ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసిలో ఓ వృద్ధుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. ఆయన పేరు రామ్‌కుమార్ వైద్య. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా ఇందర్‌ఘడ్ వాసి. చిన్న కిరాణా దుకాణం నడుపుతుంటాడు. మోదీపై పోటీతో మాత్రమే కాదు.. నామినేషన్ టైంలోనూ ఆయన వార్తల్లోకి ఎక్కారు.
వారణాసిలో పోటీ కోసం రూ.25,000 రూపాయి నాణేలు డిపాజిట్ చేసి నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో చురాన్ బుదియా అమ్ముతూ వేలల్లో నాణేలను పోగేసి వాటినే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. వాటిని చూసి వాళ్లు కంగు తిన్నారు. కిందామీదా పడి నాణేలను లెక్కించారు.
మంగళవారం నామినేషన్ వేసేందుకు వైద్య 550 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ వారణాసి వచ్చాడు. ఆయనకు ప్రతిపాదకులుగా వారణాసిలోని కొందరు ఆటోడ్రైవర్లు సంతకాలు చేశారు. ఎన్నికల బరిలో దిగడం ఆయనకు ఇదేమీ కొత్త కాదు. ఇప్పటికే కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే దాకా పలు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి మాత్రం బరిలో దిగుతున్న పార్లమెంట్ స్థానాన్ని మార్చి అందరి దృష్టినీ ఆకర్షించారు.
వారణాసి ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తేందుకే తాను అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. ప్రధాని అయినా సరే, మోదీకి గట్టి పోటీ ఇస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తుండటం విశేషం. మిమిక్రీ సంచలనం, ప్రముఖ హాస్య కళాకారుడు శ్యామ్ రంగీలా కూడా వారణాసిలో మోదీపై ఇండిపెండెంట్‌గా బరిలో దిగడం తెలిసిందే. కానీ ఆయన నామినేషన్ బుధవారం తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పట్లాగే అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. వారణాసిలో జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment