Indian postal department
-
PIN:భారత దేశం.. ఇవాళ మరో మైలురాయి కూడా!
స్పెషల్: స్వతంత్ర భారతావని 75 ఏళ్ల వసంతం పూర్తి చేసుకుంది. దేశం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇవాళ మన దేశం మరో మైలురాయిని దాటిందన్న విషయం మీకు తెలుసా?.. అదీ తపాలా వ్యవస్థ ద్వారా!. పోస్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్(PIN)కు సరిగ్గా ఇవాళ్టికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. లెటర్లు, కొరియర్లు, ఇతర పోస్టల్ ఐటెమ్స్ పంపడానికి ఈ నెంబర్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే కదా. ఈ పిన్ను 1972, ఆగస్టు 15న మొదలుపెట్టారు. ఇంతకీ ఇది ఎలా పుట్టింది? ఇది రావడానికి ఎవరి కృషి దాగుంది? తదితర విషయాలు చూద్దాం. Postal Identification Number నే ఏరియా కోడ్ లేదంటే జిప్ కోడ్ అని కూడా పిలుస్తారు. ఈ నెంబర్ వల్లే పోస్టల్ డిపార్ట్మెంట్కు, పోస్ట్‌మ్యాన్‌కు ఉత్తరాలు సరఫరా చేయడం సులభం అవుతోంది. ► పిన్ కోసం కృషి చేసిన వ్యక్తి.. శ్రీరామ్ భికాజి వెలెంకర్. ఫాదర్ ఆఫ్ పిన్‌గా ఈయనకు పేరు ముద్రపడిపోయింది. మహారాష్ట్రకు చెందిన ఈయన కేంద్ర సమాచార శాఖలో అదనపు కార్యదర్శిగా, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్బోర్డులో సీనియర్ సభ్యుడిగా కొనసాగారు. సంస్కృత కవి అయిన వెలెంకర్కు 1996లో రాష్ట్రపతి అవార్డు దక్కింది. 1999లో ఆయన కన్నుమూశారు. ► భారతదేశం అంతటా అనేక స్థలాల పేర్లను నకిలీ చేయడం వలన పిన్ కోడ్ అవసరం ఏర్పడింది. ప్రజలు వివిధ భాషలలో చిరునామాలను కూడా వ్రాసేవారు, ఇది చిరునామాలను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే కోడ్ సిస్టమ్ వల్ల.. పోస్ట్‌మెన్ చిరునామాను సరైన వ్యక్తులకు అందించడంలో సహాయపడింది. ► ఆరు నెంబర్ల పిన్ కోడ్‌లో.. ఫస్ట్ డిజిట్ జోన్‌ను సూచిస్తుంది. ► రెండవది.. సబ్ జోన్‌ను సూచిస్తుంది. ► మూడవది.. జిల్లాను అదీ సదరు జోన్ పరిధిలోనే ఉందని తెలియజేస్తుంది. ► చివరి మూడు డిజిట్స్ మాత్రం.. సంబంధిత పోస్టాఫీస్‌ను తెలియజేస్తుంది. ► పోస్టల్ రీజియన్ కార్యాలయం.. ప్రధాన పోస్టాఫీస్‌కు ప్రధాన కేంద్రం లాంటిది. ► భారతదేశంలో ఎనిమిది ప్రాంతీయ మండలాలు, ఒక ఫంక్షనల్ జోన్ (భారత సైన్యం కోసం) సహా తొమ్మిది పోస్టల్ జోన్లు ఉన్నాయి. ► ఇండియా పోస్ట్ ప్రకారం.. దేశం మొత్తం 23 పోస్టల్ సర్కిల్స్‌గా విభజించబడి ఉంది. ప్రతీ సర్కిల్‌కు హెడ్‌గా చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఉంటాడు. ► PIN prefix లిస్ట్‌లో.. 50 అనే సంఖ్య టీజీ అనేది తెలంగాణను, 51-53 మధ్య ఏపీని సూచిస్తుంది. ► డెలివరీ కార్యాలయం జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO), ప్రధాన కార్యాలయం (HO) లేదా సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే సబ్-ఆఫీస్ (SO) కావచ్చు. ► సాధారణంగా చాలామంది ఆశువుగా పిన్ నెంబర్ అనేస్తుంటారు. కానీ, పోస్టల్ విషయంలో పిన్ నెంబర్ అని రాయకూడదు.. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేందటే పిన్ అని మాత్రమే రాయాలి. ఇదీ చదవండి: ‘ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’ -
నిన్న వడ్డీ రేట్ల కోత.. రేపు సర్వీస్ ఛార్జీల పెంపు..
న్యూఢిల్లీ: సామాన్యులు పొదుపు చేసి దాచుకునే సొమ్ముపై ఇప్పటికే వడ్డీ కోత పెట్టిన తపాలా శాఖ తాజాగా మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డోర్‌స్టెప్ అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. వడ్డీ తగ్గింపు దేశంలో మారుమూల పల్లెలకు కూడా విస్తరించిన ఇండియన్ పోస్టల్ శాఖ చాలా ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీంతో లక్షల మంది ప్రజలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలను పొదుపుగా దాచుకున్నారు. ప్రారంభంలో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడిని పోస్టాఫీసులు అందించాయి. అయితే రాను రాను వడ్డీని తగ్గిస్తూ పోయాయి. జులై 1 నుంచి లక్ష లోపు పొదుపు మొత్తాలకు చెల్లించే వడ్డీని సాలుకు 2.75 నుంచి 2.50 శాతానికి తగ్గించింది. జులై 1 నుంచి ఈ తగ్గింపును అమల్లోకి తెచ్చింది. వడ్డీ తగ్గింపుతో ఖాతాదారులు ఉసూరుమంటున్నారు. ఇది చాలదన్నట్టు సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చింది. ‘డోర్‌స్టెప్’కు సర్వీస్ ఛార్జీ పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు అందించే సదుపాయం పోస్టల్ శాఖ కల్పించింది. తాజాగా ఉచిత సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. డోర్ స్టెప్ సేవలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రతీ ఒక్క సేవకు రూ. 20 వంతున సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని చెప్పింది. ఆగష్టు 1 నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి రానుంది. -
ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్
ఇండియా పోస్ట్ బ్యాంకు ఖాతాదారులకు పోస్టల్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడంపై ఛార్జీలు విధించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. నగదు లావాదేవీలపై విధించే ఛార్జీలు వివిధ ఖాతాల ప్రకారం మారనున్నట్లు తెలుస్తుంది. ఖాతాదారులు నెలలో నాలుగు సార్లు నగదు ఉపసంహరించుకుంటే ఎటువంటి చార్జీలు లేవు. అంతకన్నా ఎక్కువ సార్లు నగదు తీసిన మొత్తంలో 0.50శాతం(కనీసం రూ.25) వసూలు చేయబడుతుంది. మీకు పొదుపు ఖాతా లేదా కరెంట్ ఖాతా ఉంటే, మీరు అదనపు ఛార్జీలు చెల్లించకుండా ప్రతి నెలా రూ.25 వేలు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఆ తరువాత ప్రతి ఉపసంహరించబడిన మొత్తంలో కనీసం రూ.25 లేదా 0.50 శాతం వసూలు చేయబడుతుంది. మీరు నెలలో 10,000 రూపాయల వరకు నగదు డిపాజిట్ చేస్తే అప్పుడు ఎటువంటి ఛార్జీ ఉండదు. అయితే, మీరు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ప్రతి డిపాజిట్‌పై కనీసం రూ.25 వసూలు చేస్తారు. పోస్టు పేమెంట్ నెట్‌వర్క్‌లో లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించుకోవచ్చు. దీంతో పాటు పోస్టాఫీసుల్లో మినీ స్టేట్ మెంట్ తీసుకుంటే రూ.5 వరకు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ఇండియాలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడుల జోరు అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! -
భారత తపాలా శాఖ వినూత్న ప్రయత్నం
సాక్షి, జ్యోతినగర్ (కరీంనగర్) : ప్రస్తుతం అంతా ఆధునిక పోకడ.. సమాచారం పంపించాలన్నా.. తీసుకోవాలన్నా.. ప్రతీ ఒక్కరు ‘ఆన్లైన్’ సేవలపై ఆధారపడి ఉన్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు, మారుమూలలో ఉన్న పల్లె ప్రజల చేతిలో నేడు స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాలు రాయడం అనే మాట కనిపించదు.. వినిపించదు.. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి యువతరానికి, చిన్నారులకు టెలీగ్రాం, పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్ కవర్లు, రిజిష్టర్ పోస్టు, స్పీడ్ పోస్ట్, పోస్టల్ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు. ఈ క్రమంలో చిన్నారుల్లో ఉత్తరాలు రాసే అభిరుచితో పాటు జాతీయభావం పెంపొందించేందుకు భారత తపాలా శాఖ ఒక చిన్న ప్రయత్నం ప్రారంభించింది. మహాత్మాగాంధీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని జాతీయస్థాయిలో ఉత్తరాల పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. చిన్నారుల్లో జాతీయభావం, సృజనాత్మకతను వెలికితీసేందుకు తోడ్పడే జాతీయ ఉత్తరాల పోటీలో పాల్గొనేవారు పలు భారతీయ భాషల్లో ఉత్తరాలను రాయొచ్చు. ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు, ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో భావాలను వ్యక్తీకరించేందుకు వీలు కల్పించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ‘దాయ్ ఆఖర్’ అని పేరు పెట్టారు. నవంబర్ నెలాఖరు వరకు ఉత్తరాలు రాసేందుకు అవకాశం ఉంది. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే శీర్షికతో గాంధీ మహాత్ముడిని ఉద్దేశించి ఉత్తరాలు రాయాలి. ప్రధానంగా విద్యార్థి లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పోటీల నిర్వహణకు కార్యాచరణ రూపకల్పన చేశారు. ఇందులో అన్ని వయసుల వారు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయసు వారు ఒక కేటగిరీగా, 18 ఏళ్లు దాటినవారు మరో కేటగిరీగా విభజించారు. విజేతలకు నగదు పురస్కారాలు.. ► జాతీయస్థాయి ఉత్తరాల పోటీలో విజేతగా నిలిచేవారికి రూ.59 వేల నగదు. ద్వితీయ స్థానానికి రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు అందజేయడం జరుగుతుంది. రాష్ట్రస్థాయిలో విజేతకు రూ.25 వేలు, ద్వితీయ స్థానానికి రూ.10వేలు, తృతీయ స్థానానికి రూ.5వేలు ఇస్తారు. ► ఈ విధంగా రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన వారి ఉత్తరాలు జాతీయస్థాయి పోటీలకు నామినెట్ అవుతాయి. ఉత్తరాలు చేరడానికి ఈనెల చివరి వరకు గడువు ఉంది. రాష్ట్రస్థాయి ఫలితాలను 31 జనవరి, 2020న వెల్లడిస్తారు. జాతీయస్థాయి ఫలితాలను 2020 మార్చి31న విడుదల చేస్తారు. వ్యాసరచన పోటీ కాదు.. ► వ్యాసరచన పోటీ ఎంతమాత్రం కాదు. ఎందుకంటే మహాత్మాగాంధీని ఉద్దేశించి రాసిన ఉత్తరం మాదిరిగా ఉండాలి. రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచే వ్యక్తికి(రూ.25వేలు), జాతీయ స్థాయిలో విజేతకు రూ.50వేలు, రెండు పోటీల్లో విజేతగా నిలిస్తే గరిష్టంగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. తపాలా శాఖ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సైతం ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. బాపూ ఎందుకు అమరులయ్యారనే విషయంపై అవగాహన, ఆలోచన, భావ వ్యక్తీకరణ తదితర అంశాలపై గెలుపు ఆధారపడి ఉంటుందని గమనించాలి. చేతిరాతతోనే రాయాలి.. మీరు రాసే ఉత్తరంలో వయసుకు సంబంధించిన వివరాలను తప్పక రాయాలి. గెలుపొందాక మీ వయసు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించడం జరుగుతోంది. పాల్గొనదలిచిన వారు ‘దాయ్ ఆఖర్ జాతీయ ఉత్తరాల రాత పోటీ’ శీర్షికన ఇన్లాండ్ లెటర్లో అయితే 500 పదాలు మించకుండా, ఎన్వలప్ కవర్లో అయితే ఏ–4 సైజు పేపర్‌పై 1000 పదాలకు మించకుండా రాయాలి. టైపు చేసి