ఫైల్ ఫోటో
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. రేపు (మంగళవారం, అక్టోబరు 22) ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. రెండు బ్యాంకు సంఘాలు అక్టోబర్ 22న 24 గంటల సమ్మెను ప్రకటించడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇటీవలి బ్యాంకు విలీనాలు, డిపాజిట్ రేట్లు తగ్గడం, ఉద్యోగ భద్రత సమస్యలపై నిరసనగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) మరియు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఈ సమ్మెను చేపట్టనున్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనవు.అయితే తన ఉద్యోగులలో ఎక్కువమంది పాల్గొనే యూనియన్లలో సభ్యులు కానందున సమ్మె ప్రభావం తమ కార్యకలాపాలపై తక్కువగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పేర్కొంది. సమ్మె కారణంగా తమ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ రెగ్యులేటరీకి ఇప్పటికే తెలియజేసింది.
తమ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుండి మంచి స్పందన వస్తుందని తాము ఆశిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (స్టేట్ ఫెడరేషన్) ప్రధాన కార్యదర్శి జాయిదేబ్ దాస్‌గుప్తా అన్నారు. ఎస్‌బీఐ కూడా సమ్మెలో భాగమైతే బావుండేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment