కాకినాడ: కోర్ బ్యాంకింగ్ ను వచ్చే ఏడాది నుంచి అన్ని తపాలా కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వికాస్ పర్వ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు లక్షా ముఫ్పై మూడు వేల హ్యండ్ ఏటీఎంలను పోస్ట్ మ్యాన్ లకు అందజేయనున్నట్లు వివరించారు. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం మరింత సులుభతరం అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 900 పోస్టల్ ఏటీఎంలను ప్రారంభించామని చెప్పారు. ఈ-కామర్స్ బూమ్ ద్వారా తపాలా శాఖ 80 శాతం ఆదాయాన్ని పెంచుకుందన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో రానున్న మూడేళ్లలో సుమారు 50 లక్షల మందికి ఉపాధి చేకూరుతుందని చెప్పారు.