పంపితే తిరస్కరించబడతాయి. సొంత చేతిరాతతో రాసి పంపినవాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పూర్తి వివరాలకు సమీపంలోని పోస్ట్ ఆఫీసులలో సంప్రదించవచ్చు. ‘నేను పాల్గొంటున్నా’.. మీరు కూడా.. భారత తపాలా శాఖ తలపెట్టిన ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’ అనే ఉత్తరాల పోటీలో నేనూ పాల్గొంటున్నా.. మీరందరు కూడా పాల్గొనాలి.. అని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్‌షిప్‌కు చెందిన చిన్నారి అరిగెల అనుశ్వి కోరుతోంది. మహాత్మాగాందీ 150వ జయంతోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ తపాల శాఖ నిర్వహిస్తున్న ఉత్తరాల పోటీల్లో పాల్గొనాలని ఉపాధ్యాయురాలితో కలిసి విజయసంకేతం చూపిస్తోంది. ఉత్తరాలు పంపించాల్సిన అడ్రస్.. చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ తెలంగాణ సర్కిల్ ఆబిడ్స్, హైదరాబాద్. -
చెన్నై నుంచి పాకిస్తాన్‌కు పార్సిళ్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తపాలాశాఖ కార్యాలయాల ద్వారా పాకిస్తాన్‌కు రోజుకొకటి చొప్పున నెలకు 30 పార్సిళ్లుగా వెళుతున్న తపాలాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవడం నిలిపివేశారు. జమ్ముకశ్మీర్ వ్యవహారంలో 370 ఆర్టికల్ రద్దు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు తపాలా సేవలను నిలుపుదల చేసింది. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం సర్వదేశ నియమ నిబంధనలకు విరుద్ధమని భారత్ ఖండించింది. ఆగస్టు 27వ తేదీ తరువాత భారత్ నుంచి ఎలాంటి తపాలా పార్సిళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం స్వీకరించలేదని సమాచారం. కాగా, తమిళనాడులోని అనేక ప్రాంతాల నుంచి పాకిస్తాన్‌కు ఉత్తరాలు, పార్సిళ్లు, డాక్యుమెంట్లు వెళుతుంటాయి. వీటిల్లో స్పీడ్‌పోస్టులు ముంబై మీదుగా, సాధారణ పోస్టులు ఢిల్లీ మార్గంలో పంపుతుంటారు. ఢిల్లీ లేదా ముంబై నుంచి రోడ్డు మార్గం లేదా విమానం కార్గోల ద్వారా భారత తపాలాశాఖ పాకిస్తాన్‌కు చేరవేస్తుంటుంది. ఎక్కువశాతం పార్సిళ్లలో వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు వెళుతుంటాయి. నెలకు ఐదు రిజిస్టర్ పోస్టులు వెళుతుంటాయి. చెన్నైలోని తపాలాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి తమిళనాడుకు వచ్చే తపాలా పార్సిళ్లు ఢిల్లీ మీదుగా వస్తున్నందున స్వదేశీ సేవగా పరిగణిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ నుంచి తమిళనాడుకు ఎన్ని పార్సిళ్లు వస్తున్నాయనే గణాంక వివరాలు మా వద్ద లేవు. తమిళనాడు నుంచి సగటున రోజుకొకటి అంటే నెలకు 30 పార్సిళ్లు పాకిస్తాన్‌కు వెళుతుంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తపాలా సేవలను నిలుపుదల చేసిన కారణంగా ఆ దేశానికి ఎలాంటి తపాలాలు పంపవద్దని కేంద్రం ఆదేశించింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు ఎలాంటి తపాలా పోస్టులు రిజిస్టర్ కాలేదని ఆయన చెప్పారు. -
ఖాతా ఏ బ్యాంకుదైనా ఆధార్ ద్వారా డ్రా
సాక్షి, ఖమ్మం: ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా ఆధార్‌కార్డు ఆధారంగా నగదు విత్ డ్రా చేసుకునే నూతన సౌకర్యాన్ని పోస్టల్ బ్యాంకు కల్పించినట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉసర్తి యలమందయ్య తెలిపారు. బుధవారం స్థానిక పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రారంభించి ఏడాది పూర్తయిందని, ఈ బ్యాంక్ నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో అన్ని వర్గాల ప్రజలు పలు రకాల సేవలు పొందుతున్నారని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంక్ సేవలు ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయని, దేశంలో ప్రతి ఒక్కరికీ, ఇంటి నుంచి బ్యాంక్ సేవలను అందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఐపీపీబీని ప్రారంభించిందన్నారు. బ్యాంక్ ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆధార్ ద్వారా నగదును విత్ డ్రా (ఆధార్ అనే బుల్డ్ పేమెంట్ సిస్టమ్) చేసుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తి ఆ బ్యాంక్‌లో నగదును కలిగి ఉండి బ్యాంక్, ఏటీఎం సౌకర్యాలు లేని ఏ ప్రాంతంలో ఉన్నా మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉన్నా ఆధార్ కార్డ్‌ను చూపించి బయోమెట్రిక్ విధానంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న పోస్టాఫీసులోని పోస్టల్ బ్యాంక్‌లో నగదును పొందవచ్చని చెప్పారు. ఈ విధానంలో పోస్టల్ బ్యాంక్ రూ.10 వేల నగదును అందించే సౌకర్యాన్ని కల్పించిందని, ఖాతాదారుడికి ఎలాంటి చార్జీలు కూడా ఉండవని పేర్కొన్నారు. సమావేశంలో ఖమ్మం డివిజన్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్ ఎ.అనిల్, ఏరియా మేనేజర్ జైల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కార్డు’ కథ కంచికేనా?
సాక్షి, హైదరాబాద్: ‘క్షేమంగా ఇల్లు చేరగానే ఓ కార్డు ముక్క రాయి...’కొన్నేళ్ల క్రితం ప్రతి ఇంటా సహజంగా వినిపించిన మాట ఇది. కుటుంబ క్షేమ సమాచారమైనా, దుఃఖాన్ని మోసుకొచ్చే వార్తయినా అరచేతంత ఉండే పోస్టు కార్డే దిక్కు. మరీ అత్యవసరమైతే టెలిగ్రామ్ చేయడం తప్ప ఇంటింటినీ పలకరించేది ఈ తోకలేని పిట్టనే. అయితే దాదాపు 150 ఏళ్ల క్రితం పెనవేసుకున్న ఆ బంధం ఇక తెగినట్టేననే అనుమానం కలుగుతోంది. సాంకేతిక విప్లవం నేపథ్యంలో కొరగాకుండా పోయిన తపాలా కార్డు కథ కంచికి చేరుతున్నట్టే కనిపిస్తోంది! రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క పోస్టు కార్డు కూడా లేకుండా పోయింది. గతంలో సరఫరా అయి వాడకుండా మిగిలిపోయినవి ఎక్కడైనా ఉంటే తప్ప ఏ తపాలా కార్యాలయంలోనూ పోస్టుకార్డులు కనిపించడంలేదు. తెలంగాణ సర్కిల్ ప్రధాన తపాలా కార్యాలయం జీపీఓ పరిధిలోనూ కార్డులు కానరావట్లేదు. గత వారం, పది రోజుల సంగతి కాదు... ఏకంగా గత ఆరు నెలలుగా తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు స్వయంగా పోస్టల్ అధికారులు ఇండెంట్ పెట్టినా అవి సరఫరా అవడం లేదు. అబిడ్స్‌లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీఓ) అధీనంలోని స్టాంప్స్, లెటర్స్ విభాగంలో కూడా ఒక్క కార్డు కూడా లేకుండా పోయింది. పోస్టుకార్డులు ఎందుకు సరఫరా కావడంలేదో అధికారులకే అంతు చిక్కకుండా ఉంది. నాసిక్ నుంచి ఆగిన సరఫరా.... ఇన్లాండ్ లెటర్స్, పోస్టు కార్డులు దేశవ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే ముద్రితమవుతాయి. హైదరాబాద్, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లలోనే వాటిని ప్రింట్ చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వాటి డిమాండ్, వాడకం బాగా తగ్గినందున కొన్నేళ్లుగా కేవలం నాసిక్‌లోని ప్రెస్లోనే పోస్టు కార్డులను ముద్రిస్తున్నారు. ఇక్కడి నుంచి గత పార్లమెంటు ఎన్నికలకు పూర్వం కొంత కోటా తెలంగాణకు విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ వాటి జాడలేదు. దీనిపై ఉన్నతాధికారులు వాకబు చేస్తే నాసిక్‌లోని ప్రెస్‌లో వాటి ముద్రణనే నిలిపేసినట్లు తెలిసింది. దీంతో పోస్ట్‌కార్డుల చలామణీని నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇదే విషయమై లోక్‌సభలో సభ్యులు ప్రశ్నించగా కొనసాగిస్తామనే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు మాత్రం ఏ విషయాన్ని స్పష్టం చేయడంలేదు. భారీ నష్టం.... ప్రస్తుతం తపాలా కార్డు విలువ 50 పైసలు. అత్యవసర వస్తువుల పరిధిలోనిదిగా పేర్కొంటూ నామమాత్రపు ధరకే తపాలాశాఖ వాటిని అందుబాటులో ఉంచుతోంది. మందంగా, అట్టలాగా ఉండే పోస్టుకార్డు ముద్రణతో తపాలాశాఖ ఏటా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ కార్డు తయారీకి దాదాపు రూ. 7.45 వరకు ఖర్చవుతుండగా ప్రజలకు కేవలం అర్ధ రూపాయికే అమ్ముతున్నారు. ప్రతి కార్డుపై దాదాపు రూ. 6.95 వరకు నష్టం వస్తోంది. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలనే జనం దాదాపుగా మరచిపోవడం, ఇతర అవసరాలకు కూడా పోస్ట్‌కార్డు వాడకం నామమాత్రంగా మారడంతో వాటిని ఇక నిలిపేయాలని తపాలాశాఖ ఉన్నతాధికారులు గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయితే దశాబ్దాలుగా పెనవేసుకున్న బంధం కావడంతో దాన్ని సెంటిమెంట్‌గా పేర్కొంటూ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అలాంటప్పుడు వాటి ధరనైనా పెంచాలని అధికారులు కోరినా పట్టించుకోలేదు. కానీ క్రమంగా జనం పోస్టుకార్డులను కొనడం బాగా తగ్గించారు. ఇటీవల ఉజ్జాయింపుగా కొన్ని పట్టణాల్లో వాటి వినియోగంపై అధికారులు లెక్కలు తీస్తే తెలంగాణ పరిధిలోని నిజామాబాద్ పట్టణంలో సంవత్సరకాలంలో అమ్ముడుపోయిన కార్డుల సంఖ్య కేవలం 69గా తేలింది. వాణిజ్య అవసరాలకు తప్ప వ్యక్తిగత అవసరాలకు కార్డుల వాడకం దాదాపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో క్రమంగా వాటి ముద్రణను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో వాటి పాత స్టాకు ఉన్నందున వాటినే సర్దుబాటు చేస్తూ అప్పటి వరకు ముద్రణను ఆపేయాలని నిర్ణయించినట్టు అధికారుల సమాచారం. రిటర్న్ కార్డులు ఉన్నా... కొన్ని సంస్థలు రిటర్న్ కార్డులను వాడుతున్నాయి. వినియోగదారులకు పంపి, తదుపరి సమాచారంతో అది తిరిగి సంస్థకు చేరేలా వీటిని రూపొందించారు. ఇవి వాణిజ్యపరమైన అవసరాలకే వాడుతున్నారు. ఇలాంటి కార్డులు జీపీఓ పరిధిలో దాదాపు 10 వేల వరకు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి కార్డు ధర రూపాయిగా ఉంది. కానీ జీపీఓలో ఉన్న స్టాక్ 15 పైసల నాటిది. ఆ పాత స్టాక్‌ను ఇప్పుడు వినియోగించాలంటే రూపాయి ధరకు సరిపోయేలా అంత విలువైన స్టాంపులు అతికించి వాడాల్సి ఉంటుంది. ఇవి తప్ప వేరే కార్డులు పూర్తిగా నిండుకున్నాయి. టెలిగ్రామ్ జాబితాలో చేరుతుందా...? మన దేశంలో 163 ఏళ్లపాటు కొనసాగిన టెలిగ్రామ్ సేవలను బీఎస్ఎన్ఎల్ 2013 జూలై 15న శాశ్వతంగా నిలిపేసింది. సాలీనా రూ. 400 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు పేర్కొంటూ ఆ విభాగాన్ని మూసేసింది. ఇప్పుడు అదే తరహాలో తపాలా కార్డులతో నష్టాలు వస్తున్నందున పోస్టుకార్డు చరిత్రకు కూడా ముగింపు పలుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరికొన్నేళ్లపాటు వాటిని కొనసాగించే అవకాశం ఉందని, డిమాండ్ తక్కువగా ఉన్నందున ముద్రణను తాత్కాలికంగా నిలిపివేసి ఉంటారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆకాశవాణి ప్రేక్షకుల ఆవేదన... పోస్టుకార్డు తరహాలో జనంతో బాగా పెనవేసుకున్న బంధం రేడియో సొంతం. ఆకాశవాణి ప్రసారాలను ఇప్పటికీ చాలా మంది వింటున్నారు. ఇందుకోసం ఆకాశవాణికి ఉత్తరాలు రాసే శ్రోతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పోస్టుకార్డులు శ్రోతల నుంచి ఆకాశవాణికి చేరుతుంటాయి. కానీ గత ఆరు నెలలుగా పోస్టుకార్డులు దొరకడం లేదంటూ శ్రోతలు ఆలిండియా రేడియోకి చెబుతున్నారు. కేవలం పోస్టుకార్డులు మాత్రమే రాసే పద్ధతి అక్కడ అమలులో ఉంది. ఇప్పుడు పోస్టుకార్డులు లేకపోయేసరికి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపాలంటూ రేడియో కేంద్రం పేర్కొంటుండటం గమనార్హం. -
నేరెళ్ల వేణుమాధవ్‌కు అరుదైన గౌరవం
-
నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మిమిక్రీలో 70 ఏళ్ల కళా జీవితాన్ని పూర్తి చేసుకున్న మిమిక్రీ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 86వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ ఆయనపై ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. మంగళవారం హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ తపాలా కవర్‌ను ఆవిష్కరించి విడుదల చేశారు. అనంతరం నేరెళ్ల వేణుమాధవ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తన అసమాన ధ్వని అనుకరణ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతికి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన దిగ్గజం వేణుమాధవ్ అని కొనియాడారు. మిమిక్రీలో 70 ఏళ్ల పాటు చేసిన కృషికి గుర్తుగా తపాలా శాఖ ఈ అరుదైన గౌరవం ఇస్తోందన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు దివంగత సంజయ్ గాంధీ సభలో వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శనను చూసి మంత్రముగ్ధుడిని అయ్యానని, ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు మామూలేనని, అయితే తపాలా శాఖ ఇచ్చిన ఈ అరుదైన గౌరవానికి మాటలు రావడం లేదన్నారు. తన పేరుపై ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.రాజేంద్రప్రసాద్, సినీనటుడు రావి కొండల్రావు, పోస్ట్‌మాస్టర్ జనరల్ ఏలిషా, డైరెక్టర్ వెన్నం ఉపేంద్ర, వీవీవీ సత్యనారాయణరెడ్డి, ఆశాలత, జీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా డాక్టర్ వైపీ రాయ్
భారత తపాలా శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా డాక్టర్ వైపీ రాయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. చత్తీస్గడ్ సీపీఎంజీగా విధులు నిర్వర్తిస్తోన్న ఆయను ఈ నెల 6న పోస్టల్ డెరైక్టరేట్ ఏపీ సర్కిల్‌కు బదిలీ చేసింది. న్యూఢిల్లీలోని జేఎన్టీయూలో బయోకెమిస్ట్రీలో పీహెచ్డీ చేసిన రాయ్ 1984లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌లో చేరారు. కొన్నాళ్లపాటు ఆర్మీ పోస్టల్లో పనిచేసిన ఆయన రెండేళ్లుగా చత్తీస్గడ్ సీపీఎంజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
ప్రశాంతంగా పోస్టల్ పరీక్ష
సాక్షి, విజయవాడ : భారత తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, హైదరాబాద్‌ల్లో 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 75 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1.50 లక్షల మందికి గాను 1.10 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. గుంటూరు డివిజన్లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు గాను 14 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే పోస్టుకు వెయ్యి మంది పరీక్ష రాశారన్నమాట. అదేవిధంగా ఖమ్మం డివిజన్లో 4 పోస్టులు ఖాళీ ఉంటే ఇక్కడా వెయ్యిమందికి పైగా పరీక్ష రాశారు.