న్యూఢిల్లీ: మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన 175.53 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. షేరుకి రూ. 11.28 ధరలో వొడాఫోన్ గ్రూప్ సంస్థలకు వీటిని కేటాయించనుంది. తద్వారా రూ. 1,980 కోట్లు సమకూర్చుకోనుంది. ఒమెగా టెలికం హోల్డింగ్స్‌కు రూ. 1,280 కోట్లు, ఉషా మార్టిన్ టెలిమాటిక్స్‌కు రూ. 700 కోట్లు విలువైన షేర్లను జారీ చేయనుంది.
2025 జనవరి 7న నిర్వహించనున్న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఈ అంశాలను బోర్డు చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ వాటా 22.56 శాతంకాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్ 14.76 శాతం, కేంద్ర ప్రభుత్వం 23.15 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. ఈ ఏడాది(2024–25) రెండో త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రూ. 8,747 కోట్ల నుంచి తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. ఇందుకు ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) మెరుగుపడటం సహకరించింది.
మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 2 శాతం మెరుగుపడి రూ. 10,918 కోట్లను తాకింది. కాగా.. ఇటీవల టెలికం దిగ్గజాలు నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్‌తో నెట్‌వర్క్ పరికరాల సరఫరా కోసం సుమారు రూ. 30,000 కోట్ల(3.6 బిలియన్ డాలర్లు) విలువైన డీల్‌ను వొడాఫోన్ ఐడియా కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో వొడాఫోన్ ఐడియా షేరు రూ. 8.11 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment