న్యూఢిల్లీ: మారటోరియం వ్యవధిలో రుణాలపై చక్రవడ్డీ మాఫీపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమ చేసే అంశంపై స్పష్టతనిచ్చింది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. రూ. 2 కోట్ల దాకా ఎంఎస్‌ఎంఈ, విద్య, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీము వర్తిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రీఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. నవంబర్ 5 కల్లా రుణగ్రహీతల ఖాతాల్లో ఎక్స్‌గ్రేషియా జమ చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని బ్యాంకులకు కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment