ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు సరికాదు
పోటీ ఉండాల్సిందే: శ్యాం రంగీలా
శ్యామ్ రంగీలా. మిమిక్రీ సంచలనం. ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వంటి నేతలను అనుకరిస్తూ 2017లో ఆయన చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సరిగ్గా ఏడేళ్ల తరవాత ఆయన స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అది కూడా వారణాసిలో మోదీపైనే పోటీ చేస్తున్నారు!
రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన శ్యామ్ యూట్యూబ్ చానల్‌కు దాదాపు కోటిమంది సబ్‌స్రై్కబర్లున్నారు. మోదీని అనుకరిస్తూ ‘ధంగ్ కీ బాత్’ షో కూడా నడుపుతున్నారాయన. ఒకప్పుడు మోదీకి మద్దతు పలికిన శ్యామ్ ఆయనపైనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి పలు ప్రశ్నలకు ఆయన ఇచి్చన సమాధానాలు...
ప్రధానిపై ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు?
ఇటీవల సూరత్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. అది సరికాదనిపించింది. ఎన్నికల ప్రక్రియే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పోటీ ఉండాలి. అలాకాకుండా బీజేపీ తన ప్రత్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయిస్తోంది. అందుకే నేను పోటీ చేస్తున్నా. ఒక సామాన్యుడు ప్రధానిపైనే పోటీలో నిలబడ్డాడనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా.
మీది రాజకీయ ప్రధాన హాస్యం. ప్రస్తుతం దేశ రాజకీయాల తీరుపై ఏమంటారు?
ఇప్పుడు రాజకీయాలే అతి పెద్ద కామెడీ. రాజకీయాల్లో హాస్యానికి కొదవే లేదు. కమెడియన్లను నిషేధించి రాజకీయాలు చేస్తున్నారు.
ఎన్నికల్లో పోటీ ఖర్చుతో కూడింది. మరి మీకు డబ్బులెలా...?
నా దగ్గర ఏమీ లేవు. నేనేం చేసినా ప్రజల సాయంతోనే. ‘అభీ తో జోలా హై బస్. ఉఠాకే చల్ దేంగే, ఔర్ క్యా?’ (నా దగ్గరున్నది జోలె మాత్రమే. అది తీసుకుని రోడ్డున పడతానంతే) ‘జోలా ఉఠాకే’ అన్నది ప్రధాని మోదీ డైలాగ్ కదా! ఒకప్పుడు ప్రధాని
మద్దతుదారుగా ఉన్న మిమ్మల్ని మార్చిందేమిటి?
2016 దాకా ప్రధానికి అభిమానినే. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక అవినీతి పోతుందని, పెద్ద మార్పు వస్తుందని చాలామందిమి భావించాం. అందుకే ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టేవాన్ని. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌కు ఎంపికైనప్పుడు ఎగిరి గంతేశా. మోదీని అనుకరిస్తూ నేను చేసిన వీడియోకు ప్రశంసలొచ్చాయి. కానీ అది ప్రసారమే కాలేదు. ప్రభుత్వం వద్దందని చానల్ వాళ్లు చెప్పారు. నేను మోదీని అనుకరించానంతే. ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు.
రాజకీయాలపై హాస్యానికి చాలా దేశాల్లో ఆదరణ ఉంది. భారత్‌లో పరిస్థితి ఏమిటనుకుంటున్నారు?
ఇక్కడ వ్యంగ్యాన్ని, హాస్యాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. రాజకీయాలపై హాస్యం ఇక్కడ పని చేయదు. అందుకే చానళ్లలో పొలిటికల్ కామెడీ షోలే ఉండవు. రాహుల్ గాంధీపై జోకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆహా్వనించవు, మోదీ మీద కామెడీ చేస్తే బీజేపీ ఊరుకోదు. అందుకే నా యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా.
వారణాసిలో ప్రచారమెలా ఉంది?
బాగా సాగుతోంది. నలుగురైదుగురు స్నేహితులు నా వెంట వచ్చారు. ఇక్కడ మరింతమంది కలిసొస్తున్నారు.
మీకు వారణాసి ప్రజల మద్దతు ఉందనుకుంటున్నారా?
కచ్చితంగా. పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచే నాకు మద్దతుగా సందేశాలు వస్తున్నాయి. వరుస కాల్స్ వస్తున్నాయి.
ప్రచారంలోనూ మోదీని మీ స్టయిల్లో అనుకరిస్తారా?
తప్పకుండా. మోదీకి ఆయన శైలిలోనే బదులిస్తానని ఇప్పటికే చెప్పా కూడా.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment