‘కార్డు’ కథ కంచికేనా? | Postcards Not Available In Telangana For Six Months | Sakshi
Sakshi News home page

‘కార్డు’ కథ కంచికేనా?

Published Sun, Jun 23 2019 3:24 AM | Last Updated on Sun, Jun 23 2019 9:39 AM

Postcards Not Available In Telangana For Six Months - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘క్షేమంగా ఇల్లు చేరగానే ఓ కార్డు ముక్క రాయి...’కొన్నేళ్ల క్రితం ప్రతి ఇంటా సహజంగా వినిపించిన మాట ఇది. కుటుంబ క్షేమ సమాచారమైనా, దుఃఖాన్ని మోసుకొచ్చే వార్తయినా అరచేతంత ఉండే పోస్టు కార్డే దిక్కు. మరీ అత్యవసరమైతే టెలిగ్రామ్‌ చేయడం తప్ప ఇంటింటినీ పలకరించేది ఈ తోకలేని పిట్టనే. అయితే దాదాపు 150 ఏళ్ల క్రితం పెనవేసుకున్న ఆ బంధం ఇక తెగినట్టేననే అనుమానం కలుగుతోంది. సాంకేతిక విప్లవం నేపథ్యంలో కొరగాకుండా పోయిన తపాలా కార్డు కథ కంచికి చేరుతున్నట్టే కనిపిస్తోంది! రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క పోస్టు కార్డు కూడా లేకుండా పోయింది. 

గతంలో సరఫరా అయి వాడకుండా మిగిలిపోయినవి ఎక్కడైనా ఉంటే తప్ప ఏ తపాలా కార్యాలయంలోనూ పోస్టుకార్డులు కనిపించడంలేదు. తెలంగాణ సర్కిల్‌ ప్రధాన తపాలా కార్యాలయం జీపీఓ పరిధిలోనూ కార్డులు కానరావట్లేదు. గత వారం, పది రోజుల సంగతి కాదు... ఏకంగా గత ఆరు నెలలుగా తెలంగాణవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చివరకు స్వయంగా పోస్టల్‌ అధికారులు ఇండెంట్‌ పెట్టినా అవి సరఫరా అవడం లేదు. అబిడ్స్‌లోని జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ (జీపీఓ) అధీనంలోని స్టాంప్స్, లెటర్స్‌ విభాగంలో కూడా ఒక్క కార్డు కూడా లేకుండా పోయింది. పోస్టుకార్డులు ఎందుకు సరఫరా కావడంలేదో అధికారులకే అంతు చిక్కకుండా ఉంది.  

నాసిక్‌ నుంచి ఆగిన సరఫరా.... 
ఇన్‌లాండ్‌ లెటర్స్, పోస్టు కార్డులు దేశవ్యాప్తంగా రెండు చోట్ల మాత్రమే ముద్రితమవుతాయి. హైదరాబాద్, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లలోనే వాటిని ప్రింట్‌ చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వాటి డిమాండ్, వాడకం బాగా తగ్గినందున కొన్నేళ్లుగా కేవలం నాసిక్‌లోని ప్రెస్‌లోనే పోస్టు కార్డులను ముద్రిస్తున్నారు. ఇక్కడి నుంచి గత పార్లమెంటు ఎన్నికలకు పూర్వం కొంత కోటా తెలంగాణకు విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ వాటి జాడలేదు. దీనిపై ఉన్నతాధికారులు వాకబు చేస్తే నాసిక్‌లోని ప్రెస్‌లో వాటి ముద్రణనే నిలిపేసినట్లు తెలిసింది. దీంతో పోస్ట్‌కార్డుల చలామణీని నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇదే విషయమై లోక్‌సభలో సభ్యులు ప్రశ్నించగా కొనసాగిస్తామనే కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు మాత్రం ఏ విషయాన్ని స్పష్టం చేయడంలేదు. 

భారీ నష్టం.... 
ప్రస్తుతం తపాలా కార్డు విలువ 50 పైసలు. అత్యవసర వస్తువుల పరిధిలోనిదిగా పేర్కొంటూ నామమాత్రపు ధరకే తపాలాశాఖ వాటిని అందుబాటులో ఉంచుతోంది. మందంగా, అట్టలాగా ఉండే పోస్టుకార్డు ముద్రణతో తపాలాశాఖ ఏటా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఈ కార్డు తయారీకి దాదాపు రూ. 7.45 వరకు ఖర్చవుతుండగా ప్రజలకు కేవలం అర్ధ రూపాయికే అమ్ముతున్నారు. ప్రతి కార్డుపై దాదాపు రూ. 6.95 వరకు నష్టం వస్తోంది. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలనే జనం దాదాపుగా మరచిపోవడం, ఇతర అవసరాలకు కూడా పోస్ట్‌కార్డు వాడకం నామమాత్రంగా మారడంతో వాటిని ఇక నిలిపేయాలని తపాలాశాఖ ఉన్నతాధికారులు గతంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 

అయితే దశాబ్దాలుగా పెనవేసుకున్న బంధం కావడంతో దాన్ని సెంటిమెంట్‌గా పేర్కొంటూ కేంద్రం అందుకు అంగీకరించలేదు. అలాంటప్పుడు వాటి ధరనైనా పెంచాలని అధికారులు కోరినా పట్టించుకోలేదు. కానీ క్రమంగా జనం పోస్టుకార్డులను కొనడం బాగా తగ్గించారు. ఇటీవల ఉజ్జాయింపుగా కొన్ని పట్టణాల్లో వాటి వినియోగంపై అధికారులు లెక్కలు తీస్తే తెలంగాణ పరిధిలోని నిజామాబాద్‌ పట్టణంలో సంవత్సరకాలంలో అమ్ముడుపోయిన కార్డుల సంఖ్య కేవలం 69గా తేలింది. వాణిజ్య అవసరాలకు తప్ప వ్యక్తిగత అవసరాలకు కార్డుల వాడకం దాదాపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో క్రమంగా వాటి ముద్రణను కూడా నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో వాటి పాత స్టాకు ఉన్నందున వాటినే సర్దుబాటు చేస్తూ అప్పటి వరకు ముద్రణను ఆపేయాలని నిర్ణయించినట్టు అధికారుల సమాచారం.  

రిటర్న్‌ కార్డులు ఉన్నా... 
కొన్ని సంస్థలు రిటర్న్‌ కార్డులను వాడుతున్నాయి. వినియోగదారులకు పంపి, తదుపరి సమాచారంతో అది తిరిగి సంస్థకు చేరేలా వీటిని రూపొందించారు. ఇవి వాణిజ్యపరమైన అవసరాలకే వాడుతున్నారు. ఇలాంటి కార్డులు జీపీఓ పరిధిలో దాదాపు 10 వేల వరకు నిల్వ ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి కార్డు ధర రూపాయిగా ఉంది. కానీ జీపీఓలో ఉన్న స్టాక్‌ 15 పైసల నాటిది. ఆ పాత స్టాక్‌ను ఇప్పుడు వినియోగించాలంటే రూపాయి ధరకు సరిపోయేలా అంత విలువైన స్టాంపులు అతికించి వాడాల్సి ఉంటుంది. ఇవి తప్ప వేరే కార్డులు పూర్తిగా నిండుకున్నాయి.  

టెలిగ్రామ్‌ జాబితాలో చేరుతుందా...? 
మన దేశంలో 163 ఏళ్లపాటు కొనసాగిన టెలిగ్రామ్‌ సేవలను బీఎస్‌ఎన్‌ఎల్‌ 2013 జూలై 15న శాశ్వతంగా నిలిపేసింది. సాలీనా రూ. 400 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు పేర్కొంటూ ఆ విభాగాన్ని మూసేసింది. ఇప్పుడు అదే తరహాలో తపాలా కార్డులతో నష్టాలు వస్తున్నందున పోస్టుకార్డు చరిత్రకు కూడా ముగింపు పలుకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరికొన్నేళ్లపాటు వాటిని కొనసాగించే అవకాశం ఉందని, డిమాండ్‌ తక్కువగా ఉన్నందున ముద్రణను తాత్కాలికంగా నిలిపివేసి ఉంటారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.  

ఆకాశవాణి ప్రేక్షకుల ఆవేదన... 
పోస్టుకార్డు తరహాలో జనంతో బాగా పెనవేసుకున్న బంధం రేడియో సొంతం. ఆకాశవాణి ప్రసారాలను ఇప్పటికీ చాలా మంది వింటున్నారు. ఇందుకోసం ఆకాశవాణికి ఉత్తరాలు రాసే శ్రోతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నిత్యం వందల సంఖ్యలో పోస్టుకార్డులు శ్రోతల నుంచి ఆకాశవాణికి చేరుతుంటాయి. కానీ గత ఆరు నెలలుగా పోస్టుకార్డులు దొరకడం లేదంటూ శ్రోతలు ఆలిండియా రేడియోకి చెబుతున్నారు. కేవలం పోస్టుకార్డులు మాత్రమే రాసే పద్ధతి అక్కడ అమలులో ఉంది. ఇప్పుడు పోస్టుకార్డులు లేకపోయేసరికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపాలంటూ రేడియో కేంద్రం పేర్కొంటుండటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement