బ్యాంకుకు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు
బ్యాంకింగ్ సేవల తీరుతెన్నులు గణనీయంగా మారిపోతున్నాయి. గతంలో డిపాజిట్ చేయాలన్నా, తీయాలన్నా ప్రతి దానికీ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏటీఎంలు వచ్చిన తర్వాత అది తగ్గింది. అలాగే ఇటీవలి కాలంలో మరికొన్ని మార్గాలూ అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులకు వెళ్లకుండానే సేవలను పొందే మార్గాల్లో కొన్ని ఇవి..
మిస్డ్ కాల్ సర్వీస్..
కొన్ని నగదు రహిత లావాదేవీల కోసం బ్యాంకులు ఈ టోల్ ఫ్రీ సర్వీసును అందిస్తున్నారు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, చెక్ బుక్ రిక్వెస్టులు, అకౌంటు స్టేట్‌మెంట్స్ మొదలైన వాటికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. కస్టమరు కోరిన సర్వీసుకు సంబంధించి ఫోనుకు అప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్ అలర్ట్ రూపంలో సమాచారం వస్తుంది. బేసిక్ ఫోన్లతో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. దీన్ని ఉచితంగానే బ్యాంకులు అందిస్తున్నాయి.
డెబిట్ కార్డుల వాడకం..
షాపింగ్‌కి బయలుదేరేటప్పుడు నగదును విత్‌డ్రా చేసుకోవడం, వెంట తీసుకెళ్లడం కాస్త రిస్కు కావొచ్చు. కాబట్టి సాధ్యమైన చోట్ల డెబిట్ కార్డులను ఉపయోగిస్తే నగదును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్‌లో కార్డ్ స్వైప్ చేసి పిన్ నంబరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇది సురక్షితం, సౌకర్యవంతమైన సాధనం. పెపైచ్చు ప్రస్తుతం డెబిట్ కార్డు లావాదేవీలపై ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
మొబైల్ బ్యాంకింగ్..నెట్ బ్యాంకింగ్..
ప్రస్తుతం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఎక్కడైనా, ఎప్పుడైనా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వీలుంది. బిల్లులు కట్టాలన్నా, రుణాల ఈఎంఐలు చెల్లించాలన్నా, లేదా ఇతరులకు నగదు బదిలీ చేయాలన్నా ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్ వంటి సదుపాయాలను ఫోన్లు, నెట్ ద్వారా చేసే సదుపాయం ఉంది.
నాలుగైదు రోజులకోసారి ఏటీఎంకు..
ఏటీఎం లావాదేవీలపై పరిమితులు విధించిన నేపథ్యంలో వీటి వాడకం కూడా భారంగా మారనుంది. కాబట్టి ప్రతిరోజూ ఏటీఎంలకు వెళ్లకుండా నాలుగైదు రోజులకోసారి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఈలోగా మరీ అత్యవసరమైతే తప్ప వెళ్లకండి. సాధ్యమైనంత వరకూ ఏటీఎంలను నగదు విత్‌డ్రాయల్స్‌కే ఉపయోగించండి. సొంత బ్యాంకు ఏటీఎంలలో 5 లావాదేవీలను ఉచితంగా ఇస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోండి. మీ మొబైల్ ఫోనులో బ్యాంకు యాప్‌తో సమీపంలోని ఏటీఎం సమాచారం తెలుసుకోవచ్చు.