సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం ఉత్తరాల బట్వాడా.. చిన్న మొత్తాల పొదుపు, బీమా తదితర సేవలను అందిస్తున్న తపాలా శాఖ ఇకపై పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందించనుంది. గ్రామీణ ప్రాం తాల్లో సరిపడా బ్యాంకు శాఖలు లేకపోవడం, గ్రామీ ణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై పూర్తి అవగాహన లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తపాలా శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ)ను ఏర్పాటు చేసింది.
ఐపీపీబీ ద్వారా ఖాతాదారులు, ప్రజలకు సులభతరంగా బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. ఇప్పటివరకూ పొదుపు ఖాతా తెరడానికి వినియోగదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటే ఇకపై ఇంటి వద్దనే పోస్టల్ బ్యాంకు ఖాతా తెరవవచ్చు. నగరంలోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో), ప్రధాన తపాలా కార్యాలయాలు(హెచ్‌పీవో), ఉప తపాలా కార్యాలయాలు(ఎస్‌పీవో), బ్రాంచి పోస్టాఫీసు(బీపీవో)ల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి తపాలా శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
ఇప్పటికే తపాలా సిబ్బందికి కర్ణాటక లోని మైసూర్‌లో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. మేనేజర్లను నియమించింది. దేశంలోని 650 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తుండగా.. రాష్ట్రం లో తొలి విడతగా హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో కి తెచ్చింది. తపాలా శాఖ ఏ పథకం తెచ్చినా నగరంలోని జీపీవోలో మొదట ప్రారంభిస్తామని ఖైరతాబాద్ సీనియర్ పోస్టుమాస్టర్ జయరాజ్ తెలిపారు.
ఇంటి వద్దనే లావాదేవీలు..
♦ పొదుపు ఖాతా కోసం ఆధార్ కార్డు ఉంటే చాలు. సంబంధిత పోస్ట్‌మాన్ ఇంటికి వచ్చి ఖాతా తెరు స్తారు. వారికి ఆండ్రాయిడ్ ఫోన్, బయోమెట్రిక్ పరికరం ఇస్తారు.
♦ తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతా మాత్ర మే తెరవడానికి వీలుండేది. ప్రస్తుతం కరెంట్ ఖాతా కూడా తెరవవచ్చు.
♦ ఖాతాదారు రోజుకు రూ.లక్ష వరకు నగదు లావాదేవీలు చేయవచ్చు. తపాలా కార్యాలయాలకు వెళ్లలేని వారు వివిధ లావాదేవీలను ఇంటివద్దనే నిర్వహించే వీలుంది. ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డులు, చెక్కుల లావాదేవీలు నిర్వహించవచ్చు.
♦ నగదు డిపాజిట్, ఉపసంహరణ కోసం సంబంధిత పోస్ట్‌మాన్‌కు 24గంటల ముందు సందేశం పంపితే ఇంటికి వచ్చి లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ లావాదేవీలు రూ.10 వేలకు మించరాదు. బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్ర తీసుకుంటారు.
♦ నగదు ఉపసంహరించుకున్నా, డిపాజిట్ చేసినా వాయిస్ మెసేజ్ వస్తుంది. దీంతో చదువు రాని వారు కూడా లావాదేవీలు తెలుసుకోవచ్చు.
♦ పోస్టల్ ఏటీఎం ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీ లు వసూలు చేయరు. ఎన్నిసార్లు నగదు తీసుకు న్నా అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment