సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తపాలాశాఖ కార్యాలయాల ద్వారా పాకిస్తాన్‌కు రోజుకొకటి చొప్పున నెలకు 30 పార్సిళ్లుగా వెళుతున్న తపాలాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవడం నిలిపివేశారు. జమ్ముకశ్మీర్ వ్యవహారంలో 370 ఆర్టికల్ రద్దు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు తపాలా సేవలను నిలుపుదల చేసింది. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం సర్వదేశ నియమ నిబంధనలకు విరుద్ధమని భారత్ ఖండించింది. ఆగస్టు 27వ తేదీ తరువాత భారత్ నుంచి ఎలాంటి తపాలా పార్సిళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం స్వీకరించలేదని సమాచారం. కాగా, తమిళనాడులోని అనేక ప్రాంతాల నుంచి పాకిస్తాన్‌కు ఉత్తరాలు, పార్సిళ్లు, డాక్యుమెంట్లు వెళుతుంటాయి. వీటిల్లో స్పీడ్‌పోస్టులు ముంబై మీదుగా, సాధారణ పోస్టులు ఢిల్లీ మార్గంలో పంపుతుంటారు.
ఢిల్లీ లేదా ముంబై నుంచి రోడ్డు మార్గం లేదా విమానం కార్గోల ద్వారా భారత తపాలాశాఖ పాకిస్తాన్‌కు చేరవేస్తుంటుంది. ఎక్కువశాతం పార్సిళ్లలో వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు వెళుతుంటాయి. నెలకు ఐదు రిజిస్టర్ పోస్టులు వెళుతుంటాయి. చెన్నైలోని తపాలాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి తమిళనాడుకు వచ్చే తపాలా పార్సిళ్లు ఢిల్లీ మీదుగా వస్తున్నందున స్వదేశీ సేవగా పరిగణిస్తున్నామని చెప్పారు. పాకిస్తాన్ నుంచి తమిళనాడుకు ఎన్ని పార్సిళ్లు వస్తున్నాయనే గణాంక వివరాలు మా వద్ద లేవు. తమిళనాడు నుంచి సగటున రోజుకొకటి అంటే నెలకు 30 పార్సిళ్లు పాకిస్తాన్‌కు వెళుతుంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తపాలా సేవలను నిలుపుదల చేసిన కారణంగా ఆ దేశానికి ఎలాంటి తపాలాలు పంపవద్దని కేంద్రం ఆదేశించింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు ఎలాంటి తపాలా పోస్టులు రిజిస్టర్ కాలేదని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment