సాక్షి, హైదరాబాద్: మిమిక్రీలో 70 ఏళ్ల కళా జీవితాన్ని పూర్తి చేసుకున్న మిమిక్రీ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 86వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ ఆయనపై ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. మంగళవారం హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ తపాలా కవర్‌ను ఆవిష్కరించి విడుదల చేశారు. అనంతరం నేరెళ్ల వేణుమాధవ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తన అసమాన ధ్వని అనుకరణ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతికి పేరుప్రతిష్టలు తెచ్చిపెట్టిన దిగ్గజం వేణుమాధవ్ అని కొనియాడారు.
మిమిక్రీలో 70 ఏళ్ల పాటు చేసిన కృషికి గుర్తుగా తపాలా శాఖ ఈ అరుదైన గౌరవం ఇస్తోందన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు దివంగత సంజయ్ గాంధీ సభలో వేణుమాధవ్ మిమిక్రీ ప్రదర్శనను చూసి మంత్రముగ్ధుడిని అయ్యానని, ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ.. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు మామూలేనని, అయితే తపాలా శాఖ ఇచ్చిన ఈ అరుదైన గౌరవానికి మాటలు రావడం లేదన్నారు. తన పేరుపై ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.రాజేంద్రప్రసాద్, సినీనటుడు రావి కొండల్‌రావు, పోస్ట్‌మాస్టర్ జనరల్ ఏలిషా, డైరెక్టర్ వెన్నం ఉపేంద్ర, వీవీవీ సత్యనారాయణరెడ్డి, ఆశాలత, జీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment