గో ఫస్ట్‌కు ఎన్‌సీఎల్‌టీ ఊరట | Go First crisis: NCLT to pass order on airlines insolvency plea on Wednesday | Sakshi
Sakshi News home page

గో ఫస్ట్‌కు ఎన్‌సీఎల్‌టీ ఊరట

Published Thu, May 11 2023 4:01 AM | Last Updated on Thu, May 11 2023 4:01 AM

Go First crisis: NCLT to pass order on airlines insolvency plea on Wednesday - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కాస్త ఊరటనిచ్చింది. కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న ఉత్తర్వులను రిజర్వ్‌ చేసిన ఎన్‌సీఎల్‌టీ దాదాపు వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా బుధవారం నాడు ఆదేశాలను వెలువరించింది.

మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్‌పీ) అభిలాష్‌ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్‌మెంటు.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్‌పీ వద్ద డిపాజిట్‌ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్‌ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది.

గో ఫస్ట్‌ తాను బాకీల విషయంలో డిఫాల్ట్‌ అయ్యానని, రుణదాతల నుంచి వచ్చిన డిమాండ్‌ నోటీసులను కూడా సమర్పించిందని, లీజు సంస్థలు కూడా దీన్ని ఖండించడం లేదని ద్విసభ్య ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో దివాలా చట్టంలోని సెక్షన్‌ 10 కింద కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనుంది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవరీ చేసుకోవడానికి గానీ ఉండదు. గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement