
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో రుణగ్రహీతలకు ఊరట కల్పించే నిర్ణయాన్ని కేంద్రం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కోవిడ్–19 సమయంలో ప్రకటించిన మారటోరియంను ఉపయోగించుకున్న వారితోపాటు యథాప్రకారం వాయిదాలు చెల్లించిన వారికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టతనిచ్చింది. ఈ పథకం అమలుతో కేంద్రంపై రూ.6,500 కోట్ల మేర భారం పడనుంది.
రూ.2 కోట్ల రుణగ్రహీతలకు లబ్ధి కలిగేలా సాధ్యమైనంత త్వరగా వడ్డీ మాఫీ పథకాన్ని ప్రకటించాలనీ, ‘సామాన్యుడి దీపావళి’ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ ఈ నెల 14వ తేదీన సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక సేవల విభాగం పలు మార్గదర్శకాలను ప్రకటించింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు రూ.2 కోట్లలోపు బకాయి ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఫిబ్రవరి 29వ తేదీ నాటికి వాటిని నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా ప్రకటించి ఉండకూడదు.
ఆ మొత్తాన్ని ఈ ఏడాది మార్చి 27వ తేదీన ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియం పథకాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ వినియోగించుకున్న వారి ఖాతాల్లో రుణ సంస్థలు జమ చేయాల్సి ఉంది. మారటోరియం అవకాశాన్ని వినియోగిం చుకోని, ఎప్పటి మాదిరిగా వాయిదాలు చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. చెల్లించిన మొత్తానికి సంబంధించిన వివరాలతో ఆయా సంస్థలు కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో రుణాల చెల్లింపులపై కేంద్రం విధించిన 6 నెలల మారటోరియం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీన జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment