ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్ రిస్క్ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్‌బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లమేర ఎస్‌బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది.
ఎస్‌బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్‌ఆర్‌కో అనుసంధానమై ఉంటాయి. మరోపక్క, బెంచ్‌మార్క్ రుణ రేటు–ఎంసీఎల్‌ఆర్‌ను స్వల్పంగా 0.15% (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది.
వృద్ధులకు ఊరట: రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్లకోసం ‘ఎస్‌బీఐ వియ్‌కేర్ డిపాజిట్’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది. ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్ సెప్టెంబర్ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 80 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్ పాయింట్లకు 30 బేసిస్ పాయింట్లు ప్రీమియం) అందుతుంది.
మూడేళ్లలోపు రేటు తగ్గింపు: మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ఎన్‌బీఎఫ్‌సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు
కోల్‌కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్‌బీఎఫ్‌సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని ఎస్‌బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్–మే) మారటోరియం విధించడానికి ఆర్‌బీఐ బ్యాంకింగ్‌కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్‌బీ ఎఫ్‌సీలకు వర్తింపజేసేలా ఆర్‌బీఐ అనుమతి నివ్వడంతో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment