
తెలుగు రాష్ట్రాలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దృష్టి
వచ్చే ఏడాది కొత్తగా 60కిపైగా శాఖలు
బ్యాంకింగ్ సేవలు లేని గ్రామాలే ప్రాధాన్యం
తెలంగాణలో 150వ శాఖ ప్రారంభం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ మధుసూదన్ హెగ్డే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎటువంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటురంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. ఇందుకోసం కేవలం ఇద్దరు ఉద్యోగులతో అన్ని సేవలను అందించే విధంగా ‘మినీ బ్రాంచ్’లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో 30కిపైగా మినీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాదిలోగా మరో 15 మినీ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ మధుసూదన్ హెగ్డే తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 150వ శాఖను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది కొత్తగా 60 శాఖలను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో 20 నుంచి 25 శాతం మినీ బ్యాంకు శాఖలుంటాయన్నారు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీకి తెలంగాణలో 150, ఆంధ్రప్రదేశ్‌లో 107 శాఖలున్నాయి. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు పెరిగే అవకాశాలు ఉండటంతో అక్కడ కొత్త శాఖల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే శాఖల ద్వారా సుమారుగా 800 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు.
తెలంగాణలో 150వ శాఖ
అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో 150వ శాఖను కొండాపూర్‌లో లాంఛనంగా ప్రారంభించారు. 1997లో తొలి శాఖను లకిడికాపూల్‌లో ఏర్పాటు చేశామని, ప్రస్తుతం బ్యాంకు వ్యాపార పరిమాణం రూ. 30,700 కోట్లు దాటిందన్నారు. పరిశ్రమ నమోదు చేస్తున్న వృద్ధిరేటు కంటే సగటున 6-7 శాతం అధిక వృద్ధిరేటును నమోదు చేస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వ్యాపారంలో అదే విధమైన వృద్ధిని కొనసాగించగలమన్న ధీమాను హెగ్డే వ్యక్తం చేశారు.