
ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు వచ్చాక కొన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసులను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ఏటీఎంలు వచ్చి చాలా కాలమైనా ఇప్పటికీ చాలా మంది వీటిని కేవలం క్యాష్ విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సేవలకు మాత్రమే వాడుతున్నారు. వాస్తవానికి ఏటీఎంలు ఈ రెండింటికే పరిమితం కాకుండా ఇతరత్రా అనేక బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తున్నాయి. వాటిపై పూర్తి అవగాహన కల్పించడానికే ఈ కథనం.
నగదు డిపాజిట్లు చేయొచ్చు..
ప్రస్తుతం చాలా మటుకు బ్యాంకుల ఏటీఎంలలో నగదు డిపాజిట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. వీటిల్లో చిన్న మొత్తాలు డిపాజిట్ చేసుకోవచ్చు. సదరు డిపాజిట్ మెషీన్లో మీ కార్డును ఇన్‌సర్ట్ చేస్తే డిపాజిట్ ఎలా చేయాలన్న సూచనలు తెరపై కనిపిస్తాయి. వాటిని పాటిస్తూ, మీరెంత అమౌంటు డిపాజిట్ చేస్తున్నారన్నది ఎంటర్ చేస్తే చాలు. మెషీన్ మీ డిపాజిట్‌ను ధ్రువీకరించిన తర్వాత ఆ వివరాలకు సంబంధించిన ధ్రువీకరణ మెసేజి కూడా మీకు వస్తుంది.
ప్రీ–అప్రూవ్డ్ పర్సనల్ లోన్ దరఖాస్తులు..
ఏటీఎంల ద్వారా ఎలాంటి బాదరబందీ లేకుండా రుణం కూడా పొందవచ్చనే అంశం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఖాతాదారు లావాదేవీల తీరుతెన్నులు, రుణాల చెల్లింపు విధానం, క్రెడిట్ స్కోరు మొదలైనవాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు కొన్ని సార్లు ప్రి–అప్రూవ్డ్ లోన్‌లు ఆఫర్ చేస్తుంటాయి.
చిన్నపాటి సూచనలు పాటిస్తూ ఏటీఎంల ద్వారానే ఈ లోన్‌లను తక్షణం పొందవచ్చు. ఇందుకోసం ఏటీఎం స్క్రీన్ మీద పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంచుకుంటే.. మీకు లోన్ ఆఫర్ ఏదైనా ఉంటే తెరపై కనిపిస్తుంది. వడ్డీ రేట్లు, చార్జీలు, వ్యవధి మొదలైనవన్నీ మీకు ఆమోదయోగ్యమైతే, షరతులు.. నిబంధనలకు ఓకే చెప్పిన పక్షంలో మీ బ్యాంకు ఖాతాలోకి రుణ మొత్తం తక్షణం క్రెడిట్ అవుతుంది.
నగదు బదిలీ చేసుకోవచ్చు..
సొంత బ్యాంకు లేదా ఇతర బ్యాంకుల్లోని అకౌంట్లకు కూడా నగదు ట్రాన్స్‌ఫర్ చేసే సదుపాయాన్ని ఏటీఎంలు అందిస్తున్నాయి. ఇందుకోసం ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఐఎంపీఎస్ ఆప్షన్‌ని ఎంచుకుని, లబ్ధిదారు ఖాతా, మొబైల్ నంబరు, ఎంఎంఐడీ, ఎంత మొత్తం బదిలీ చేయాలనుకుంటున్నారు వంటి వివరాలను పొందుపర్చి, కన్‌ఫర్మ్ చేస్తే చాలు. ఫండ్ ట్రాన్స్‌పర్ లావాదేవీ పూర్తయిపోయినట్లే.
బిల్లులూ చెల్లించొచ్చు..
కరెంటు బిల్లు, గ్యాస్ సిలిండర్ బిల్లు మొదలైన బిల్లులన్నీ చెల్లించేందుకు కూడా ఏటీఎంలు ఉపయోగపడతాయి. డెబిట్ కార్డు ఇన్‌సర్ట్ చేశాక, పిన్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత.. సదరు బిల్లు సర్వీసును ఎంచుకుని చెల్లించేయవచ్చు.
మొబైల్, డీటీహెచ్ రీచార్జ్..
ఏటీఎంల ద్వారా ప్రీపెయిడ్ మొబైల్, డీటీహెచ్ కనెక్షన్లను రీచార్జ్ చేయించుకోవచ్చు. మీ కనెక్షన్ నంబరు, రీచార్జ్ అమౌంటు వివరాలు పొందుపరిస్తే చాలు. మీ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయ్యాక.. మీ మొబైల్ లేదా డీటీహెచ్ కనెక్షన్ రీచార్జ్ పూర్తవుతుంది.
టర్మ్ డిపాజిట్ లేదా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి...
కొన్ని బ్యాంకుల ఏటీఎంల నుంచి నేరుగా ఫిక్సిడ్ డిపాజిట్లు కూడా చేయొచ్చు. ఎంత అమౌంటు ఎఫ్‌డీ చేద్దామనుకుంటున్నారు? కాల వ్యవధి ఎంత? వడ్డీ రేటెంత? వంటి వివరాలు ఎంటర్ చేసి, కన్ఫర్మ్ చేస్తే చాలు. లావాదేవీ పూర్తయిపోయాక.. మీ రిజిస్టర్డ్ అడ్రెస్‌కు ఎఫ్‌డీ సర్టిఫికెట్ పోస్టులో వస్తుంది. ఇక ఏటీఎం ద్వారా ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. సర్వీసును ఉపయోగించుకోవడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకుని ఉండాలి.
ఆధార్ వివరాల నమోదు.. బీమా ప్రీమియంల చెల్లింపు..
ఏటీఎం ద్వారా మీ ఖాతాకు ఆధార్ నంబరును అనుసంధానం చేయొచ్చు. ఇందుకోసం ఏటీఎంలోకి కార్డ్ ఇన్‌సర్ట్ చేశాక రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లాగిన్ అయ్యాక, ఏ తరహా అకౌంటన్నది ఎంచుకుని, ఆధార్ నంబరు ఎంటర్ చేశాక... ఓకే చేస్తే సరిపోతుంది. మీ వివరాలు నమోదవుతాయి.
ఇది జరిగిన 24 గంటల్లో సీడింగ్ కన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ లైఫ్ వంటి బీమా సంస్థలూ ఏటీఎంల ద్వారా బీమా ప్రీమియం కట్టే వెసులుబాటు అందిస్తున్నాయి. ఇందుకు బిల్ పే ఆప్షన్‌ను ఎంచుకుని, బీమా సంస్థ, పాలసీ నంబరు, పుట్టిన తేది, ప్రీమియం వంటి వివరాలు పొందుపర్చాక.. చెల్లింపును ధ్రువీకరించాలి.
కార్డ్‌రహిత నగదు విత్‌డ్రాయల్స్..
డెబిట్ కార్డు ద్వారానే కాకుండా కార్డు లేకుండా కూడా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే, కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫీచరు గల ఏటీఎంలు అందుబాటులో ఉన్న వేరే ఎవరికైనా కూడా ఈ విధానంలో నిధులను ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. నిర్దిష్ట కోడ్స్‌ని, అమౌంటుని, మొబైల్ నంబరుని ఎంటర్ చేస్తే చాలు.. ఏటీఎం లేదా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం మెషీన్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇవి కాకుండా బ్యాంకులు ఇతరత్రా కూడా పలు సర్వీసులు ఏటీఎంల ద్వారా అందిస్తున్నాయి. మీ బ్యాంకును సంప్రతిస్తే ఆ వివరాలు పొందవచ్చు.