న్యూఢిల్లీ: సామాన్యులు పొదుపు చేసి దాచుకునే సొమ్ముపై ఇప్పటికే వడ్డీ కోత పెట్టిన తపాలా శాఖ తాజాగా మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డోర్‌స్టెప్ అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది.
వడ్డీ తగ్గింపు
దేశంలో మారుమూల పల్లెలకు కూడా విస్తరించిన ఇండియన్ పోస్టల్ శాఖ చాలా ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీంతో లక్షల మంది ప్రజలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలను పొదుపుగా దాచుకున్నారు. ప్రారంభంలో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడిని పోస్టాఫీసులు అందించాయి. అయితే రాను రాను వడ్డీని తగ్గిస్తూ పోయాయి. జులై 1 నుంచి లక్ష లోపు పొదుపు మొత్తాలకు చెల్లించే వడ్డీని సాలుకు 2.75 నుంచి 2.50 శాతానికి తగ్గించింది. జులై 1 నుంచి ఈ తగ్గింపును అమల్లోకి తెచ్చింది. వడ్డీ తగ్గింపుతో ఖాతాదారులు ఉసూరుమంటున్నారు. ఇది చాలదన్నట్టు సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చింది.
‘డోర్‌స్టెప్’కు సర్వీస్ ఛార్జీ
పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు అందించే సదుపాయం పోస్టల్ శాఖ కల్పించింది. తాజాగా ఉచిత సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. డోర్ స్టెప్ సేవలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రతీ ఒక్క సేవకు రూ. 20 వంతున సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని చెప్పింది. ఆగష్టు 1 నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment