సాక్షి, అమరావతి: కోవిడ్ భయాలు వెంటాడుతున్నప్పటికీ గత మూడేళ్లుగా రాష్ట్రంలో గడప వద్దకే బ్యాంకింగ్ సేవలు గణనీయంగా విస్తరించాయి. డిపాజిట్లు, రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు, బ్యాంకు శాఖల విస్తరణ, ఏటీఎంలు ఇలా అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్‌ఎల్‌బీసీ) తాజా నివేదికలో పేర్కొంది.
ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆర్థిక సేవల సమ్మిళిత వృద్ధి (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్)’ కార్యక్రమంలో భాగంగా రాష్రంలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ)ల సేవలు గణనీయంగా పెరిగాయి. 2020 మార్చి నాటికి 6,264 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండగా 2022 మార్చి నాటికి 38,295 మందికి చేరింది.
ఇండియన్ పోస్టల్ బ్యాంక్, ఫినోపేమెంట్ బ్యాంక్ కరస్పాండెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల నగదు బదిలీ నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నట్లు రాష్ట్ర ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. 5,000 జనాభా ఉన్న గ్రామాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవాలన్న ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మన రాష్ట్రంలో 567 గ్రామాల్లో కోర్ బ్యాంకింగ్ సేవలను (సీబీఎస్) అందుబాటులోకి తెచ్చారు.
ప్రతి 5 కిలోమీటర్లకు బ్యాంకింగ్ సేవలు ఉండాలన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 243 గ్రామాలను గుర్తించారు. ఇందులో 229 గ్రామాలకు బీసీలు, పోస్టాఫీసుల ద్వారా సేవలు అందిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో 334 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతు భరోసా కేంద్రం, సచివాలయాల వద్ద బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసింది.
లక్ష్యానికి మించి రుణాలు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గత మూడేళ్లుగా రాష్ట్రంలో మొత్తం రుణాలు లక్ష్యానికి మించి మంజూరవుతున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి పారిశ్రామిక రంగం కాకుండా ఇతర రంగాలకు మొత్తం రూ.2,83,380 కోట్లు రుణాలుగా ఇవ్వాలని ఎస్‌ఎల్‌బీసీ లక్ష్యంగా నిర్దేశించుకోగా ఏకంగా 33 శాతం అధికంగా రూ.3,77,436 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మొత్తం రుణాల్లో 40 శాతం ప్రాధాన్యత రంగాలకు ఇవ్వాలి. ఇది మన రాష్ట్రంలో 64.97 శాతంగా ఉంది. 2021–22 సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.3,26,871 కోట్లు మంజూరయ్యాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగానికి బ్యాంకులు కనీసం 18 శాతం రుణాలు ఇవ్వాల్సి ఉండగా 42.17% రుణాలను మంజూరు చేశాయి.
వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్దేశించుకుంటే బ్యాంకులు ఏకంగా రూ.2,12,170 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.44,500 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.44,815 కోట్లు మంజూరు చేశాయి.
గడప గడపకీ విస్తరిస్తున్న బ్యాంకింగ్ సేవలు
Published Sun, Jun 12 2022 3:37 AM | Last Updated on Sun, Jun 12 2022 2:46 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment