ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు షబీరా. రామకుప్పం మండలం కెంచనబల్ల . ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుతోనే జీవనం సాగిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్నారు. గతంలో వైద్య సేవల కోసం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకుప్పంలోని పీహెచ్‌సీకి ఆటోలో వెళ్లాల్సి వచ్చేది. అక్కడ గంటల కొద్దీ క్యూలో ఉంటేనే వైద్యం అందేది. ఇప్పుడా అవస్థలు తప్పాయి. ఇంటి దగ్గరకే డాక్టర్, వైద్య సిబ్బంది వచ్చి బీపీ, షుగర్ స్థాయిని పరిశీలించి మందులు అందజేస్తున్నారు. ఆమెకు కిడ్నీ సమస్య ఉందని గుర్తించిన డాక్టర్లు గతవారం 108 ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించారు. ఇలా నడవలేని, కదలేని స్థితిలో చాలా మందికి ఫ్యామిలీ డాక్టర్ విధానంతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
వ్యాధుల బారిన పడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందనే బెంగ ఇక ఉండబోదు. నాణ్యమైన వైద్యం ఇంటి తలుపు తడుతోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విద్య, వైద్య రంగాలను రెండు కళ్లుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ఒరవడికి నాంది పలుకుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువచేసేందుకు ఇంటి వద్దే వైద్యం(ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్) అందించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే సకాలంలో చికిత్స ద్వారా కోలుకునే అవకాశం ఉంటుందని గ్రహించి ఆ మేరకు చర్యలు చేపట్టడం విశేషం.
చిత్తూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేని నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కార్పొరేట్ వైద్యం ప్రతి ఒక్కరికీ చేరువ అవుతోంది. దాదాపు 4వేల వ్యాధులను ఆరోగ్యశ్రీ పరి«ధిలోకి తీసుకురావడం, పొరుగు రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం కల్పించడం విశేషం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక సదుపాయాల కల్పనకు నడుం బిగించారు. ఏళ్ల తరబడి ఖాళీగా వున్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. ఈ క్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇంటి వద్దకే వైద్యం అనే నినాదంతో ప్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. గత నెల 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. వచ్చే ఏడాది ఉగాది నుంచి పూర్తి స్థాయిలో ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం అమలుకానుంది.
డేటా యాప్‌లో రోగుల ఆరోగ్య వివరాలు
ఫ్యామిలీ డాక్టర్స్ గ్రామ పర్యటనకు ముందురోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఆ గ్రామంలో పర్యటిస్తారు. ప్రతి ఇంటా ఆరోగ్య సర్వే నిర్వహిస్తారు. 14 రకాల రక్తపరీక్షలతో పాటు వివిధ ప్రాథమిక వైద్య పరీక్షలు చేపడతారు. ఇందుకు సంబం«ధించిన పూర్తి ఆరోగ్య వివరాలను డేటా ఎఫ్‌పీసీ యాప్‌లో పొందుపరు స్తారు. కుటుంబం, అందులోని వ్యక్తులు, వారి వివరాలను పూర్తి స్థాయిలో డేటా యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇలా నెలకు రెండుసార్లు ఇంటి వద్దకే వైద్యం కార్యక్రమం నిర్వహిస్తారు.
67 రకాల మందులు
నూతన విధానంలో భాగంగా ఇంటి వద్దకే వెళ్లి ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వ హిస్తారు. 104 (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనంలోని మెడికల్ ల్యాబ్‌లో 14 రకాల రక్తపరీక్షలు అందుబాటులో ఉంటాయి. బాధితుడి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యుల సూచనల మేరకు రక్తపరీక్షలు చేపడతారు. అలానే అనారోగ్య సమస్యలను గుర్తించి బాధితులకు అప్పటికప్పుడే మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ వాహనంలో 67 రకాల మందులు సిద్ధం చేశారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం శస్త్ర చికిత్సల అనంతరం బాధితుడి పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
అందుబాటులో వైద్యులు
జీఓ 143 ప్రకారం ప్రతి పీహెచ్‌సీలోనూ 14 మంది వైద్య సిబ్బంది ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది వైద్యులను నియమించింది. అదేవిధంగా టెక్నీషియన్స్, డిజిటల్ ఆపరేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో నియమించి విలేజ్ హెల్త్ క్లినిక్‌లను బలోపేతం చేసింది.
పకడ్బందీగా అమలు
జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ ట్రయల్ రన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు వైద్యాన్ని తీసుకొచ్చింది. డాక్టర్లు రోగుల ఇంటి వద్దకే వెళ్లి సేవలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. విజయవంతంగా జరుగుతోంది.
– హరినారాయణన్, చిత్తూరు కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment