ముంబై: బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు, పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు చిన్న స్థాయి ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ), పేమెంట్ బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గురువారం తుది మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం మొబైల్ ఆపరేటర్లు, సూపర్ మార్కెట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ సహకార సంస్థలు పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేయొచ్చు.
ప్రస్తుత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ), సూక్ష్మ రుణ సంస్థలు మొదలైనవి చిన్న స్థాయి ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, భారీ ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక సంస్థలను మాత్రం ఆర్‌బీఐ ఇందుకు అనుమతించదు. ఇక, ఈ కొత్త తరహా బ్యాంకుల ఏర్పాటుకు కనీస మూలధనం రూ. 100 కోట్లుగా ఆర్‌బీఐ నిర్ణయించింది. నిర్దిష్ట నిబంధనలను పూర్తి చేయగలిగితే ఈ చిన్న బ్యాంకులు పూర్తి స్థాయి బ్యాంకులుగా మారవచ్చు. తొలి రౌండులో పర్మిట్ల కోసం ఆసక్తి గల సంస్థలు జనవరి 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆర్‌బీఐ సూత్రప్రాయంగా ఇచ్చే అనుమతుల గడువు 18 నెలల దాకా ఉంటుంది.
పేమెంట్ బ్యాంకులు రుణ వితరణ కార్యకలాపాలు జరిపేందుకు అనుమతి ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వీటి ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభ దశలో ఇలాంటి బ్యాంకులో ఒక్కో వ్యక్తిగత ఖాతాదారుకు సంబంధించి గరిష్టంగా రూ. 1 లక్ష మించి బ్యాలెన్స్ అనుమతించరు. ఇవి ఏటీఎం/డెబిట్ కార్డులతో పాటు ఇతరత్రా ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను జారీ చేయొచ్చు. క్రెడిట్ కార్డులు మాత్రం జారీ చేయకూడదు. ఇక, చిన్న ఫైనాన్స్ బ్యాంకుల విషయానికొస్తే.. ఇవి డిపాజిట్ల స్వీకరణతో పాటు చిన్న.. సన్నకారు రైతులకు, చిన్నవ్యాపార సంస్థలు మొదలైన వాటికి రుణాలివ్వడం వంటి ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు.
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు చేసేందుకు అవసరమైన అనుభవం ఉన్న వ్యక్తులు, ప్రొఫెషనల్స్‌తో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్ బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్, మొబైల్ టెలిఫోన్ కంపెనీలు, సూపర్ మార్కెట్ చెయిన్స్, కార్పొరేట్ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సేవలు అంతగా విస్తరించని ప్రాంతాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఏర్పాటు చేయదల్చుకున్న వ్యక్తులకు బ్యాంకింగ్.. ఫైనాన్స్ రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి.
బరిలో ఉన్నవి..: శ్రీరామ్ క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఈ తరహా బ్యాంకుల ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించాయి. ఇట్జ్‌క్యాష్, ఆక్సిజెన్, మణప్పురం ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్‌తో కూడా ఆసక్తిగా ఉన్నాయి.
‘సూపర్ మార్కెట్’ బ్యాంకులు వస్తున్నాయ్..!
Published Fri, Nov 28 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement
Advertisement