చేసే చార్జీల్లో కొంత మేర కరస్పాండెంట్‌కు బ్యాంకులు చెల్లిస్తాయి. -
ఇంటి వద్దకే పోస్టల్ ఏటీఎంలు: రవిశంకర్ ప్రసాద్
కాకినాడ: కోర్ బ్యాంకింగ్ ను వచ్చే ఏడాది నుంచి అన్ని తపాలా కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు లక్షా ముఫ్పై మూడు వేల హ్యండ్ ఏటీఎంలను పోస్ట్ మ్యాన్ లకు అందజేయనున్నట్లు వివరించారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం మరింత సులుభతరం అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 900 పోస్టల్ ఏటీఎంలను ప్రారంభించామని చెప్పారు. ఈ-కామర్స్ బూమ్ ద్వారా తపాలా శాఖ 80 శాతం ఆదాయాన్ని పెంచుకుందన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో రానున్న మూడేళ్లలో సుమారు 50 లక్షల మందికి ఉపాధి చేకూరుతుందని చెప్పారు. -
ముడి బియ్యం ఇక ముంగిట్లోనే!
ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ముడి బియ్యం తినే వారి సంఖ్య పెరుగుతోంది. ముడిబియ్యానికి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి, అవసరం మేరకు బస్తా, రెండు బస్తాల ధాన్యం ముడిబియ్యం మర పట్టించుకొని ఇంట్లోకి వాడుకునే ప్రకృతి వ్యవసాయదారులకు.. లేదా వినియోగదారులకు నేరుగా ముడిబియ్యం అమ్ముకునే రైతులకు, స్వయం సహాయక బృందాలకు తరచూ రైస్ మిల్లుకు వెళ్లాల్సి రావటం చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. ఇంటి దగ్గరే పెట్టుకొని బియ్యం మరపట్టుకునేందుకు వీలయ్యే చిన్న రైస్ మిల్లును కొనితెచ్చుకోవటమే దీనికి సరైన పరిష్కారం. వీరికి ఉపయోగపడే చిన్న రైస్ మిల్లు (రైస్ డీ-హస్కింగ్ మెషిన్)ను మహారాష్ట్రలోని విజ్ఞానాశ్రమం అనే లాభాపేక్ష లేని సంస్థ రూపొందించింది. పుణేకు 70 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇంటిపట్టునే పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ముడి బియ్యం ఆడించుకోవటానికి ఇదెంతో అనువుగా ఉంటుందని లాబ్ టెస్ట్‌లో నిర్థారణైందని విజ్ఞానాశ్రమం తెలిపింది. 3 చదరపు అడుగుల పొడవు, 4 చదరపు అడుగుల వెడల్పు స్థలం దీనికి సరిపోతుంది. గంటకు 10 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేయగలదు. దీని బరువు సుమారు 125 కిలోలు. 1 హెచ్‌పీ మోటర్తో, 230 వోల్టుల ఏసీ కరెంట్‌తో నడుస్తుంది. దీన్ని ఉపయోగించటం సులభం. నిర్వహణ ఖర్చులూ తక్కువే. ధర రూ.20 వేలకు పైగా ఉండొచ్చని అంచనా. లావు లేదా సన్న రకాల ధాన్యాలేవైనా పిచుకలు వొలిచినట్లు వొలిచి ముడి బియ్యాన్నిస్తుంది. స్టీల్ ప్లేట్లకు బదులు రబ్బరును ఉపయోగించడం వల్ల నూక తక్కువగా వస్తున్నది. 10, 40 హెచ్‌పీ మోటర్లతో నడిచే పెద్ద రైస్ మిల్లులతో పోల్చినప్పుడు.. ఇది అనేక విధాలుగా మెరుగైనదని తేలినట్లు విజ్ఞానాశ్రమం తెలిపింది. బాగుంది కదండీ.. చిన్న రైస్ మిల్లు! - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్