ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్‌కు ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు’ లభించింది. మహమ్మారి కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, భౌగోళిక ఉద్రిక్తతల వంటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మార్కెట్లను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకుగాను ఇంటర్నేషనల్ పబ్లికేషన్ సెంట్రల్ బ్యాంకింగ్ శక్తికాంతదాస్‌ను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికచేసింది. భారత దేశం నుంచి 2015లో మొట్టమొదటిసారి అప్పటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు ఈ అవార్డు దక్కింది.
కీలక సమయాల్లో గవర్నర్ శక్తికాంతదాస్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఇంటర్నేషనల్ పబ్లికేషన్ తాజాగా పేర్కొంది. పేమెంట్ వ్యవస్థసహా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపింది. కరోనా మహమ్మారిని ప్రస్తావిస్తూ, కీలక సవాలును భారత్ ఎదుర్కొనగలిగినట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు అందరూ భిన్నమైన ప్రాధాన్యతలను కలిగి ఉన్న ప్రభుత్వాలతో కలిసి పనిచేయడంలో సాధారణంగా కష్టాలు ఎదుర్కొంటుంటారని పేర్కొన్న పబ్లికేషన్, ఆయా సమన్వయ చర్యల్లో దాస్ చక్కటి ప్రగతి సాధించగలిగారని వివరించింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో దాస్ మాట్లాడుతూ, వైరస్‌ను ఎదుర్కొనడానికి నిరంతర పోరాటం అవసరం అన్నారు. ఇటు సాంప్రదాయ పద్ధతుల్లో అటు అసాధరణమైన రీతిలో ఈ పోరాట చర్యలు ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment