ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ గ్రూప్ సంయుక్త కంపెనీ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(వీఐఎల్) టెలికాం కంపెనీ మూతపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) షేర్లు జూన్ 30 పడిపోయిన దానికంటే కంటే జూలై 1న భారీగా పడిపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు జూలై 1న 8.54శాతం క్షీణించి రూ.9.1 వద్ద ముగిసింది. ఈ టెలికాం సంస్థకు ఎఫ్ వై21 క్యూ4లో రూ.7,022.8 కోట్ల ఏకీకృత నికర నష్టం కలిగింది. మొత్తం 2021 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.44,233 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఇందులో జనవరి-మార్చి త్రైమాసిక నష్టాలు(రూ.6,985 కోట్లు) కూడా ఉన్నాయి.
మరో పక్క చందాదారుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది. కేవలం 2021 జనవరి-మార్చి త్రైమాసికంలోనే 20 లక్షల చందాదారులు ఇతర నెట్ వర్క్ లకు మారారు. 2021 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం చందాదారుల సంఖ్య 27 కోట్లకు పడిపోయింది. ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న టెల్కో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా స్పెక్టం వాయిదాల చెల్లింపునకు సంబంధించి ఏడాది పాటు మారటోరియం ఇవ్వాలంటూ టెలికం శాఖ (డాట్)కు విజ్ఞప్తి చేసింది. జూన్ 25న డాట్ కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది.
తమ దగ్గరున్న నగదును సవరించిన ఏజీఆర్ (సవరించిన స్థూల అదాయం) బాకీలకు చెల్లించాల్సి వస్తున్నందున వచ్చే ఏడాది ఏప్రిల్ 9న కట్టాల్సిన రూ.8,292 కోట్లు స్పెక్ట్రమ్ వాయిదా మొతాన్ని కట్టే పరిస్థితి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాము చెల్లించాల్సిన వాయిదాలకు మరో ఏడాది పాటు 2023 ఏప్రిల్ దాకా మారటోరియం ఇవ్వాలంటూ వీఐఎల్ కోరింది. గత అరు నెలలుగా కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు ముందుకు, రావడం లేదని తెలిపింది. టారిఫ్‌లు పెరిగితే తప్ప టెలికం పరిశ్రమ కోలుకోలేకపోవచ్చని, తాము నష్టపోతామని ఇన్వెస్టర్లు భావిస్తుండటమే ఇందుకు కారణమని వివరించింది. ఒకవేల ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే వొడాఫోన్ ఐడియా లిక్విడేషన్ కు వెళ్లనున్నట్లు గ్లోబల్ సీఈఓ నిక్ రీడ్ ఇప్పటికే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment