waiver
-
ప్రభుత్వ నిర్ణయం.. వొడాఫోన్ ఐడియాకు భారీగా ఊరట
న్యూఢిల్లీ: గత స్పెక్ట్రం కొనుగోళ్లకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం వల్ల టెల్కోలపై గణనీయంగా ఆర్థిక భారం తగ్గుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ సీవోఏఐ తెలిపింది. దీనితో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి నిధుల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొంది.2022కి ముందు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం సంస్థలు బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలన్న నిబంధన నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.దీనితో ప్రధానంగా వొడాఫోన్ ఐడియాకు భారీగా ఊరట లభించనుంది. వొడాఫోన్ ఐడియా రూ. 24,747 కోట్ల బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉండగా, దానికి గడువు కూడా ముగిసిపోయింది. అటు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియోకి కూడా ఊరట లభిస్తుంది. -
రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సంబంధించిన రూ.2 లక్షల రుణమాఫీపైనే మొదటి సంతకం పెడతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరు సీఎంగా ఉన్నా.. తాను కీలకంగా వ్యవహరించి రుణమాఫీ చేయిస్తానని హామీఇచ్చారు. నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామంలో వివిధ పార్టీ లకు చెందిన 200 మంది శనివారం ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో నల్లగొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదని విమర్శించారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా 14 గంటల కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రంలో భూములు అమ్మడంతో పాటు వైన్‌షాపులకు ముందస్తుగానే టెండర్లు వేసి వచ్చిన డబ్బులను సీఎం కేసీఆర్ తమ ఖాతాలో జమ చేసుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనను నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లను గెలుచుకుంటామని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ జూలకంటి వెంకట్‌రెడ్డి, నాయకులు చెల్ల పద్మారెడ్డి, బ్రహ్మచారి, చెలక సైదిరెడ్డి, ఎం.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క రూపాయి 20 లక్షల మంది రైతులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణమాఫీ చేయాలని గతంలో నిర్ణయించి ఇటీవల అందులో సరిగ్గా రూ. 99,999 వరకు తీసుకున్న రైతుల రుణమాఫీ సొమ్మును మాఫీ చేసింది. అలాగే రూ. 99,999 నుంచి రూ. లక్ష వరకు శ్లాబ్ అంటే కేవలం ఒక రూపాయి తేడా ఉన్న రైతు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క తేడాలోనే రైతుల సంఖ్య, రుణమాఫీ సొమ్ము భారీగా ఉండటం గమనార్హం. మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా అందులో ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753.43 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కింద చెల్లించింది. ఇంకా రూ. 99,999 నుంచి రూ. లక్ష మధ్య అంటే ఒక్క రూపాయి తేడాలోనే ఏకంగా 20.02 లక్షల మంది రైతులు ఉన్నారు. వారికి ప్రభుత్వం ఇంకా రుణమాఫీ సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరూ రూ. 99,999 లెక్కకు రుణాలు తీసుకోరు. రౌండ్ ఫిగర్ తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 99,999 వరకు శ్లాబ్‌గా గుర్తించి ప్రస్తుతం రుణాలను మాఫీ చేసింది. రూ. లక్ష నుంచి రూ. 4–5 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులూ చాలా మంది ఉండగా వారికి రూ. లక్ష వరకు మాత్రమే రుణమాఫీ జరగనుంది. రూ. లక్ష అంతకుమించి రుణాలు తీసుకున్న రైతులే ఎక్కువ మంది ఉంటారని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 330 ఎకరాల భూమిని చూపినా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరారు. శనివారం శాసనమండలిలో ‘గిరిజన సంక్షేమం–పోడు భూములకు పట్టాల పంపిణీ’పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. పోడు భూముల వివాదాల్లో తలెత్తిన కేసులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎత్తివేసేందుకు అటవీశాఖ, డీజీపీలతో కూడిన కమిటీ కసరత్తు ప్రారంభించిందని చెప్పారు. 2023–24 లో 15 వేల మంది గిరిజన రైతుల ప్రయోజనాల కోసం ‘గిరివికాసం’కింద రూ.150 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని, 500 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ల హయాంలోనే పోడుభూములకు పట్టాలు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. -
ఆ మందులు వాడే వారికి ఊరట.. దిగుమతి సుంకం మినహాయింపు
అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని మినహాయించింది. అలాగే వివిధ క్యాన్సర్ల చికిత్సలో వాడే పెంబ్రోలిజుమాబ్ (కీట్రుడా) ఔషధంపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. వ్యక్తిగత దిగుమతిదారులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఔషధాలు, ఆహార పదార్థాలపై దిగుమతి సుంకం మినహాయింపులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణంగా బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే మందులు, ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర ఉంటుంది. ప్రాణాలను రక్షించే అత్యవసర మందులు, వ్యాక్సిన్లపై మాత్రం 5 శాతం దిగుమతి సుంకం ఉంటుంది. కొన్ని మందులపై అయితే కస్టమ్స్ డ్యూటీ అస్సలు ఉండదు. నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ 2021 కింద జాబితాలో చేర్చిన అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే అన్ని రకాల మందులు, ఆహార పదార్థాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ మినహాయింపును పొందేందుకు వ్యక్తిగత దిగుమతిదారు కేంద్ర లేదా రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్ లేదా జిల్లా మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. -
తెలంగాణలో రూ.50 వేల వరకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీ మేరకు ఇప్పటివరకు రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా రూ.50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రూ.25 వేల వరకున్న రుణాల మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం గల అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింప జేయాలని నిర్ణయించింది. ఈ కోటాలో భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 5 ఏళ్లు పెంచాలని కూడా నిర్ణయించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో ఆరున్నర గంటలకు పైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. పైలట్ ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధుకు చట్టబద్ధత దళిత బంధు పథకం అమలు విషయంలో మంత్రివర్గ సహచరుల నుంచి సీఎం సూచనలు స్వీకరించారు. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో 20 శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం 13 లక్షల ఎకరాలేనని, వారి పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని తెలిపారు. అరకొర సహాయాలతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్యాంకు రుణాలతో ముడి పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. దళిత బంధు దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్ అభిప్రాయ పడింది. ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’ దళిత బంధు లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ కల్పించాలని మంత్రివర్గం కోరింది. శిక్షణ, పర్యవేక్షణకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్ ప్రైజ్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని, వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును మంత్రివర్గం ఆదేశించింది. లబ్ధిదారులకు అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా దళిత వాడలకు అన్ని హంగులూ ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అనాథ పిల్లలకు అండగా నిలవాలి ‘కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఒంటరిగా మారి మానసిక వేదన, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదముంది. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇప్పుడు కూడా అనాథ పిల్లల సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్‌తో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల స్థితిగతుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలి అన్ని జిల్లాల్లో కరోనా నిర్థారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్య శాఖను కేబినెట్ ఆదేశించింది. అన్ని రకాల మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సూచించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఈ సందర్భంగా వైద్యశాఖ నివేదించింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలు పర్యటించి రావాలని మంత్రివర్గం ఆదేశించింది. నిమ్స్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి కొత్తగా మంజూరు చేసిన ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. అవసరమైన పడకలు, ఇతర మౌలిక వసతులు, కళాశాలలు, హాస్టళ్ల భవనాల నిర్మాణాలకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. వైద్య కళాశాలల భవన నిర్మాణాలను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను మంత్రివర్గం ఆదేశించింది. నిమ్స్ ఆస్పత్రిని మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవలను విసృత పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు ఉంచాలని వైద్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. భవిష్యత్తులో అనుమతించనున్న వైద్య కళాశాలల కోసం స్థలానేష్వషణ, ఇతర సౌకర్యాల కల్పనకు ముందస్తుగా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని సూచించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాది నాటికి వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరింది. త్వరలో సూపర్ స్పెషాలిటీలకు శంకుస్థాపన కొత్తగా ఏర్పాటు చేయనున్న 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)’గా నామకరణం చేయాలని తీర్మానించింది. టిమ్స్ గచ్చిబౌలి, టిమ్స్ సనత్‌నగర్, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ అల్వాల్ ఆస్పత్రులుగా అభివృద్ధి చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్కచోటే అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. వరంగల్‌లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని ఆదేశించింది. పటాన్చెరులో మల్టీస్పెషాలటీ ఆస్పత్రి పటాన్చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాలకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రివర్గం మంజూరు చేసింది. రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల స్థాపన లక్ష్యంగా, వైద్య కళాశాలలు లేని జిల్లాలను గుర్తించి రెండు మూడేళ్లల్లో దశల వారీగా వాటిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ధోభీ ఘాట్లు, సెల్లూనకు ఉచిత విద్యుత్ ధోభీ ఘాట్లు, సెల్లూనకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనులను ప్రారంభించండి నల్లగొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుండి ప్రారంభించిన ఎస్సెల్బీసీ సొరంగమార్గం పనులను పున:ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటు ఉదయ సముద్రం లిఫ్టు ఇరిగేషన్ స్కీం (బ్రాహ్మణ వెల్లెంల)ను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కేబినెట్ ఆదేశాలు జారీచేసింది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ►16 నుంచి దళిత బంధు తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయం. దళిత జాతి పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రవేశపెడుతున్న ఈ ప్రతిష్టాత్మక పథకానికి కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం. ►57 ఏళ్లకు పింఛన్లు వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయం అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభం. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతి కొనసాగింపు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్ బదిలీ ►అనాథ పిల్లల బాధ్యత సర్కారుదే కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు పెద్దవారై ప్రయోజ కులయ్యే వరకు ఆశ్రయం కల్పించి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి పిల్లల వివరాలు తెప్పించాలని ఆదేశం. -
చక్రవడ్డీ మాఫీపై ఆర్థిక శాఖ వివరణ
న్యూఢిల్లీ: మారటోరియం వ్యవధిలో రుణాలపై చక్రవడ్డీ మాఫీపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. సాధారణ వడ్డీ, చక్రవడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని రుణ గ్రహీతల ఖాతాల్లో బ్యాంకులు జమ చేసే అంశంపై స్పష్టతనిచ్చింది. ఎక్స్‌గ్రేషియా లెక్కింపునకు ఫిబ్రవరి 29 నాటికి బాకీ ఉన్న అసలు మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని పేర్కొంది. రూ. 2 కోట్ల దాకా ఎంఎస్ఎంఈ, విద్య, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల బకాయిలు మొదలైన వాటికి ఈ స్కీము వర్తిస్తుంది. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఇవి మొండిపద్దులుగా మారి ఉండకూడదు. మార్చి 1 నుంచి ఆగస్టు 21 దాకా కాలానికి (184 రోజులు) రీఫండ్ చేస్తారు. మారటోరియం ఎంచుకున్న వారికి, ఎంచుకోని వారికి, పాక్షికంగా ఉపయోగించుకున్న వారికి కూడా ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. నవంబర్ 5 కల్లా రుణగ్రహీతల ఖాతాల్లో ఎక్స్‌గ్రేషియా జమ చేయాలంటూ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని బ్యాంకులకు కేంద్రం తర్వాత రీయింబర్స్ చేస్తుంది. -
నవంబర్ 5 కల్లా ఖాతాల్లో డబ్బులు
ముంబై/న్యూఢిల్లీ: మారటోరియంలో రుణాలపై చక్రవడ్డీ మాఫీ పథకాన్ని నవంబర్ 5లోగా అమలు చేయాలని బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. స్కీమ్‌కి అనుగుణంగా సాధారణ వడ్డీ, చక్రవడ్డీ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన మొత్తాన్ని నిర్దిష్ట రుణగ్రహీతల ఖాతాల్లో గడువులోగా జమ చేసే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ‘రుణాలిచ్చే అన్ని ఆర్థిక సంస్థలు నిర్దిష్ట స్కీమ్ నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా తగు చర్యలు తీసుకోవాలి‘ అని ఆదేశిస్తూ ఆర్బీఐ మంగళవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ విషయాన్ని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘6 నెలల వ్యవధికి సంబంధించి చక్రవడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించే స్కీము నిబంధనలను అమలు చేయాలంటూ ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది‘ అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఇదే వివరాలను సుప్రీం కోర్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. రుణగ్రహీతలు మారటోరియం ఎంచుకున్నా, ఎంచుకోకపోయినా లేదా పాక్షికంగా ఎంచుకున్నా .. అర్హులైన వారందరికీ ఈ స్కీమును వర్తింపజేస్తున్నట్లు వివరించింది. నిర్దిష్ట నిధులను రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌కు బ్యాంకులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ‘ఆర్థిక పరిస్థితులు, రుణగ్రహీతల తీరుతెన్నులు, ఎకానమీపై ప్రభావం తదితర అంశాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని వివరించింది. నేపథ్యం ఇదీ.. కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో కుదేలైన రుణగ్రహీతలకు కాస్త వెసులుబాటునిచ్చే విధంగా రుణ బాకీల చెల్లింపును కొంతకాలం వాయిదా వేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం మార్చి 1 నుంచి ఆగస్టు 31 దాకా ఆరు నెలల పాటు రెండు విడతలుగా మారటోరియం ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిలో అసలుపై వడ్డీ మీద వడ్డీ కూడా వడ్డించే విధంగా బ్యాంకుల నిబంధనలు ఉన్నాయి. ఈ చక్రవడ్డీ భారాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. సామాన్యుడి దీపావళి పండగ మీ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా స్కీమ్ రూపొందించింది. స్కీమ్ ఇలా... రూ. 2 కోట్ల దాకా రుణాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, వాహన రుణాలు, చిన్న..మధ్య తరహా సంస్థల లోన్స్, కన్జూమర్ డ్యూరబుల్ లోన్స్ మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. పథకం ప్రకారం .. మారటోరియం ప్రకటించిన ఆరు నెలల కాలానికి గాను సాధారణ వడ్డీ, చక్ర వడ్డీకి మధ్య గల వ్యత్యాసాన్ని బ్యాంకులు ఆయా రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేస్తాయి. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటాయి. మారటోరియంను ఎంచుకోకుండా యథాప్రకారం రుణాల నెలవారీ వాయిదాలను చెల్లించడం కొనసాగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. -
లోన్లపై వడ్డీ మాఫీ : పండుగ కానుక
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, లౌక్‌డౌన్ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త అందించింది. రుణగ్రహీతలకు పండుగ కానుకగా మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై "వీలైనంత త్వరగా" వడ్డీ మినహాయింపును అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన తరువాత ఈ మార్గదర్శకాలు వచ్చాయి. ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం ఆరు నెలల కాలానికిగాను (మార్చి 1 నుండి ఆగస్టు 31, 2020 వరకు) 2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్లో జమ చేస్తాయి. దీన్ని అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకుంటాయి. రుణగ్రహీత పూర్తిగా లేదా పాక్షికంగా తాత్కాలిక నిషేధాన్ని పొందారా అనే దానితో సంబంధం లేకుండా చక్రవడ్డీకి, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని చెల్లిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుంది. -
కరెంటు బిల్లులు మాఫీ చేయండి
సాక్షి, హైదరాబాద్: కరెంటు బిల్లులపై సీఎంకు కాంగ్రెస్ లేఖాస్త్రం సంధించింది. కరోనా కరుణించలేదు.. కనీసం మీరైనా కనికరించాలని విజ్ఞప్తి చేసింది. పేద కుటుంబాలు, ఎంఎస్ఎంఈలు లాక్డౌన్ కారణంగా బిల్లులు భరించలేకపోతున్నందున వాటిని మాఫీ చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. ఇతర వినియోగదారులకు కూడా బిల్లులో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘బీపీఎల్ కుటుంబాలకు లాక్డౌన్ కాలానికి 100 శాతం విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతున్నాం. తెల్లరేషన్ కార్డుదారులకు విద్యుత్ బిల్లులను పూర్తిగా మాఫీ చేయాలి. బిల్లింగ్ పద్ధతిలో తప్పులను సరిదిద్దడం ద్వారా ఇతర వినియోగదారులకు కూడా తగిన విధంగా తగ్గించాలి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థిర, సాధారణ చార్జీలు సహా విద్యుత్ బిల్లులు పూర్తిగా మాఫీ చేయాలి. జూన్‌లో విద్యుత్ బిల్లులు చాలా అన్యాయంగా ఉన్నాయి. వినియోగం మీద ఆధారపడి నెలవారీగా చార్జీలు వసూలు చేయాలి. కానీ, ఈఆర్సీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ 90 రోజుల్లో చేసిన మొత్తం వినియోగం ఆధారంగా బిల్లులను తయారు చేశారు. పర్యవసానంగా, వినియోగదారులకు యూనిట్‌కు రూ.4.30కి బదులు రూ.9 బిల్లు వేశారు. ప్రజలపట్ల తన విధానాన్ని మార్చుకునే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. రెండు నెలలకుపైగా లాక్డౌన్ కారణంగా నష్టపోయిన ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవైపు కోవిడ్ –19 ని అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం మరోవైపు సామాన్యులపై అదనపు ఆర్థిక భారం వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది జీవనోపాధి వనరులను కోల్పోయి విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రమంతటా నల్ల జెండాలు, బ్యాడ్జ్‌లతో నిరసనలు నిర్వహిస్తాం’అని లేఖలో పేర్కొన్నారు. -
కరోనా : అమెజాన్‌లో వారికి భారీ ఊరట
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో అమెజాన్ చేతివృత్తులు, చిన్న, మహిళా వ్యాపారులకు మరోసారి భారీ ఊరట కల్పించింది. ఎస్ఓఏ (సేల్ ఆన్ అమెజాన్) ఫీజును తాజాగా 100 శాతం రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మరో 10 వారాలపాటు ఈ మినహాయింపును పొడిగిస్తున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఫలితంగా లక్షలాదిమంది వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాలనుంచి చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సహా 10 లక్షల మందికి పైగా పారిశ్రామికవేత్తలు కోలుకునేలా సాయం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ఇండియా ప్రతినిధి ప్రణవ్ భాసిన్ వెల్లడించారు. అమెజాన్ అందిస్తున్న కారీగర్ ప్రోగ్రాం ద్వారా 8 లక్షలకు పైగా చేతివృత్తులవారు, నేత కార్మికులు, అమెజాన్ సహేలి ప్రోగ్రాం ద్వారా 2.8 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు 100 శాతం అమ్మకం ఫీజు మినహాయింపుతో ప్రయోజనం పొందుతారని అన్నారు. ఈ రెండు ప్రోగ్రామ్‌లలో చేరిన కొత్త అమ్మకందారులకు కూడా ఈ ఫీజు మినహాయింపు ఉంటుందని చెప్పారు. వీరి ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం ద్వారా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడంతోపాటు, వారికి మూలధన సహాయానికి తోడ్పడుతుందని భాసిన్ తెలిపారు.(అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ రికార్డు) కారీగర్, సహేలి అమ్మకందారుల నుండి స్థానికంగా రూపొందించిన, చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు కస్టమర్ డిమాండ్‌ను పెంచేందుకు 'స్టాండ్ ఫర్ హ్యాండ్‌మేడ్' స్టోర్ ను కూడా ఏర్పాటు చేసినట్టు భాసిన్ తెలిపారు. ఇందుకు ప్రభుత్వ ఎంపోరియంలు, ఐదు ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం ఉందన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య భారతదేశం సహా వివిధ ప్రాంతాల చేతివృత్తులవారు, మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చన్నారు. అలాగే మహిళలకోసం మహిళలు రూపొందించిన ఉత్పత్తులు కూడా లభిస్తాయని ఆయన ప్రకటించారు. కాగా జూన్ 2020 చివరి వరకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ ఫీజును 50 శాతం మాఫీ చేస్తున్నట్టు గత నెలలో ప్రకటించింది. అలాగే స్టోరేజ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్టు అమెజాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
రైతు ఉద్ధరణ అంటే ఇదేనా?
విశ్లేషణ కార్పొరేట్ల భారీ రుణాల మాఫీ ఆర్థికంగా అర్థవంతమైన చర్య అని సమర్థిస్తారు. రైతుల రుణ మాఫీ మాత్రం తప్పుడు ఆర్థిక విధానమని, రుణ క్రమశిక్షణారాహిత్యమని అంటారు. కానీ బ్యాంకుల మొత్తం మొండి బకాయిలలో ఒక శాతమే రైతులు బకాయిపడ్డది. మన వ్యవ సాయ పరపతి విధానమే రైతు వ్యతిరేకమైనది. రైతులకు, గ్రామీణ పేదలకు నష్టాన్ని కలుగజేస్తూ సంపన్నులకు మేలును చేకూర్చేలా దాన్ని రూపొందించారు. రైతులను పేదరికంలో ఉంచేయాలని చేస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నాలలో భాగమే ఇది. అలహాబాద్ సమీపంలోని సనంద్‌లో నానో కార్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం టాటాలకు రూ. 558.58 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని 0.1 శాతం వడ్డీకి 20 ఏళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికపై ఇచ్చామని ప్రభుత్వమే తెలిపింది. మరో విధంగా చెప్పాలంటే, తిరిగి చెల్లించాల్సింది 20 ఏళ్ల కాలంలో కాబట్టి దాదాపు వడ్డీ ఏమీ లేకుండానే ఇంత భారీ దీర్ఘకాలిక రుణాన్ని ఇచ్చినట్టు లెక్క. పంజాబ్ ప్రభుత్వం భటిండాలో ఎరువుల కర్మాగారాన్ని స్థాపించడానికి ఉక్కు పరిశ్రమ కుబేరుడు లక్ష్మీ నారాయణ్ మిట్టల్‌కు రూ. 1,200 కోట్ల రుణాన్ని ఇస్తున్నట్టు వార్తా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఆయనకు సైతం ఈ రుణం 0.1 శాతం వడ్డీకే లభించింది. సంపన్నులసేవే బ్యాంకుల విధానమా? మరోవైపున ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఒక గ్రామంలోని పేదలలోకెల్లా కడు పేదరాలైన ఓ మహిళకు మేకను కొనుక్కోవాలనే కోరిక ఉంది. కాబట్టి ఆమె ఏదైనా ఓ మైక్రో–ఫైనాన్స్ సంస్థ(ఎమ్ఎఫ్ఐ)ను ఆశ్ర యిస్తుంది. అది, 24 నుంచి 36 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటుకు ఆమెకు రూ. 5,000 రుణాన్ని ఇస్తుంది. ఈ స్వల్ప మొత్తాన్ని ఆమె వారం వారం వాయిదాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మేకను పెంచుకోవడానికి ఆ పేదరాలికి ఇచ్చే రూ. 5000 రుణాన్ని... టాటాలకు ఇచ్చినట్టే 0.1 శాతం వడ్డీకి, 20 ఏళ్లలో కాకున్నా ఐదేళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికపై ఇస్తే.. ఏడాది చివరికి ఆమె ఓ నానో కారును నడుపుతుంటుందని మీరూ నిస్సందే హంగా అంగీకరిస్తారు. ఎంతైనా ఆ పేదరాలు కూడా ఓ చిన్న వ్యాపారవేత్తే కదా! ఆమె తన జీవితంలోని ఈ మలి దశలో మనుగడ సాగించడానికి ఓ మేకను పెంచుకుంటే, అదిచ్చే పాలు అమ్ముకుని బతుకుతుంది. బ్యాంకులు ఇలాంటి కనికరంతో దన్నుగా నిలిస్తే కోట్లాదిమందికి సుస్థిరమైన జీవనో పాధికి హామీని ఇస్తుంది. లేదంటే ఒక రైతు ఉదాహరణనే తీసుకోండి. అతను 12 శాతం వడ్డీ రేటుకు రుణం తీసుకొని ట్రాక్టర్ కొనుక్కోవాలి. అదే టాటా అయితే మెర్సి డెజ్ బెంజ్ లగ్జరీ కారును కేవలం 7 శాతం వడ్డీ రేటు రుణంతోనే కొనుక్కో గలడు. ట్రాక్టర్, రైతు పంటలు పండించే సామర్థ్యాన్ని ఇనుమడింపజేసి, తద్వారా రాబడిని పెంపొందింపజేసే సాంకేతిక పరిజ్ఞానం. రైతు ఉత్పాదక సామర్థ్యంతో పాటూ రాబడిని కూడా పెంపొందింపజేయడానికి తోడ్పడేదిగా ట్రాక్టర్ పోషించే పాత్ర నిర్వివాదమైనది. సాగుబడి అనే రైతు జీవనోపాధిని సుస్థిరం చేయడానికి తోడ్పడే పనిముట్టు ట్రాక్టర్. కానీ మెర్సిడెజ్ బెంజ్ కారు సంపన్నుల హోదాకు సంకేతంగానే ఎక్కువగా ఉపయోగపడేది. అలాంటి దాని కోసం వాళ్లు ఎక్కువ చెల్లించగలుగుతారు. పేదలపై ఎక్కువ భారాన్ని మోపుతూ సంపన్నులకు అంత కారు చౌకగా రుణాలను అందించేదిగా బ్యాంకింగ్ వ్యవస్థను ఎందుకు రూపొందించారా అని నాకు ఆశ్చర్యం కలుగు తుంటుంది. పేదల పట్ల చూపుతున్న ఈ ఘోర వివక్ష ఇక్కడితో ముగిసిపోదు. ప్రభుత్వరంగ బ్యాంకులన్నిటి మొండి బకాయిలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తుల (ఎన్పీఏలు) విలువ రూ. 6.8 లక్షల కోట్లని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) అంచనా. ఇందులో 70 శాతం కార్పొరేట్ సంస్థలు చెల్లించని రుణాలుకాగా, కేవలం 1 శాతం మాత్రమే రైతులు చెల్లించనివి. కార్పొరేట్ రంగంలోని మొండి బకాయిలను రద్దు చేస్తామని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇప్పటికే ప్రకటించారు. ఇలా కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడాన్ని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం లేదా పక్షపాతం అంటూ ఎంతటి గగ్గోలు రేగినా గానీ... కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలను రద్దు చేయాల్సినవిగానే పెట్టుబడిదారీ విధానం రూపొందిందని ఆయన చెప్పారు. రూ. 4 లక్షల కోట్ల ఎన్పీఏలను రద్దు చేస్తారని ‘ఇండియా రేటింగ్స్’ సంస్థ అంచనా కట్టింది. మరో విధంగా చెప్పాలంటే, ప్రధాన ఆర్థిక సలహా దారు చెప్పే మాటలను విశ్వసించేట్టయితే అంత భారీ రుణాలను మాఫీ చేసేయడం ఆర్థికంగా అర్థ వంతమైన చర్యే అవుతుంది. కానీ, రైతులు బకాయిపడ్డ రుణాలను మాఫీ చేయడం తప్పుడు ఆర్థిక విధానమనీ, అది రుణపరమైన క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ శ్రీమతి అరుంధతి భట్టాచార్య మరోవంక వాపోతు న్నారు. ఇంతాచేసి మొత్తం ఎన్పీఏలలో (మొండి బకాయిలలో) ఒక శాతం మాత్రమే రైతులు బకాయిపడ్డవి. బడ్జెట్లోనూ బడుగు రైతుకు రిక్తహస్తమే ఏటా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణంలో చాలా వరకు అగ్రిబిజినెస్ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే పోతుంది. 2017 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయ రుణం రూ. 10 లక్షల కోట్లని ప్రకటించారు. వ్యవ సాయ రుణం కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించే ప్రభుత్వం ఎంతగా రైతుల కోసం ఆలోచిస్తున్నదోనని అనిపిస్తుంది. కానీ ఇందులోంచి అసలు చిన్న రైతులకు అందేది వాస్తవానికి 8 శాతం మాత్రమే. మొత్తం రైతులలో చిన్న రైతులు దాదాపు 83 శాతం. రూ. 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణంలో దాదాపు 75 శాతం పరపతిని అగ్రిబిజినెస్ కంపెనీలు, బడా రైతులు ప్రభుత్వ సహాయంతో 3 శాతం వడ్డీ రేటుకే పొందుతారు. కాలక్రమేణా వ్యవసాయ రుణం అంటే ఏమిటనే నిర్వచనం విస్తరిస్తూపోయి గిడ్డంగుల కంపెనీలు, వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థలు, ఇతర అగ్రిబిజినెస్ సంస్థలు అన్నీ అందులోకి చేరాయి. రైతుల పట్ల బ్యాంకులు చూపుతున్న ఈ ఉదాసీన వైఖరి కారణంగానే ఇటీవలి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో రైతుల రుణ మాఫీ వాగ్దానం అంతటి వివాదాస్పద అంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ రైతు రుణ మాఫీ ఆర్థిక భారం బాధ్యతను కేంద్రమే తీసుకుం టుందని ఇప్పటికే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రక టించింది. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పంజాబ్‌లో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్... రైతు రుణ మాఫీ ఆర్థిక భారాన్ని మోయడానికి ఒక వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. రైతుల రుణ బకాయిలను ప్రభు త్వం ‘స్వాధీనం చేసుకుంటుంద’ని, రైతుల బకాయిలను ప్రభుత్వం తిరిగి చెల్లించడానికి బ్యాంకులతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందనీ తెలిపారు. రైతు రుణ మాఫీలోనూ అసంబద్ధతే పంజాబ్‌లో రైతులు బకాయిపడ్డ మొండి రుణాలు దాదాపు రూ. 35,000 కోట్లని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమికి యజ మానులైన రైతుల బకాయిల మాఫీ మొత్తం రూ. 36,000 కోట్ల వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రైతు రుణ మాఫీకి అయ్యే ఖర్చును తిరిగి చెల్లించడానికి కేంద్రం అంగీకరించినప్పుడు అదే పనిని ఇతర రాష్ట్రాల విషయంలో అది ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నిస్తున్నారు. ఉదాహర ణకు, మహారాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ కోసం రూ. 30,500 కోట్లు అడుగుతోంది. 2009 నుంచి ఆ రాష్ట్రంలో 23,000 మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర శాసనసభకు తెలిపారు. తమిళనాడు వరుసగా మూడో ఏడాది వర్షాభావ పరిస్థితులను ఎదు ర్కొంటున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే కరువు నెలకొన్నదని ప్రకటిం చింది. రైతులు ఎకరాకు రూ. 25,000 పరిహారాన్ని చెల్లించాలని కోరు తున్నారు. ఇదిలా వుండగా, ఒడిశాలో కూడా రైతు ఆత్మహత్యల పెరుగుదల పుంజుకుంది. ఈశాన్యంలో రైతు ఆత్మహత్యల సంఖ్య గత కొన్నేళ్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. రైతు మెడకు పేదరికం ఉచ్చు రైతులను పేదరికంలో ఉంచేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగు తుండటమే దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న భయానకమైన వ్యవసాయ సంక్షో భానికి ప్రాథమిక కారణం. దురదృష్టవశాత్తూ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా గ్రహించడం లేదు. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలను చెల్లించకపోవడం మాత్రమే కాదు, రైతులకు గ్రామీణ పేదలకు నష్టాన్ని కలుగజేస్తూ సంపన్ను లకు మేలును చేకూర్చేలా పరపతి విధానాన్నే తప్పుడు పద్ధతిలో రూపొం దించారు. కానీ బ్యాంకులు తమ తప్పును అంగీకరించి, వాటి పరపతి విధానాలను తిరిగి రూపొందిస్తాయా? నాకైతే ఆ విషయంలో తీవ్ర అనుమా నాలే ఉన్నాయి. వృద్ధికి ప్రోత్సాహం పేరిట సంపన్నవంతులైన కార్పొరేట్ అధిపతులు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలను, భారీ సబ్సీడీలను పొందు తూనే ఉంటారు. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్‌శర్మ ఈమెయిల్ : hunger55@gmail.com -
రైతు రుణమాఫీలపై ఎస్బీఐ సంచలన వ్యాఖ్యలు
-
పంట రుణాల మాఫీ సరికాదు
⇒ రుణాల చెల్లింపు తీరును దెబ్బతీస్తుంది ⇒ భవిష్యత్తులోనూ ఇదే ఆశిస్తారు ⇒ దీనివల్ల భవిష్యత్తులో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించరు ⇒ ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మెరుగుపడాలని సూచన ముంబై: రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రైతులకు రుణ మాఫీ హామీని బీజేపీ ఇచ్చిన నేపథ్యంలో అరుంధతీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘రుణాలను మాఫీ చేస్తే రుణాలు తిరిగి చెల్లించే అలవాటు తగ్గుతుంది. ఎందుకంటే రుణ మాఫీ పొందిన వారు భవిష్యత్తులోనూ రుణాల మాఫీపై ఆశలు పెట్టుకుంటారు. దాంతో భవిష్యత్తులో ఇచ్చే రుణాల చెల్లింపులు నిలిచిపోతాయి. ఈ రోజు ప్రభుత్వం చెలిస్తుంది గనుక రుణాలు వసూలు అవుతాయి. రైతులకు తిరిగి రుణాలు ఇస్తే వారు మరోసారి రుణ మాఫీ కోసం వచ్చే ఎన్నికల వరకు తీర్చకుండా ఉంటారు’’ అని ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా భట్టాచార్య పేర్కొన్నారు. ఎస్బీఐ–క్రెడాయ్ భాగస్వామ్యం రియల్టీ రంగ అభివృద్ధి కోసం కలసి పనిచేయాలని ప్రభుత్వరంగ ఎస్బీఐ, రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘం క్రెడాయ్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) వచ్చాయి. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అందరికీ ఇళ్లు వంటి పలు విభాగాల్లో పరస్పర సహకారానికి ఈ ఒప్పందం తోడ్పడుతుందని, ఇది రియల్టీ రంగానికి కూడా మేలు చేస్తుందని ఎస్బీఐ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా ఎస్బీఐ, క్రెడాయ్ సంయుక్తంగా సమావేశాలు, సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నాయి. -
ఒకే దఫాలో రుణమాఫీ చేయాలి
–వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం –బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలి –వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి –దామరచర్లలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటన మిర్యాలగూడ : రైతుల పంట రుణాలను విడుతల వారీగా కాకుండా ఒకే దఫాలో మాఫీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దామరచర్లలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, పెట్టుబడులకు అయిన ఖర్చులను ప్రభుత్వం నష్ట పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి చేలలో నీరు నిలిచి పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని, వీటితో పాటు పెసర, కంది పంటలకు కూడా వందలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అనేక గ్రామాల్లో రోడ్లు, కల్వర్టులు తెగి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి బాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు ఎండీ సలీం, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మేష్యానాయక్, దామరచర్ల, మిర్యాలగూడ పట్టణ, మండలం, వేములపల్లి మండల పార్టీల అధ్యక్షులు అన్నెం కరుణాకర్‌రెడ్డి, ఎంవీఆర్‌రెడ్డి, పిలుట్ల బ్రహ్మం, పెదపంగ సైదులు, హుజూర్నగర్ మండలం, పట్టణ అధ్యక్షుడు జడ రామకృష్ణ, గుర్రం వెంకట్‌రెడ్డి, నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షులు కుందూరు మట్టారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇనుపాల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాఫీ.. టోపీ
♦ రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం ♦ గద్దెనెక్కాక మొక్కుబడి మాఫీతో వంచన ♦ జిల్లాలో రుణాలు తీసుకున్న రైతులు 7,06,000 మంది ♦ మాఫీ వర్తించినవారు 4.70 లక్షలు తీసుకున్న రుణం రూ.4,966 కోట్లు ♦ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం రూ.593.6 కోట్లు ♦ మాఫీ డబ్బులు వడ్డీలకూ సరిపోని వైనం ♦ ఇదేమి మాఫీ బాబూ అంటూ అన్నదాతల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల వేళ రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. గద్దెనెక్కాక అరకొర రుణాలను మాత్రమే మాఫీ చేసి, నమ్మి ఓట్లేసిన అన్నదాతల్ని వంచించారు. రుణాలు తీసుకున్న వారిలో 50 శాతం రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేయకపోయారు. మాఫీ డబ్బు రైతుల బ్యాంకు వడ్డీలకు కూడా సరిపోలేదు. మొదటి విడత మొక్కుబడిగా నిధులు విదిల్చి, ఇప్పుడు రె ండో దఫా మాఫీ అంటూ మాయ చేస్తున్న చంద్రబాబు సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 31-12-2013 నాటికి 7,06,000 మంది రైతులు వివిధబ్యాంకులకు 456 బ్రాంచిలలో రూ. 4,966 కోట్లు రుణాలు తీసుకున్నారు. వరుస కరువులతో రైతులు బ్యాంకు రుణాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మొదటి ఫేజ్‌లో 3,31,210 ఖాతాలకు రూ.1420 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా రూ.376 కోట్లు మాత్రమే ఇచ్చారు. రెండవ ఫేజ్‌లో 1,28,000 ఖాతాలకు రూ. 517 కోట్లకు గాను రూ.193.06 కోట్లు ఇచ్చారు. మూడవ ఫేజ్‌లో 14,808 ఖాతాల పరిధిలో రూ.74.58 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.23.02 కోట్లిచ్చారు. మొత్తం మూడు ఫేజ్‌లు కలిపి 4,74,034 ఖాతాల పరిధిలో రూ. 2011.92 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం రూ.593.6 కోట్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ఇంకా రూ. 1418.32 కోట్లు ఇవ్వాల్సివుంది. ఈ లెక్కన 25 శాతం మొత్తాన్ని కూడా రైతులకు చెల్లించలేదు. మిగిలిన రూ.1418.32 కోట్లకు సంబందించి 10 శాతం వడ్డీ వేసుకుంటే మరో రూ.140 కోట్లు ఇవ్వాలి. ఈ లెక్కన ఇంకా రూ.1550 కోట్లు పైనే ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి వుంది. కానీ ఇప్పట్లో సర్కారు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించే పరిస్థితి కనిపించడం లేదు. మాఫీకి ఆర్థిక ఇబ్బందుల సాకు.. మిగిలిన మొత్తంలో రెండో విడతగా రూ. 350 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటూ ప్రకటించడం చూస్తే రాబోయే ఐదేళ్లకు కూడా బాబు చెప్పే రుణమాఫీ అమలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లెక్కన మాఫీ అయిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించే లోపు బ్యాంకు అప్పుకు వడ్డీకి కూడా సరిపోదని, రైతులు బ్యాంకుకు మళ్లీ అప్పు పడాల్సి ఉంటుందని సాక్షాత్తు బ్యాంకు అధికారులే పేర్కొనడం గమనార్హం. ముఖ్యమంత్రి పర్యటనలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు సాకుగా రైతు రుణమాఫీ డబ్బులు ఎగనామం పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మాఫీ కాదు... దగా చేశారు
♦ ఎన్నికల సమయంలో రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు ♦ అధికారంలోకి వచ్చాక రైతాంగాన్ని నిలువునా ముంచారు ♦ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం లేదు ♦ అసెంబ్లీలో ఏపీ సర్కారును నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: దారుణమైన అబద్ధాలు చెబుతున్న ఏపీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కాక రైతుల్ని నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. ఆయన బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రుణమాఫీపై మాట్లాడారు. జగన్ మాట్లాడుతున్నంత సేపూ అధికార పక్షం పదేపదే అడ్డు తగిలింది. ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడాల్సిన అవసరం లేదని జగన్ మైక్‌ను స్పీకర్ పలుమార్లు కట్ చేశారు. పలు అవాంతరాల మధ్యే జగన్ ప్రసంగించారు. ఒకదశలో మాఫీపై సభలో అరగంట సేపు తీవ్ర వాగ్వా దం జరిగింది. ఎన్నికల ముందు రైతులకు అబద్ధాలు చెప్పి, ఆ తర్వాత మోసం చేసి వాళ్ల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతూ తన సహచర సభ్యులతో కలిసి వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ... ‘‘ఎన్నికల వేళ రైతులతో ఓట్లు వేయించుకోవడానికి... బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. ఎన్నికలప్పుడు ఎక్కడ చూసినా ఇవే ప్రకటనలు. ఏ గోడలపై చూసినా ఇవే రాతలు. గ్రామాల్లోనూ ఫ్లెక్సీలు పెట్టారు. ప్రజలకు కనిపించవేమోనని ఆ ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టారు. బాబు ఏ సభలో మాట్లాడినా రుణమాఫీ చేస్తామన్నారు. రైతులను నమ్మించారు. అధికారంలోకి రాగానే దగా చేశారు’’ అని నిప్పులు చెరిగారు. సాగు రుణాలకే మాఫీ: ప్రత్తిపాటి మాఫీపై ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూటిగా సమాధానం ఇవ్వలేదు. మాఫీ తప్పక చేస్తామన్నారు. బంగారాన్ని వేలం వేస్తామంటూ బ్యాంకులు నోటీసులు జారీ చేసిన విషయం తమకు తెలియదన్నారు. పంటల సాగు కోసం తీసుకున్న బంగారం రుణాలకే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. నోటీసులందలేదనడం దుర్మార్గం: కల్పన బంగారు నగలను వేలం వేస్తామని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తే, అవి తమ దృష్టికి రాలేదని వ్యవసాయ మంత్రి చెప్పడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష ఉపనేత ఉప్పులేటి కల్పన విమర్శించారు. నోటీసులు తీసుకున్న మహిళలు ప్రతిరోజూ మంత్రులు, ఎమ్మెల్యేలను కలుస్తూనే ఉన్నారన్నారు. బంగారం రుణాలు పంటల సాగు కోసం కాదనడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు బావకే రుణం మాఫీ కాలేదు ‘‘తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని చంద్రబాబు చెప్పడం వల్ల రైతులు చెల్లించడం ఆపేశారు. ఆ రైతులకు అప్పటివరకు రూ.లక్ష లోపు రుణాలకు వడ్డీ ఉండేది కాదు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ ఉండేది. టీడీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పుడు రుణ పరపతి పోయింది. చంద్రబాబు రుణాలు కట్టొద్దు అని చెప్పడం వల్ల ఇప్పుడు అపరాధ వడ్డీ కింద బ్యాంకులు 14 నుంచి 18 శాతం రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. బాబు సీఎం అయ్యేనాటికి రూ.87,612 కోట్ల రైతు రుణాలు ఉన్నాయి. ఈ రుణాలపై రైతులు రెండేళ్లలో చెల్లించాల్సిన వడ్డీ రూ.24 వేల కోట్లు. ఈ రెండేళ్లలో బాబు ముష్టి వేసినట్లు ఇచ్చిన సొమ్ము రూ.7,300 కోట్లే. ఇది రైతులు చెల్లించాల్సిన వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోని పరిస్థితి. ఇక బాబు సొంత బావకే రుణం మాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్యాంకుల్లోని రైతుల బంగారాన్ని వేలం వేస్తామంటూ రోజు పత్రికల్లో ప్రకటనలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం లేదు’’ అంటూ సర్కారు వైఖరిని జగన్ ఎండగట్టారు. -
చేనేతలరాత ఇంతేనా..
♦ చేనేత రుణాలన్నీ మాఫీ చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ♦ 159 గ్రూపులకుగాను కేవలం 42 గ్రూపులకే మాఫీ ♦ వ్యక్తిగత రుణాల విషయంలో 757కుగాను 512 మందికే వర్తింపు ♦ పవర్‌లూమ్స్ విషయంలోనూ అదే దారి ♦ ఆధార్ అనుసంధానం పేరుతో చాలామందికి మాఫీ కాని వైనం ♦ మార్చి చివరికి బ్యాంకు ఖాతాల్లో పడుతుందంటున్న అధికారులు ♦ రెండేళ్లుగా మొదటి విడతకే దిక్కులేదు...రెండో విడత ఎప్పుడో? అధికారంలోకి రాక మునుపు ఒకమాట... వచ్చిన తర్వాత మరొక మాట చెప్పడం ‘దేశం’ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మహిళలు.. రైతులు.. చేనేతలు.. ఎవ్వరూ కూడా ఒక్కపైసా బ్యాంకులకు కట్టొద్దు...అధికారంలోకి రాగానే మాఫీ చేసి రుణ విముక్తులను చేస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రగల్బాలు పలికారు. ‘ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న......ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ విషయంలో బాబు యూ టర్న్ తీసుకున్నారు. ఏదో ఒక రూపంలో వీలైనంత మేర రుణమాఫీని తగ్గించడమే లక్ష్యంగా ఆంక్షలు పెడుతున్నారు. రెండేళ్లు పూర్తవుతున్నా నేటికీ ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ చేతికి అందకపోవడం గమనార్హం. సాక్షి, కడప: జిల్లాలో చేనేతలకు సంబంధించి వేలాది మగ్గాలు ఉన్నాయి. ప్రధానంగా మాధవరం, ప్రొద్దుటూరు, పుల్లంపేట, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాలలో చేనేత వృత్తిని నమ్ముకుని అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, చేనేత వృత్తిలో నష్టాలు రావడంతో చాలామంది రుణాలు తీసుకున్నారు. ప్రధానంగా జిల్లాలో 757 మంది చేనేత కార్మికులు వ్యక్తిగత రుణాలు తీసుకోగా, అందులో 512 మందికి రూ.1.37 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. మిగిలిన 245 మందికి సంబంధించిన ఆధార్ ఠ మొదటిపేజీ తరువాయి నెంబర్లు అనుసంధానం కాలేదు. దీంతో వీరికి రెండవ విడతలో ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 216 పవర్‌లూమ్స్ ఉండగా, అందులో 126 పవర్‌లూమ్స్‌కు మాత్రమే రూ.41,87,382 లక్షలు కేటాయించారు. మిగిలిన 90 పవర్‌లూమ్స్‌కు ఎప్పుడు కేటాయింపులు జరుగుతాయో అర్థం కావడం లేదు. సగానికి సగం గ్రూపులకు కూడా అందని మాఫీ ఇక చేనేతల్లో మహిళా గ్రూపులకు సంబంధించి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు బాబు సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో ఒక్కో గ్రూపులో ఒకరు మొదలుకుని ఎంతమంది ఉన్నా రూ.5 లక్షల వరకు రుణాలు అందించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 159 మహిళా చేనేత గ్రూపులు ఉండగా, కేవలం 42 గ్రూపులకు మాత్రమే రుణమాఫీని వర్తింపజేశారు. 42 గ్రూపులకుగాను కోటి 2 లక్షల రూపాయలను కేటాయించారు. అయితే మరో 117 గ్రూపులకు సంబంధించిన రుణమాఫీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. అంటే సగం గ్రూపులకు కూడా మాఫీ సొమ్ము అందని పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. రెండవ విడత ఎప్పుడో? మొదటి విడత చేనేత రుణమాఫీకి సంబంధించి చేనేత జౌళి శాఖ అధికారులు జిల్లాలోని వ్యక్తిగత, గ్రూపు, పవర్లూమ్స్ల ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం రూ. 2.80 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రతిపాదనలు వెళ్లిన అనంతరం సంబంధిత కార్మికుల అకౌంట్లలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. మొదటి విడత రుణమాఫీ మొత్తం ఈనెలాఖరులోపు జమ అయ్యే అవకాశం కనిపిస్తుండగా, రెండవ విడత ఎప్పుడు మంజూరవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికి జిల్లాలో చేనేత కార్మికులకు రుణాలు అందడంతో పాటు రుణమాఫీ కూడా పెద్ద సమస్యగా మారింది. మార్చి చివరి నాటికి ఖాతాలకు రుణమాఫీ - ఏడీ జయరామయ్య జిల్లాలో చేనేత రుణమాఫీకి సంబంధించి 512 మందికి వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయని.. 42 గ్రూపులకు, మరో 126 పవర్‌లూమ్స్‌కు రుణమాఫీ మంజూరైనట్లు చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జయరామయ్య తెలిపారు. ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ రూ. 2.80 కోట్లు రుణమాఫీ కింద ప్రభుత్వం కేటాయించిందని...మార్చి నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అంతేకాకుండా మరికొన్ని గ్రూపులకు, వ్యక్తిగత రుణాలకు సంబంధించి కూడా రెండవ విడతలో మాఫీ సొమ్ము జమచేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆధార్ అనుసంధానం కాకపోవడంతోపాటు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. -
విద్యుత్ బకాయిలు మాఫీ
► గ్రేటర్లో నెలకు 100 యూనిట్లలోపు కేటగిరీకి వర్తింపు.. జీవో జారీ ► రూ. 52.42 కోట్ల బకాయిలు రద్దయ్యే అవకాశం ► రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బకాయిలపై అపరాధ రుసుము కూడా మాఫీ ► మార్చి 31లోగా అసలు బిల్లులు చెల్లిస్తే వర్తింపు ► ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో నెలకు 100 యూనిట్లలోపు వినియోగానికి సంబంధించిన విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ బకాయిల మొత్తం రూ.52.42 కోట్లను ప్రభుత్వమే విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు చెల్లించనుంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గృహ, ప్రభుత్వ కార్యాలయాలు, సేవల కేటగిరీల్లో డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యుత్ బిల్లుల బకాయిలపై అపరాధ రుసుమును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఈ వినియోగదారులంతా వచ్చే మార్చి 31లోగా బకాయిల సొమ్మును చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ బిల్లుల బకాయిలపై ప్రతి నెలా 1.5 శాతం అపరాధ రుసుము విధిస్తుండడంతో... రాను రాను అసలు బకాయిలతో పోల్చితే అపరాధ రుసుమే ఎక్కువవుతోంది. అలాంటివారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. ఇక వచ్చే ఏప్రిల్ 1వ తేదీలోగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆయా శాఖల ఖర్చుతోనే ‘ప్రీపెయిడ్’ విద్యుత్ మీటర్లను బిగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు, స్థానిక సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్ల ద్వారానే బిల్లింగ్ జరపాలని డిస్కంలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అయ్యే వ్యయాన్ని ఆయా శాఖల నుంచే మూడు విడతల్లో వసూలు చేయాలని సూచించింది. ప్రీపెయిడ్ మీటర్ల రీచార్జి, ఆన్లైన్ బిల్లుల చెల్లింపునకు సంబంధించి గడువులోగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు నుంచి నీటి సరఫరా, వీధి దీపాల కేటగిరీలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. జీహెచ్ఎంసీలో 3.69 లక్షల వినియోగదారులకు లబ్ధి విద్యుత్ బకాయిల మాఫీతో హైదరాబాద్‌లో వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే దాదాపు 3.69 లక్షల మంది వినియోగదారులకు ప్రయోజనం కలుగనుంది. వంద యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించిన వినియోగదారులు కూడా తమ పెండింగ్ బిల్లులను మార్చి 31లోగా చెల్లిస్తే అపరాధ రుసుము మాఫీ కానుంది. ఈ నిర్ణయంతో మరో 2.16 లక్షల మంది వినియోగదారులు లబ్ధిపొందే అవకాశముంది. -
రుణమాఫీ మాయరా.. సూరయ్య..
గ్రామంలో ఏ నలుగురు కలిసినా రుణమాఫీపైనే చర్చ. ఎలక్షన్లో నమ్మించి.. ఆ తరువాత నట్టేట ముంచిన చంద్రబాబు వైఖరిపై ప్రతి ఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు. కైకలూరు మండలం ఆళ్లపాడు రచ్చబండ వద్ద గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కొందరు రైతుల సంభాషణ ఇదీ.. రామ్మూర్తి : ఏంటి.. సూరయ్య బావా అంత దిగాలుగా కూర్చున్నావ్.. ఇంట్లో ఎవరికైనా బాగాలేదా ఏంటీ.. సూరయ్య : అదేంలేదు రామ్మూర్తి.. ఇప్పుడే పొలంగాడికి పోయి వత్తున్నా.. రాకరాక చినుకుపడింది.. సాగు చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు.. మన ఊరి ఆసామిని అప్పడిగితే లేదు పొమ్మన్నాడు. రామ్మూర్తి : అయ్యో.. బావా ఎంతకట్టమెచ్చిపడింది.. పోని బ్యాంకోళ్ల కాడికి పోకూడదూ.. సూరయ్య : అదీ అయ్యింది బావా.. మొన్న పంటకు మీ అక్క సుబ్బలక్ష్మి నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను.. సరిపోక పొలం కాగితాలు పెట్టి మళ్లీ తీసుకున్నాను.. ఇప్పుడేమో ఏవో నోటీసులంటా.. ఇంటికి పంపారు.. తాగడానికి.. గంజినీళ్లే దొరకడం లేదు.. ఇప్పుటికిప్పుడూ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చికట్టేది.. (అంటుండగా కాసులు కాలినడకన వచ్చి ఆగాడు.) కాసులు : ఏంటీ.. బావబామ్మర్దిలిద్దరూ తెగ మాటాడేసుకుంటున్నారు. ఏంటి.. కథ సూరయ్య : కథా.. కాకరకాయా.. మా క ట్టాలు చెప్పుకొంటున్నాం.. అదును దాటిపోతోంది. కాడి కడతానికి పైసల్లేవ్.. కాసులు : అదేంటి సూరయ్య.. మొన్న ఎలచ్చన్లో మనూరొచ్చిన చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారుగా.. సూరయ్య : ఆ.. అవును.. అదే నమ్మి ఓటేశాం. ఆయన గారు ముఖ్యమంత్రి కాగానే రుణాలు రద్దుచేసి.. బ్యాంకోళ్లు డబ్బు లిత్తారని ఎదురుచూశాం. తీరా ఓటు దాటిన తర్వాత గేటు మూసినట్లుగా ఉంది పరిస్థితి. అదేదో రీషెడ్యూలంటా.. అది కూడా కిందటేడాది ఆరు నెళ్లకేనంటా.. కాసులు : నీవు చెప్పేది నిజమే సూరయ్య. కమిటీ అంటూ ఓ 40 రోజులు గడపుకొచ్చారు.. తీరా రీషెడ్యూలంటా మెలిక పెట్టారు. ఇదే జరిగితే మనకు పావలా వడ్డీ ఏమో గానీ, 13 శాతం వడ్డీతో పాటు చక్రవడ్డీ, బారువడ్డీలో బ్యాంకోళ్లు మన ఆస్తుల్ని గింజేసుకుంటారు. ఇంకో విషయం తెలుసా.. మనం బ్యాంకులో తనఖా పెట్టిన పొలం దస్తావేజులు ఇవ్వరంటా. మన పిల్లల పెళ్లిళ్లకు అవసరమయ్యి పొలం అమ్ముదామన్నా ఇక కుదరదు. అది సరే గానీ రామ్మూర్తీ ఎలచ్చన్ల ముందు హామీలు ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలీయదా ఏంటీ.. రామ్మూర్తి : అవును కాసులు.. ఏదో విధంగా గద్దెనక్కెమా లేదా అన్నట్టుగానే ఉంది వీళ్ల తీరు. లేదంటే ఏంటీ.. మనకు రుణాలు మాఫీ చేస్తే పొరుగు రాష్ట్రాలు ఊరుకోవంటా. వాళ్లు కూడా అడుగుతారంటా. ఇది ముందు తెల్వదా వాళ్లకు. అంతెందుకు.. మాది ఉమ్మడి కుటుంబం. మా తమ్ముడు, అన్న కూడా రుణాలు తీసుకున్నారు. కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అంటే మా పరిస్థితేంటీ. కాసులు : అదీ సరే గాని రామ్మూర్తీ.. అటుచూడూ.. ఉరుకులు పరుగుల మీద వస్తోందీ.. మన పురుషోత్తమేనా.. రామ్మూర్తి : అవునవునూ.. ఆపండపండీ.. ఏంటీ సంగతి పురుషోత్తం.. పురుషోత్తం : ఏం చెప్పమంటారు బాబు. ఆ చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పడంతో మా ఆవిడ శీతాలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం కట్టకుండా, కైకలూరులో కలర్ టీవీ, ఫ్రిజ్, డబుల్‌కాట్ మంచాలు.. ఇంకా ఏవేవో కొనేసింది. దాని సిగతరగ ఇప్పుడేమో బ్యాంకోళ్లు ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబ్బాబు.. కాస్త మీరైన చెప్పండి. రామ్మూర్తి : అందరి పరిస్థితి అదేలే.. పదండి ఆ గొడవెంటో చూద్దాం.. అని నలుగురు ముందుకు కదిలారు. -
సర్కారీ ఆస్తులు తనఖా పెడదాం!
-
అప్పుడే మొదలు
రుణమాఫీపై కొరవడిన స్పష్టత రీషెడ్యూల్పైనా అయోమయం బకాయిలు చెల్లించాలంటున్న బ్యాంకర్లు ప్రైవేటు అప్పుల కోసం రైతుల అగచాట్లు వరుణుడు కరుణించినా.. ప్రభుత్వం మాత్రం అన్నదాతలతో పరిహాసమాడుతూనే ఉంది. కురుస్తున్న వర్షాలు కొత్త ఆశలు చిగురింపచేస్తున్నా.. చేతిలో చిల్లి గవ్వ లేక రైతు దిక్కులు చూస్తున్నాడు. రుణ మాఫీ పేరుతో వంచించిన ప్రభుత్వం తాజాగా రీ షెడ్యూల్ ప్రకటన తెరపైకి తెచ్చింది. అయితే అన్నదాతలు బ్యాంకులకు వెళితే తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ సిబ్బంది తిప్పి పంపుతున్నారు. దాంతో ఖరీఫ్ మదుపుల కోసం అంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. విశాఖ రూరల్/నర్సీపట్నం రూరల్ : తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు హామీలు కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రుణాలు రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు ఆ విషయాన్ని తేల్చలేదు. రుణాలు రీషెడ్యూల్కు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు బ్యాంకర్లకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. రీషెడ్యూల్ కారణంగా వడ్డీ భారమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది. కాలం కలిసి రాకపోవడంతో పాటు ప్రస్తుత అధికార పార్టీ రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఈ ఖరీఫ్‌లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే ఇవ్వాలన్నది లక్ష్యం. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 1668 మంది రైతులకు కేవలం 3.03 కోట్లు రుణాలు మాత్రమే అందజేశారు. మిగిలిన వారు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వలేక పంటలు వేయలేని దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రుణాలు అందించే విషయంలో సత్వరం చర్యలు తీసుకోని పక్షంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. బ్యాంకర్లు... మరో‘సారీ’ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు దాటినా ఇంతవరకు రుణ మాఫీపై స్పష్టత లేకుండా పోయింది. దీనికై సీఎం వేసిన ప్రత్యేక కమిటీ నేటికీ నివేదిక ఇవ్వలేదు. దీంతో ఇటీవల రుణ మాఫీ స్థానే రీ షెడ్యూల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానాన్ని ప్రకటించి రోజులు గడుస్తున్నా దీనికి సంబంధించిన విధి విధానాలపై బ్యాంకర్లకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు వారు ఇదే విషయాన్ని చెప్పి తిరిగి పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అడపా, దడపా చినుకులు పడుతుండడంతో రైతులు సాగు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పులు చేయక తప్పదంటూ ఆవేదన చెందుతున్నారు. రుణాలు ఇస్తేనే... నాది గొలుగొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ ద్వారకానగర్. ఏటా 6 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేస్తాను. ప్రస్తుతం అడపాదడపా వర్షా లు పడుతున్నాయి. బ్యాంకర్లు అప్పులిస్తారన్నఆశతో గ్రామం లోని పెద్దల వద్ద చేబదులుగా కొంత నగదు తెచ్చి విత్తనాలు జల్లాను. ఉబాలు, నాట్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులకు మరి కొంత అవసరం ఉంటుంది. రుణం విషయమై బ్యాంకర్లు నోరు మెదపకపోవడంతో ప్రైవే టు అప్పుల కోసం తిరుగుతున్నాను. - సుర్ల సన్యాసిపాత్రుడు, రైతు, పాత మల్లంపేట ప్రైవేటు అప్పులే దిక్కు నాది గొలుగొండ మండలం జోగుంపేట. నాకున్న ఐదెకరాల్లో వరి సాగుకు సిద్ధమయ్యాను. గతేడాది పంట కలిసిరాకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించలేకపోయాను. ఈ ఏడాది రుణాల రీ షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్లు కొత్త అప్పులిచ్చేందుకు వెనుకంజవేస్తున్నారు. ఇలా అయితే ప్రైవేటు అప్పులతో బాగా నష్టపోవడం తప్పదు. - కె.రామకృష్ణ, రైతు,జోగుంపేట. -
రుణ మాఫీ... తలనొప్పి!
ఏదీ తేల్చని టీడీపీ ప్రభుత్వం పీఏసీఎస్‌ల్లో నిలిచిపోయిన లావాదేవీలు ఐదు నెలలుగా జీతాలందని సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో లబోదిబోమంటున్న వైనం స్పందించని డీసీసీబీ, ప్రభుత్వం తుమ్మపాల : ‘ఎంకిపెళ్లి సుబ్బిచావుకి వచ్చింది’ అన్న చందంగా తయారయింది ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) పరిస్థితి. ఓట్ల గేలంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీ హామీ పీఏసీఎస్ ఉద్యోగులకు జీతాల్లేకుండా చేసింది. ప్రభుత్వం రుణాన్ని మాఫీ చేస్తుందన్న ఉద్దేశంతో రైతులెవరూ బకాయిలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో చాలా పీఏసీఎస్‌ల్లో ఐదు నెలల నుంచి జీతాల చెల్లింపు కూడా నిలిచిపోయింది. మాఫీపై ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండడం, స్పష్టమైన వైఖరి లేకుండా దాటవేత యత్నాలు చేస్తుండడం, పూటకో ప్రకటనతో గందరగోళానికి గురి చేస్తుండడంతో అసలు మాఫీ అవుతుందో లేదో అన్న బెంగ రైతుల్ని వేధిస్తోంది. కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడం కూడా వారిని ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు సహకార సంఘాలు కూడా ఇదే సందిగ్ధంతో కొనసాగుతున్నాయి. రుణాలపై వచ్చే వడ్డీపైనే పీఏసీఎస్‌ల మనుగడ ఆధారపడి ఉంది. బకాయిలు వసూలు మేరకే సిబ్బందికి జీతాభత్యాల చెల్లింపు ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. మాఫీ హామీ ప్రకటన నుంచే బకాయిలు వసూలు గణనీయంగా తగ్గిపోయింది. ‘ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అసలు లావాదేవీలే లేవు. సంఘాల మెట్లెక్కే రైతు కనిపించడం లేదు. సిబ్బంది వసూలు వెళితే ముఖాలు చాటేస్తున్నారు. ఇక మాకు జీతాలు వస్తాయన్న నమ్మకం లేదు’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. ఫిబ్రవరి నుంచి రైతులకు జీతాలు అందడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే నెలరోజులు గడిచిపోయింది. ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో ఈనెల కూడా జీతాలు అందే పరిస్థితి లేదని సిబ్బంది వాపోతున్నారు. ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో నానాపాట్లు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్లే... జిల్లాలో 98 పీఏసీఎస్‌లున్నాయి. వీటిలో 78 పీఏసీఎస్‌ల్లో సిబ్బందికి జీతాలు చెల్లించడం లేదు. దీంతో దాదాపు 250 మంది ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందిగా తయారయింది. మిగిలిన 20 పీఏసీఎస్‌ల్లో బంగారంపై రుణాలు ఇవ్వడం, డిపాజిట్లు బాగుండడం, పరపతి, పరపతేతర సేవలు అందిస్తుండడంతో సిబ్బంది జీతాలకు ఢోకాలేకుండా పోయింది. అనకాపల్లి మండలంలోని తుమ్మపాల పీఏసీఎస్ సిబ్బందికి జీతాలందుతుండగా, సిహెచ్.ఎన్.అగ్రహారం సిబ్బందికి జీతాలు లేవు. ‘గతంలో ఆర్థిక ఇబ్బందులున్న సొసైటీలకు ఒక శాతం వడ్డీకి కేంద్ర బ్యాంకు రుణాలు ఇచ్చేది. వసూళ్లు జరిగాక రికవరీ చేసుకునేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సొసైటీ తీర్మానం చేస్తే ఐదు శాతం వడ్డీపై మాత్రమే ఇస్తున్నారు’ అని ఉద్యోగులు వాపోతున్నారు. మూడు నాలుగు నెలల నుంచి డీసీసీబీ కార్యాలయం చుట్టూ జీతాల కోసం ప్రదక్షిణ చేస్తున్నా ఇదిగో అదిగో అనడమే తప్ప స్పష్టతలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. దీంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ నిధులూ హుళక్కి జీతాల్లేక పోవడంతో పీఎఫ్ ఖాతాలకు నిధులు జమ చేయడం లేదు. దీంతో పదవీ విరమణ పొందిన, మృతి చెందిన ఉద్యోగులకు పింఛన్, ఇతర సౌకర్యాలు అందని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా ఐదో తేదీలోగా పీఎఫ్ బకాయి చెల్లించాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఐదు నెలలైంది ఐదు నెలలుగా జీతం అందలేదు. బ్యాంకులో లావాదేవీలు నిలిచిపోవడంతో ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. దీంతో జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం, డీసీసీబీ అధికారులు స్పందించి జీతాలు చెల్లించాలి. - సిహెచ్.మధుసూదనరావు, కార్యదర్శి, సిహెచ్.ఎన్.అగ్రహారం పీఏసీఎస్ ఉద్యమం తప్పదు ప్రభుత్వం, డీసీసీబీ స్పందించి 20 రోజుల్లోగా పీఏసీఎస్‌ల సిబ్బందికి జీతాలు చెల్లించకుంటే ఉద్యమం చేపడతాం. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సమావేశంలో పీఏసీఎస్ ఉద్యోగుల జీతాల విషయమై చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం. అవసరమైతే జీతాలు చెల్లించే వరకు ఉద్యమిస్తాం. - పి.నాగభూషణం, సహకార సంఘాల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
ఎంపీ ముత్తంశెట్టికి చేదు అనుభవం
అనకాపల్లి రూరల్: రుణ మాఫీపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూటకో మాట చెబుతున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు బ్యాంకుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు ప్రభుత్వం ఎటూ తేల్చని తీరుతో అసహనానికి గురైన పలువురు మహిళలు ఏ విషయం తేల్చాలంటూ ఎంపీని నిలదీశారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో అధికారులతో ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చాంబర్లోకి దూసుకువచ్చిన డ్వాక్రా మహిళలు ‘రుణ మాఫీపై ఏదో తేల్చండి. బకాయిలు తీర్చాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కట్టక పోతే పొదుపు డబ్బు నుంచి మినహాయిస్తున్నారు. మేము రుణాలు తీర్చాలా? వద్దా?’ అంటూ నిలదీశారు. దీంతో అవాక్కయిన ఎంపీ ఏదోలా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కమిటీ వేశారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈలోగా పట్టణ బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ జోక్యం చేసుకుని ‘తన భార్య కూడా డ్వాక్రా మహిళే’ అని అనడంతో అక్కడివారు అవాక్కయ్యారు. వెంటనే సర్దుకున్న ఎంపీ డ్వాక్రా మహిళల్లో డబ్బు న్న వారు కూడా ఉన్నారని, అందువల్ల కేటగి రీగా విభజించి అర్హుల రుణాలే రద్దు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. -
హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదు
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రైతులను మభ్యపెట్టడానికే రుణమాఫీపై కమిటీ బాబు వచ్చె.. ఉన్న ఉద్యోగాలు పోయే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలి పీలేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన పీలేరు, కేవీపల్లె మండలాల్లో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి పర్యటించారు. తలపులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలతోపాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటి సంతకం రుణమాఫీపైనే అంటూ రైతులు, డ్వాక్రా మహిళలను మభ్య పెట్టడానికి కోటయ్య కమిటీని ఏర్పాటుచేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులకు సరైన సమయంలో విత్తనాలు అందక, మరోవైపు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరం అన్ని రకాల రుణాలను ఎటువంటి షరతులూ లేకుండా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బాబొస్తారు..జాబొస్తుందని ఎన్నికల్లో గొప్పలు చెప్పుకుని ఓట్లు దండుకున్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు ప్రాతిపదికన ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని విధుల నుంచి తొలగించడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓ విధంగా, అధికారం వచ్చాక మరోవిధంగా ప్రవర్తించడం తగదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యులు ఎం.రెడ్డిబాషా, జీ.జయరామచంద్రయ్య, పార్టీ నాయకులు మల్లికార్జునరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి, ఏటీ.రత్నశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, కేశవరెడ్డి, ఆనంద్, మస్తాన్, మదనమోహన్‌నాయుడు, ఉదయ్‌కుమార్, స్టాంపుల మస్తాన్, ఎస్.హబీబ్‌బాషా, మస్తాన్, సర్పంచ్‌లు రజియాబేగం, రవీంద్రనాథరెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాసులు, మల్లికార్జునగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
డోలాయమానం
కరుణించని వరుణుడు కనికరించని పాలకులు సాగునీటి జాడే లేదు.. రుణమాఫీ పైనా అనుమానాలే వరుణుడు ఊరించి ఉసూరుమనిపిస్తున్నాడు. ఎండిన కాలువలు వెక్కిరిస్తున్నాయి. కనీసం నారుడుమడులు పోసుకునేందుకు కూడా నీరు లేక రైతులుఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కమ్ముకున్న కారుమబ్బులు సాయంత్రానికి మెల్లగా జారుకుంటున్నాయి. ఆనక అన్నదాత కంటిమీద కునుకు పడటంలేదు. సాగు సాగేనా.. అనే సందేహం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామాల్లో నలుగురు రైతులు కలిస్తే చాలు సాగునీటి విడుదల, రుణమాఫీ గురించే చర్చించుకుంటున్నారు. మచిలీపట్నం : రుతుపవనాలు వచ్చి రోజులు గడస్తున్నా వర్షాల జాడ మాత్రం లేదు. పాలకులు సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో పంటలు సాగు చేయాలా.. వద్దా.. అనే డోలాయమానంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది జూలై నెల ప్రారంభం నాటికే వర్షాలు కురవడంతో వర్షాధారంగానే నారుమడులు పోశామని ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో నారుమడులు పోసేందుకు అవకాశం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. ఇక అంతా పైవాడు... పాలకుల దయపైనే ఆధారపడి ఉందని నిస్సహాయతను వ్యక్తంచేస్తున్నారు. వర్షపాతం చాలా తక్కువ నమోదు జూన్ నెలలో జిల్లాలో 98.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 24.4మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెలలోనే 74.3 మిల్లీ మీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. కురిసిన కొద్దిపాటి వర్షం కూడా అక్కరకు రాకపోవడంతో రైతులు భారీ వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో ఒక్క ఎకరంలోనూ ఇంతవరకు వరినాట్లు ప్రారంభం కాలేదు. జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. విత్తనం మొలకెత్తడానికి అవసరమైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పత్తి విత్తాలా.. వద్దా.. అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కాలువలకు తాగునీటిని మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం.. సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రకటించలేదు. దీంతో ఎప్పుడు నారుమడులు పోసుకోవాలి, వరినాట్లు ఎప్పుడు పూర్తిచేయాలని, రుణమాఫీ చేస్తారా.. అని గ్రామాల్లో రైతులు చర్చించుకుంటున్నారు. ముందస్తుగానే నాట్లు వేసేవాడిని మా గ్రామంలో ముందస్తుగానే నేనే వరినాట్లు పూర్తి చేస్తాను. రాత్రింబవళ్లు తిరిగి పొలానికి నీరు పెట్టుకుని నారుమడులు, వరినాట్లు త్వరితగతిన పూర్తి చేసేవాడిని గత ఏడాది ఈ రోజుల్లో నారు మడి పోశాను. వర్షాలు లేకపోవటంతో నారుమడి పోసేందుకు అవకాశం లేకుండా పోయింది. కాలువల ద్వారా సాగునీటి అవసరాల కోసం నీరు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి కాలువలకు సాగునీటిని విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే వరినాట్లు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. - ఆరేపల్లి తిరుపతయ్య, సుల్తానగరం, మచిలీపట్నం వర్షాభావంతో ఏమీ చేయలేకున్నాం గతేడాది ఈ రోజుల్లో వర్షాలు బాగా కురవడంతో క్షణం తీరికలేకుండా పొలం పనుల్లో నిమగ్నమయ్యాం. ఈ సంవత్సరం జూన్ నెల ముగిసినా వర్షాలు పడలేదు. దుక్కి దున్ని పొలాన్ని సాగుకు సిద్ధం చేసి రోజూ వాన కోసం ఎదురుచూస్తున్నాం. నాలుగు ఎకరాల మెట్టలో పత్తి సాగు కోసం పొలాన్ని సిద్ధం చేయడానికి రూ.8వేలకు పైగా ఖర్చయింది. తొమ్మిది ఎకరాల మాగాణిలో వరి సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు వేయగా, వర్షపాతం లేకపోవడంతో మొలకెత్తలేదు. వర్షాలు పడకపోతే ఈ సీజన్లో పంటలు సాగు చేయడం సాధ్యపడదు. - కొల్లా రామారావు, ఎర్రమాడు, తిరువూరు మండలం -
రుణమాఫీ సాగదీతేనా?
వీడని సందిగ్ధత 22న నివేదిక ఇవ్వాల్సిన ప్రత్యేక కమిటీ మరింత సమయం కావాలని కోరిన వైనం రైతుల్లో ఆందోళన తరుముకొస్తున్న ఖరీఫ్ సీజన్ వ్యవసాయ రుణమాఫీపై ప్రభుత్వం తీరు రైతులను అయోమయానికి గురిచేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీ అమలులో సాగదీత ధోరణి వారికి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఖరీఫ్ సీజన్ తరుముకొచ్చిన తరుణంలో రుణమాఫీపై నేటికీ స్పష్టత లేకపోవటం, కొత్త రుణాల అంశం ప్రస్తావనకే రాకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. మచిలీపట్నం : ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణాలు అన్నింటిని మాఫీ చేస్తామని ముందూవెనుకా ఆలోచించకుండా హామీ ఇచ్చేశారు. ఈ నెల ఎనిమిదిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు రుణమాఫీపై స్పష్టత ఇస్తారని రైతులందరూ ఆశించారు. వారి ఆశలను అడియాసలు చేస్తూ రుణమాఫీపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ నెల 22 నాటికి రుణమాఫీపై ప్రాథమిక నివేదిక ఇస్తుందని చెప్పారు. అయితే ఈ కమిటీ విధివిధానాలు ఖరారు చేసేందుకు మరింత సమయం కావాలని కోరటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రిజర్వు బ్యాంకు నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా అలవికాని హామీ ఇవ్వటం, రుణమాఫీ చేసే సమయానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయంటూ వంకలు చెప్పడమేమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎంత మాఫీ జరిగేనో? జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.9,137 కోట్లు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల రుణాలు రూ.900 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు ఎంత మేర రుణం మాఫీ చేస్తుందో స్పష్టత ఇవ్వటం లేదు. డ్వాక్రా సంఘాలకు రూ.50 వేలు లోపు, రైతులకు లక్ష, లక్షన్నర రూపాయల్లోపు రుణమాఫీ జరుగుతుందంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తూ ఊరిస్తూ వస్తోంది. రుణమాఫీపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు బ్యాంకులకు బాండ్లు ఇవ్వటంతో పాటు రుణాలను రీషెడ్యూలు చేయాలని సిఫార్సు చేశారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించకుండా మళ్లీ కొత్త రుణం ఇచ్చే అవకాశం లేదు. రుణమాఫీ కమిటీ సూచించిన విధంగా బ్యాంకులకు బాండ్లు ఇవ్వటం, రుణాల రీషెడ్యూలు చేస్తే మళ్లీ కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉండదని రైతులు, రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో రుణమాఫీ జరిగిందని, ఈ సమయంలో ప్రభుత్వం బ్యాంకులకు నగదు మొత్తాన్ని చెల్లించిందని రైతులు చెబుతున్నారు. బ్యాంకులకు నగదు చెల్లించకుండా బాండ్లు ఇచ్చినా, రుణాలు రీషెడ్యూలు చేసినా ఉపయోగం ఉండదనేది రైతుల వాదనగా ఉంది. ప్రభుత్వం రుణమాఫీపై సత్వర నిర్ణయం తీసుకోకుంటే.. రుణం వాయిదా మీరిపోయి లక్ష రూపాయలకు రూ.7,750 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. అయినా దీనిపై ప్రభుత్వం మిన్నకుండిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రుణమాఫీపై కాలయాపన చేయకుండా త్వరితగతిన సముచిత నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
సన్నగిల్లుతున్న ఆశలు
రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన కోటయ్య కమిటీకీ గడువు కావాలనడంపై ఆగ్రహం ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతల తంటాలు రుణమాఫీ కథ కంచికి చేరేటట్టు కనిపించడం లేదు. అమలు విషయంలో కాలయాపనతో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నమ్మించి మోసం చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బకాయిలను నగదు రూపేణా ప్రభుత్వమే చెల్లించాలని ఆర్బీఐ పేర్కొనడం, కోటయ్య కమిటీకి మరింత గడువు కావాలని ఆర్థిక మంత్రి ఆదివారం ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమలవుతుందో లేదోనన్న బెంగ పట్టి పీడిస్తోంది. చోడవరం/నర్సీపట్నం: రుణమాఫీపై స్పష్టత కొరవడడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకులు అప్పులివ్వకపోగా ఉన్నవి తీర్చాలంటూ ఒత్తిడి చేయడం అన్నదాతలకు మింగుడు పడడం లేదు. మరోపక్క మాఫీపై విధివిధానాల అధ్యయనానికి నియమించిన కోటయ్య కమిటీ నివేదికకు మరికొంత సమయం పడుతుందంటూ ఆర్థిక శాఖ మంత్రి ఆదివారం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఖరీఫ్ రుణాల కోసం బ్యాంకులను ఒప్పించే ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2013-14 ఖరీఫ్, రబీల్లో జిల్లాలోని 2,10,881 మంది రైతులు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారు రూ. 894 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిని ఇప్పటికే చెల్లించి, ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికి రుణాలు తీసుకోవా ల్సి ఉంది. గతేడాది సాగు అనుకూలించక పోవడంతో పాటు చంద్రబాబు రుణ మాఫీ హామీ తో ఈ బకాయిలు పేరుకుపోయాయి. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే ఇప్పటికే ఖరీఫ్ పనులు ప్రారంభించాలి. వరుణుడు ముఖం చాటేయడంతో వ్యవసాయపనులు పెద్దగా ప్రారంభం కాలేదు. కానీ అదను ముంచుకురావడంతో అప్పుల కోసం వెంపర్లాడుతున్నారు. కమిటీ నివేదిక పేరుతో మాఫీపై ప్రభుత్వం జాప్యం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క గతేడాది అప్పులు తీర్చాలంటూ కొన్ని బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేశాయి. నెలాఖరులోగా చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి షరతుల్లేకుండా రుణమాఫీ అమలు చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం కోటయ్య కమిటీ ఏర్పాటుకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మాఫీ విధానంతో బ్యాంకులు ఆర్థికంగా నష్టపోతాయంటూ ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈమేరకు ఈ నెల 11న ప్రభుత్వానికి లేఖ రాసింది. మాఫీ తప్పనిసరిగా అమలు చేయాలంటే బకాయిలను నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించాలంటూ అందులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను తాము ఆమోదించబోమని స్పష్టం చేసింది. ఆర్థికస్థితి నామమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో మాఫీ అమలు సాధ్యమా అన్న అనుమానాన్ని మేథావులు సైతం వ్యక్తం చేస్తున్నారు. రుణాలు మాఫీ చేయాలి నాది కె.కోటపాడుమండలం వారాడ సంతపాలెం. నాకు 3ఎకరాలు పొలం ఉంది. ఇందులో ఏటా వరి పంట వేస్తుంటాను. మదుపుల కోసం ఏపీజీవీబీలో రెండేళ్ల కింద రూ.50వేలు అప్పుతీసుకున్నాను. పంట కలిసిరాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాను. టీడీపీ రుణమాఫీ ప్రకటనతో సంబరపడ్డాను. కానీ ఇప్పుడు ఇంకా సమయం పడుతుందని మంత్రి ప్రకటించడం రైతులను మోసగించడమే. ఇలాంటి మాటలు కాకుండా వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి. - వేచలపు సింహాద్రప్పడు, రైతు, వి.సంతపాలెం. మంత్రి ప్రకటనతో భయంగా ఉంది నాది చోడవరం మండలం మైచర్లపాలెం గ్రామం. నాకు రెండెకరాల భూమి ఉంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చోడవరం ఆంధ్రాబ్యాంకులో రెండు తులాల బంగారు ఆభరణాలు గతేడాది కుదువ పెట్టి రూ.30వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుం దని ఎదురు చూస్తున్నాను. ఇంతలో బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది. నెలాఖరులోగా అప్పు తీర్చకుంటే ఆభరణాలు వేలం వేస్తామంటున్నారు. ఆర్థిక మంత్రి ప్రకటనతో ఆందోళనకరంగా ఉంది. - నానుబిల్లి అర్జునరావునాయుడు, రైతు, మైచర్లపాలెం. ప్రభుత్వం మోసం చేస్తోంది నాది దేవరాపల్లి మండలం కొత్తపెంట. నాకు రెండెకరాల పొలం ఉంది. వరి,చెరకు పంటలు వేస్తున్నాను. గతేడాది కె.కోటపాడు స్టేట్బ్యాం క్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి పంట రుణంగా రూ.1.2లక్షలు తీసుకున్నాను. కోటయ్య కమిటీ నివేదికకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం రైతులను మోసం చేయడమే. -రొంగలి వెంకట్రావు, రైతు, కొత్తపెంట. -
కష్టాల ఖరీఫ్
చినుకు జాడ లేదు...విత్తనాల ఊసు లేదు రుణం తీరదు...కొత్త అప్పు పుట్టదు కష్టాల ఖరీఫ్‌లో అన్నదాత ఎదురీత ఈ ఏడాదీ ఖరీఫ్‌కు కష్టాలు తప్పేట్టు లేదు...సకాలంలో రాని రుతుపవనాలు, విత్తనాలకు రాయితీ ఎత్తివేత వీటితో పాటు రుణమాఫీ ప్రకటనతో అప్పులివ్వని బ్యాంకర్లు వెరసి ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సకాలంలో ఖరీఫ్ సాగు కాకపోతే ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ప్రమాదం ఉంది. నర్సీపట్నం : ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.27 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుచేయాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. జిల్లా సాధారణ విస్తీర్ణం 2.03 లక్షల హెక్టార్లు కాగా, వాతావరణం అనుకూలిస్తే మరింత ఎక్కువ సాగుచేయాలనే లక్ష్యంతో ప్రణాళిక తయారు చేశారు. దీనిలో అధికంగా లక్ష హెక్టార్లకు మించి విస్తీర్ణంలో వరి పంటను సాగుచేస్తారని భావిస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో ప్రధానంగా చెరకు 40 వేలు, రాగులు 25 వేలు, చిరు ధాన్యాలు 16,500, గంటి 6 వేలు, మొక్కజొన్న 6,500 హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. వినిపించని ‘రుతు’రాగం కేరళను తాకిన రుతుపవనాలు ఈ నెల ప్రారంభానికే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసినా, జిల్లాలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రస్తుత విషయానికొస్తే జూన్ సాధారణ వర్షపాతం 128.8 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 36.9 మి.మీ నమోదయ్యింది. గత ఏడాది ఇదే సమయానికి 90.3 మి.మీ వర్షపాతం నమోదయ్యిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రుణాల విషయానికొస్తే 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లకు గాను జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది. కాలం కలిసి రాకపోవడంతో పాటు రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 700కోట్లు ఇచ్చేందుకు అధికారులు లక్ష్యంగా చేసుకున్నా ఇంతవరకు ఒక్కరికి రుణం ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పుల కోసం రైతులు వెతుకులాట ప్రారంభించారు. విత్తనాల్లో రాయితీకి కోత ఇక విత్తనాల విషయానికొస్తే జిల్లాలో వరి సాగుచేసేందుకు వివిధ రకాలైన 19.5 వేల క్వింటాళ్లు విత్తనాలను ఏపీ సీడ్స్ సిద్ధం చేసింది. వీటిలో అధికశాతం రైతులు వినియోగించే శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్) విత్తనాల్లో రాయితీకి కోత విధించడంతో రైతులకు మరికొంత భారంగా మారింది. ప్రస్తుతం ఆర్జీఎల్ 510 క్వింటాళ్లు సిద్ధం చేయగా, మరో 340 క్వింటాళ్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎరువుల విషయానికొస్తే జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన 4,917 మెట్రిక్ టన్నుల యూరియా, 6,600 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను సిద్ధం చేశారు. ఈ విధంగా ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల మయంగా మొదలు కాబోతుంది. -
ఏపీ పీసీసీ సమావేశం పారదర్శకంగా నిర్వహిస్తాం
సాక్షి, విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం పూర్తి పారదర్శకంగా నిర్వహించి, ఓటమికి గల కారణాలను తెలుసుకుంటామని మాజీ మంత్రి ఎస్.శైలజానాధ్ తెలిపారు. సోమవారం విజయవాడలోని పరిణయ కల్యాణమండపంలో జరిగిన విలేకర్ల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో ఇతర రాష్ట్ర నాయకులు, మాజీ కేంద్ర,రాష్ట్ర మంత్రులు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి సమగ్రంగా చర్చిస్తామని వివరించారు. ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను చర్చించి, రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వత్తిడి తీసుకువస్తామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో రుణమాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ తరుఫున రైతులకు, మహిళలకు అండగా ఉండి పోరాటాలు చేస్తామని వివరించారు. సమావేశంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము గెలుస్తామని భావించలేదని, ఓడిపోయినప్పటికీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరిణయ కల్యాణ మండపంలో సమీక్ష జరుగుతుందని, సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ నేత రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , సిటీ అధ్యక్షుడు అడపా నాగేంద్ర, మీసాల జిల్లా అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహరావు, తదితరులు పాల్గొన్నారు. -
అదును దాటుతోంది బాబూ..!
మొదలైన ఖరీఫ్ సాగు ఇంకా జిల్లాకు చేరని విత్తన కాయలు పంట రుణాల కోసంరైతుల ఎదురుచూపు రుణమాఫీ ప్రకటన వచ్చే వరకు తప్పని తిప్పలు ప్రభుత్వం పట్టించుకోకుంటే అదును దాటిపోయే ప్రమాదం అదే జరిగితే తీవ్రంగా నష్టపోనున్న రైతులు సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది తొలకరి ముందస్తుగానే పలకరించింది. దీంతో రైతన్నలు దుక్కిదున్ని విత్తనం వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయలేదు. జిల్లాలో 2.2 లక్షల హెక్టార్లు సాగు భూమి ఉంటే అందులో 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. సబ్సిడీపై వేరుశనగ విత్తనకాయలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం మే నెల లోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. 1.05 లక్షల క్వింటాళ్లు ఏపీసీడ్స్, ఆయిల్‌ఫెడ్, ఏపీ అయిల్ ఫెడరేషన్ సరఫరా చేయాలి. అయితే రెండు వే ల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. జిల్లా రైతులు కే-6 రకం కాయలు కావాలని కోరారు. లక్ష క్వింటాళ్లు కే-6 కోసమే అధికారులు ప్రతిపాదనలు పంపారు. అనంతపురం జిల్లా రైతులు కూడా ఈ రకం విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కే-6 విత్తనాలను పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖకు కష్టసాధ్యమైంది. విత్తనకాయలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు. రైతులు మాత్రం పది రోజులుగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పశ్చిమ ప్రాంతంలోని మదనపల్లె, పలమనేరు, చిత్తూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా 5 వేల హెక్టార్లలో ఇప్పటికే సాగు చేశారు. వీరంతా అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని రైతుల వద్ద విత్తన కాయలు కొనుగోలు చేశారు. వీడని పీటముడి ఖరీప్‌లో పంట సాగుకు సిద్ధమయ్యే రైతన్నలకు పెట్టుబడి కష్టసాధ్యంగా పరిణమించింది. టీడీపీ అధికారంలోకి వస్తే పంట రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రైతులంతా ఎదురు చూస్తున్నారు. అయితే రుణాల మాఫీపై చంద్రబాబు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. పరిశీలనకు కమిటీ వేశారు. దీనికి 45 రోజులు గడువిచ్చారు. అప్పటి వరకు రైతులు రుణాల కోసం ఎదురుచూడాల్సిందే! లేదంటే పాత బకాయిలు చెల్లించి కొత్త రుణాలు తెచ్చుకోవాలి. రైతులు, లేదా ప్రభుత్వం పాతబకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే లేదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. 45 రోజుల వరకు ఆగితే సాగుకు అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చాలామంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. పంట రుణాల మాఫీపై ప్రభుత్వం త్వరతిగతిన నిర్ణయం వెలువరించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో రైతులకు సంబంధించి 7693.75 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రుణాల మాఫీ ప్రకటన కోసం 8.7 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సప్తగిరి గ్రామీణ బ్యాంకు యాజమాన్యం పాతబకాయిలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీ లోపు ప్రభుత్వం నుంచి మాఫీ ప్రకటన వెలువడకపోతే తప్పని సరిగా రీషెడ్యూల్ చేసుకోవాలని తేల్చి చెబుతున్నారు. సప్తగిరి గ్రామీణబ్యాంకు శాఖలు జిల్లాలో 104 ఉన్నాయి. వీటి ద్వారా 7.55 లక్షల మంది రైతులకు 5,810 కోట్ల రూపాయల పంటరుణాలు పంపిణీ చేశారు. బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో రుణాలు తీసుకున్న రైతులంతా ఆందోళన చెందుతున్నారు. తెగని పంచాయితీ వేరుశనగ విత్తనకాయల ధరలపై వ్యవసాయశాఖ, నోడల్ ఏజెన్సీల మధ్య పీటముడి వీడలేదు. ప్రభుత్వం పంపిణీ సంస్థల నుంచి బస్తా (30 కిలోలు) కాయలను 1380 రూపాయలకు కొనుగోలు చేసి, రైతులకు 930 రూపాయలకు పంపిణీ చేయాలి. అయితే పంపిణీ సంస్థలు కిలోకు నాలుగు రూపాయల చొప్పున పెంచి బస్తాకు 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు వ్యవసాయశాఖ కమిషనర్ అంగీకరించలేదు. దీంతో విత్తనకాయల సరఫరాకు బ్రేక్ పడింది. ధరల సర్దుబాటు కారణంతోనే ఏజెన్సీల వద్ద కాయలు ఉన్నా సరఫరా చేయలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే రైతులకు సమయానికి వేరుశెనగ విత్తనకాయలు అందే అవకాశం ఉంది . -
కట్టకుంటే ఖబడ్దార్
అప్పులు చెల్లించాలంటూ బ్యాంక్‌లు నోటీసులు డ్వాక్రా మహిళల నుంచి రికవరీకి రంగం సిద్ధం రుణమాఫీ ప్రకటనలో ప్రభుత్వ తాత్సారం ఆందోళన చెందుతున్న రైతులు రుణాల ఉచ్చులో రైతులు, డ్వాక్రా మహిళలు గిలగిల కొట్టుకుంటున్నారు. రుణమాఫీ ఆశతో వారంతా ఆరు నెలల నుంచి చెల్లింపులు ఆపేశారు. రూ. వందల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కుదేలయ్యే ప్రమాదం ముంచుకురావడంతో దానిని అధిగమించేందుకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. రైతులకు నోటీసులు పంపడంతోపాటు అప్పు తీర్చాలంటూ ఫోన్లు చేస్తున్నారు. నర్సీపట్నం/చోడవరం : రుణమాఫీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం తో బ్యాంకులు రైతులపై ఒత్తిడి పెంచుతున్నా యి. తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలం టూ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈ పరిస్థితితో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. చం ద్రబాబు ప్రకటనతో పాటు కాలం కలిసిరాక ఆరు నెలలుగా రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు. జిల్లాలో సుమారు రెండు లక్షల మందికి సంబంధించి రూ.1700 కోట్లు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వీలైనంతమేరకు వసూళ్లకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. అప్పు తీర్చాలంటూ నేరుగా రైతులకు ఫోన్లు చేయడంతో పాటు నోటీసులు జారీచేస్తున్నారు. ఉదాహరణకు మాకవరపాలేనికి చెందిన రైతు కోలా బాబూరావు గత ఖరీఫ్‌లో నర్సీపట్నం జాతీయ బ్యాంకు లో రూ. 80వేలు అప్పు తీసుకున్నాడు. ప్రస్తుతం అసలుతో పాటు వడ్డీతో చెల్లించాల్సి ఉంది. గతేడాది కాలం కలిసి రాకపోవడంతో బకాయి చెల్లించలేదు. రుణం తీసుకుని ఏడాది పూర్తికావడంతో అధికారులు నోటీసులు జారీచేశారు. అలాగే రోలుగుంట మండలం జానకిరాంపురానికి చెందిన రైతు దేవాడ సత్తిబాబు జాతీయ బ్యాంకులో రూ. 90వేల రుణం తీసుకున్నాడు. రుణమాఫీ అమలు చేస్తారని అప్పు విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేశారు. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో రూ.300కోట్లకు పైబడే బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చాయి. మూడు రోజులుగా చోడవరం ఆంధ్రాబ్యాంక్ రైతులకు అప్పు తీర్చాలంటూ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. బంగారు వస్తువులపై తీసుకున్న పంట రుణాలు నెలాఖరులోగా చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ బ్యాంక్ 200 మందికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇదే తరహాలో మిగతా కమర్షియల్ బ్యాంక్‌లు కూడా బకాయి ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. మరో పక్క వెంటనే పంట రుణాన్ని చెల్లించాలంటూ యూనియన్‌బ్యాంక్ రైతులకు సెల్ ఫోన్లలో మెసేజ్‌లతో ఒత్తిడి తెస్తోంది. ఇక నిత్యం రైతులతో మమేకమయ్యే డీసీసీబీ బ్యాంక్‌లు కూడా పరోక్షంగా తమ సిబ్బందితో రైతులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం రుమాఫీ చేయకపోతే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ఇక డ్వాక్రా సంఘాల విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా రూ. 521 కోట్ల రుణాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకు లు సన్నద్ధమయ్యాయి. ఒక్కో డ్వాక్రా సంఘానికి కనీసం రూ. లక్ష వరకు అప్పు ఉంటుందని బ్యాంకర్ల అంచనా. -
ఖరీఫ్‌లో కష్టాల సేద్యం
సబ్సిడీ వేరుశెనగ విత్తనాల పంపిణీలో వ్యవసాయశాఖ జాప్యం అధిక ధరలకు విత్తనాలు కొంటున్న రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు రాష్ట్ర విభజన, రుణమాఫీ పథకంతో ‘సహకారం’ నిల్ సాక్షి, తిరుపతి: జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతుల అగచాట్లు మొదలయ్యాయి. ఈ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలుగానీ, రుణాలుగానీ అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఖరీఫ్‌లో జిల్లాలో ప్రధాన పంట అయిన వేరుశెనగ విత్తనాలు ఇప్పటి వరకు జిల్లాకు చేరుకోలేదు. ఇంకా కొంత సమయం పడుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సబ్సిడీ విత్తనాల కోసం ఎదురుచూడలేక రైతులు ప్రైవేటు వ్యాపారుల నుంచి విత్తన కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతు ల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిన్నటివరకు వేరుశెనగ విత్తనాలు కిలో రూ.33 ఉండగా, శుక్రవారం పది రూపాయలు పెంచి అమ్మకాలు సాగించినట్టు రైతులు చెబుతున్నారు. దీంతో వేరుశెనగ రైతులు పంటల సాగు ప్రారంభంలోనే పెట్టుబడులపై ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్లో వేరుశెనగ సాధారణ విస్తీర్ణం 1,36,400 హెక్టార్లు. ఇందుకోసం లక్షా ఐదు వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలు అవసరమవుతాయి. అయితే ఇప్పటివరకు ఒక్క గింజ కూడా పంపిణీ జరగలేదు. విత్తన కాయల రేటుకు సంబంధించి నోడల్ ఏజెన్సీ లు, అధికారుల మధ్య అవగాహన కుదరలేదు. దీంతో సబ్సిడీ విత్తనాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. ఒక వైపు సీజన్ ముంచుకొచ్చినా అధికారులు మాత్రం రేటు పేరుతో జాప్యం చేస్తున్నారు. జిల్లాలోని పడమటి మండలాల రైతులు మాత్రం సబ్సిడీ విత్తనాల కోసం వేచి చూడకుండా తమ దగ్గర ఉన్న విత్తన కాయలు, ప్రైవేటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, కుప్పం తదితర ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. రుతుపవనాలు ప్రవేశించే సమయం ఆసన్నం కావడంతో ఇప్పటికే భూమిలో ఉన్న తేమ ఆరిపోకుండా నాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. బ్యాంకులకు వెళితే రైతులపై చిన్నచూపు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే రైతులపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందు కు రావడం లేదు. దీంతో పాత రుణాలు తీర్చలేక కొత్త అప్పు పుట్టక లబోదిబోమనే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ప్రతిఏటా ఈ పాటికి రుణాల మంజూరు జరిగేది. కానీ ఈ ఏడాది రుణమాఫీ పథకంతో కొత్తగా అప్పులు ఇచ్చేం దుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. కొత్త రుణా ల మంజూరుకు సంబంధించి ఇంకా స్పష్టత రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. ఈ ఏడాది మార్చి వరకు జాతీయ బ్యాంకులు రూ. 7,660 కోట్ల రుణాలు ఇచ్చాయి. సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు ఈ రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి చివరి వరకు రూ. 1,500 కోట్లు ఇచ్చారు. వీటి సంగతి తేల్చకుండా కొత్తగా రుణాలు ఎలా ఇస్తామంటూ బ్యాంకులకు వెళ్లిన రైతులను అధికారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సహకారం నిల్ జాతీయ బ్యాంకుల పరిస్థితి అలా ఉంటే సహకార బ్యాంకులు పూర్తిగా చేతులెత్తేశాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే రుణాల మంజూరు నిలిపివేయాలని సహకార బ్యాంకులను ఆప్కాబ్ ఆదేశించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఒక్క రూపా యి కూడా రైతులకు రుణం మంజూరు చేయలేదు. ఈ ఏడాది మార్చి వరకు రూ. 200 కోట్లు స్వల్ప కాలిక రుణాలు, మరో రూ. 70 కోట్లు దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేసి ఉన్నారు. ఇవి కాకుండా మరో పది కోట్ల రూపాయలు బంగా రు నగలపై వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆప్కాబ్ ఆదేశాల మేరకు కొత్త రుణాలు ఇచ్చేందుకు సహకార బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. రుణమాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో భారీ మొత్తంలో ఇప్పటికే ఇచ్చిన రుణాల సంగతి తేల్చకుండా కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితిలో సహకార బ్యాంకులు లేవని అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు. ఇన్ని అవరోధాల నడుమ ఖరీఫ్ సీజన్లో రైతుల అవస్థలు దయనీయంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. -
చేనేత రుణాలు మాఫీ చేయాలి
ఏపీ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు ఉరవకొండ: కరువు పీడిత అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తే గానీ అప్పుల ఊబి నుంచి కోలుకోలేరని ఏపీ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసులు తెలిపారు. గురురవారం ఉరవకొండలోని చేనేత కార్యాలయుంలో నిర్వహించిన అసోసియేషన్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సహకార, సహకారేతర రంగాల్లో ఉన్న చేనేత కార్మికులు 31-03-2014 నాటి వరకు తీసుకున్న రుణాలు రద్దు చేయూలన్నారు. ఐదేళ్లుగా చేనేత ముడిసరుకుల ధరలు పెరిగి, కార్మికుడు నేసిన చీరలకు గిట్టుబాటు ధర రాక 109 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, చేనేత శాఖ వుంత్రి కొల్లి రవీంద్రలకు నివేదికలు పంపావున్నారు. జిల్లాలో మూతపడిన చేనేత పరిశ్రవులు, సంఘాలను ఆదుకుని, వాటిపై అప్పులను రద్దు చేసి తిరిగి పురుద్ధరించాలని కోరారు. జిల్లాలో ప్రాధమిక చేనేత , స్వయుం సహాయుక, వ్యక్తిగత, హార్టిజన్, వీవర్స్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకుల్లో తీసుకున్న స్వల్పకాలిక , వుధ్యకాలిక, దీర్ఘకాలిక, నగదు రుణపరపతి రుణాలు వెంటనే మాఫీ చేయూలన్నారు. చేనేత కుటీర, చిన్నతరహా పరిశ్రవులకు తీసుకున్న నగదు రుణపరపతిని, చేనేత గ్రూపులు మగ్గాలపై తీసుకున్న రుణాలను రద్దు చేయూలన్నారు. రుణాల మాఫీ కోసం డీసీసీబీ చైర్మన్ శివశంకర్‌రెడ్డి కూడా నివేదికలు పంపారన్నారు. -
అన్నదాతలో అయోమయం
రుణాల రద్దుపై హామీ ఇచ్చి ఇప్పుడు కమిటీనా? ఎన్నికల మేనిఫెస్టో, ప్రసంగాల్లో ఇచ్చిన హామీలపై ఇప్పుడు సాగదీత ధోరణి ఖరీఫ్ పెట్టుబడులపై అన్నదాతల్లో బెంగ చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల సభల్లోనూ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటంతో రైతుల్లో అయోమయం నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని రైతులు నమ్మారు. అధికారం చేపట్టాక టీడీపీ ప్రభుత్వం.. కమిటీయే విధివిధానాలు ఖరారు చేస్తుందని ప్రకటించటం రైతులను ఆగ్రహానికి గురిచేస్తోంది. చంద్రబాబు తీరు రైతులను మోసగించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు. మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో, చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. మీరు పంట రుణాలు చెల్లించవద్దని రైతులకు చెబుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలను రద్దుచేస్తూ తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబునాయుడు రుణాలను రద్దు చేయకుండా రుణాల మాఫీపై కమిటీని వేయటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కమిటీ రుణమాఫీపై 15 రోజుల్లో ప్రాథమిక నివేదికను అందిస్తుందని, అనంతరం 45 రోజుల్లో తుది నివేదికను సమర్పిస్తుందని, అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటన రైతుల్లో ఆందోళనకు కారణమైంది. అన్నీ మాఫీ చేస్తారా? కొర్రీలు పెడతారా? రుణమాఫీపై కమిటీ నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని రకాల రుణాలను రద్దు చేస్తూ నియమ నిబంధనలు రూపొందిస్తారా లేదా అనే అంశంపైనా రైతుల్లో గందరగోళం నెలకొంది. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీపై కమిటీ వేస్తామని ప్రకటించటంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. వ్యవసాయ రుణాలంటే 12 రకాలు ఉన్నాయి. అవి అడంగల్ కాపీ డాక్యుమెంటేషన్ ద్వారా, పట్టాదారు పాస్‌పుస్తకం ద్వారా, శిస్తు కట్టిన రశీదు చూపి బంగారం కుదువ పెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక, గొర్రెల పెంపకం, వ్యవసాయ యంత్రాల కొనుగోలు తదితర రకాలు. వాటిలో ఏ రకం రుణాలను రద్దు చేస్తారు, ఎంత మొత్తం వరకు రద్దు చేస్తారనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్... జూన్ ఒకటి నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. జూన్ నెలాఖరు నాటికి వాతావరణం అనుకూలిస్తే నారుమడులు పోసుకుని వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంది. బోర్ల ద్వారా మంచినీటి వసతి ఉన్న కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల్లో రైతులు ముందస్తుగానే వరినాట్లు పూర్తిచేస్తారు. రుతుపవనాలు ప్రవేశించి వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా మారితే వరినాట్లు వేగవంతమయ్యే అవకాశం ఉంది. నారుమడుల దశ నుంచే రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. జిల్లాలో వివిధ రకాల వ్యవసాయ రుణాలు రూ.9,137 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో తీసుకున్న రుణాలను చెల్లిస్తేనే మళ్లీ రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు వస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర సమయంలో తాను వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తానని, రుణాలు చెల్లించవద్దంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పాత రుణం రద్దుకాకుండా మళ్లీ పంట రుణం ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు చొరవ చూపుతారా, లేదా అన్న అంశంపై రైతుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. సకాలంలో పంట రుణం రద్దుకాకుంటే 11.75 శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీపై నూతన ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి 45 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయ రుణాలతో పాటు డాక్రా, చేనేత రుణాల పైనా ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రైతుల్లో నెలకొన్న అనుమానాలివే... వ్యవసాయ రుణాల మాఫీపై కమిటీ ఎలాంటి నిర్ణణం తీసుకుంటుందనే అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. దీంతో పాటు వ్యవసాయ రుణాలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు, ఎంత మొత్తంలో రుణమాఫీ జరుగుతుంది అనే అంశంపై అయోమయం నెలకొంది. పంట రుణం సకాలంలో తీసుకుంటేనే పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఆగస్టు 30వ తేదీతో పంట రుణం తీసుకున్న రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ 45 రోజుల తర్వాత సూచనలు చేసినా... వాటిని ప్రభుత్వం ఎన్ని రోజుల్లోగా పాటిస్తుందనే అంశంపైనా రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో అలా... తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణాలను రద్దు చేస్తామని ప్రకటిస్తే ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు పంట రుణాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సీమాంధ్రలో పంట రుణాలు రద్దు చేయడానికి కమిటీ వేసి రైతుల్లో గందరగోళానికి తెరతీశారనే వాదన రైతుల నుంచి వినబడుతోంది. ఎలాంటి షరతులూ విధించకుండా వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీపై చంద్రబాబు తీరు సమంజసం కాదు. తొలి సంతకంతో రద్దు చేస్తానని ప్రకటించి.. ఇప్పుడు కమిటీ ఏర్పాటు ఫైలుపై సంతకం చేయడం తగదు. పైగా 45 రోజులు గడువుతో పాటు విధివిధానాలు పాటిస్తామని ప్రకటించటం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. మరోపక్క ఖరీఫ్ రానే వచ్చింది. చంద్రబాబు హామీతో రైతులెవరూ రుణాలు చెల్లించలేదు. ఇప్పుడు మళ్లీ బ్యాంకు వద్దకు వెళ్లి పంట రుణం ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి లేదు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. సకాలంలో పంట రుణాలు అందకుంటే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. - పుప్పాల నరసింహారావు, రైతు, కృత్తివెన్ను ఎన్నికల మేనిఫెస్టోలో రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీలు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అంతకు ముందు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రలోనూ ఇదే విషయాన్ని చెప్పి ప్రజలను నమ్మించారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా రుణమాఫీ పరిశీలనకు కమిటీ వేస్తున్నామని చెప్పటం రైతులను మోసగించటమే. ఒక వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్న తరుణంలో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. రుణమాఫీ ప్రకటనపై ప్రభుత్వం పునస్సమీక్షించుకుని రైతులకు సకాలంలో రుణాలు అందించే ఏర్పాట్లు చేయాలి. - ఆకునూరి అప్పయ్య, రైతు, గూడూరు -
అనుకున్నట్టే..!
రుణమాఫీపై మాటమార్చిన చంద్రబాబు కమిటీతో జాప్యం కర్షకుల్లో కలవరం విశాఖ రూరల్ : ఊహించినట్టే జరిగింది... అధికారం చేపట్టిన మరుక్షణమే రైతుల రుణమాఫీపై తెలుగుదేశం ప్రభుత్వం మాట మార్చింది. రుణాల రుద్దు సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు నిర్ణయం కర్షకులను కలవరపెడుతోంది. ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. రుణమాఫీపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో కొత్త రుణాల మంజూరుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా మూడేళ్లు ప్రకృతి ప్రకోపాలతో అన్నదాత నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. కరువు, వరదలు కలిసి రైతు వెన్ను విరిచాయి. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారు. ఇటువంటి తరుణంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రుణమాఫీ హామీని గుప్పించారు. ఎటువంటి మెలికలు లేకుండా రైతులు తీసుకున్న అన్ని రుణాలను రద్దు చేస్తామని ప్రకటనలు చేశారు. దీంతో రైతులు కొండంత ఆశతో టీడీపీకి పట్టం కట్టారు. అయితే అధికారం చేజిక్కాక రుణమాఫీపై మెలికలు పెట్టే యోచన చేస్తున్నారు. వీలైనంత తక్కువ మందిని లబ్ధిదారులుగా చూపించి కేవలం వారి రుణాలను మాత్రమే రద్దు చేసి హామీని నేరవేర్చామని చెప్పకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రుణమాఫీతో 2,10,881 మంది రైతులకు లబ్ధి గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్ధేశించారు. అయితే 1,32,375 మందికి లక్ష్యాన్ని మించి రూ.640 కోట్లు అందజేశారు. అలాగే రబీ 2013-14 సీజన్‌కు గాను రూ.200 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 14,548 మందికి రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. జిల్లాలో గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలను మాత్రమే పంట రుణాల కింద ఇచ్చారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు రూ.11.73 కోట్లను వడ్డీ లేని రుణాలుగా బ్యాంకుల ద్వారా అందించారు. వీటితో రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందజేశారు. గత ఏడాది వరుసగా తుపాన్లు, అల్పపీడనం రావడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేకపోయారు. కొత్త రుణాల కోసం ఆందోళన ఖరీఫ్ ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు. ఈ సీజన్లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే రుణాలను అందించనున్నారు. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నష్టాల్లో ఉన్న రైతులు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో వారికి రుణాలు రెన్యువల్స్ చేసే అవకాశం లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. కొత్తగా కొలువు తీరిన తెలుగుదేశం ప్రభుత్వం కమిటీ వేసి రుణాల రద్దుకు సాధ్యాసాధ్యాలపై 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే అప్పట్లోగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైపోతుంది. దీంతో కర్షకుల్లో ఆందోళన మొదలైంది. కాలయాపనకే కమిటీ ఎన్నికల మ్యానిపేస్టోలో వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని చెప్పినచంద్రబాబు కాలయాపన చేసేం దు కు కమిటీ వేశారు. ఎటువంటి కాలపరిమితులు లేకుం డా రుణాలు రద్దు నెరవేర్చాలి. -చిక్కాల రామారావు, పాయకరావుపేట జెడ్పీటీసీ తాకట్టులో బంగారం నాకు ఎకరా పొలం ఉంది. చెరకు, వరి సాగుచేస్తున్నాను. గత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20వేలు రుణం తీసుకున్నాను. పెట్టిన పెట్టుబడి రాలేదు. రబీలో కూడా కలిసిరాలేదు. దీంతో అప్పులపాలయ్యాం. బ్యాంకు రుణం తీర్చలేకపోయాను. - బి.వెంకటఅప్పారావు, రైతు, వడ్డాది. ప్రైవేటు అప్పులే దిక్కు....! మాకవరపాలెం : జి.కోడూరుకు చెందిన రమణకు మూడెకరాల భూమి ఉంది. గత ఏడాది సాగుచేసేందుకు కొండలఅగ్రహారం, గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ. 50 వేలు రుణంగా తీసుకున్నాడు. కాలం కలిసి రాకపోవడంతో రుణం తీర్చలేకపోయాడు. దీంతో కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక ఆవేదన చెందుతున్నాడు. రుణ మాఫీ అమలు కాకపోతే ప్రైవేటు అప్పే దిక్కని వాపోతున్నాడు. మాఫీపై ఆశతో ఉన్నాం నాకున్న రెండెకరాల పొలంలో వరి, చెరకు పంటలు సాగు చేస్తుంటాను. గత ఏడాది వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం బ్యాంక్‌లో గోల్డు లోన్‌పై 3 లక్షల రూపాయలు అప్పుతీసుకున్నాను. ఆ తరువాత పంటల దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయాను. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ పై స్పష్టత ఇవ్వాలి. - సూరిశెట్టి చిన మోదినాయుడు, తుమ్మపాల కొత్త రుణాలు ఎలా..? అచ్యుతాపురం : పెదపాడుకి చెందిన అప్పారావు అనే రైతు ఎకరం స్వంతభూమి, ఎకరం కౌలుకి చేస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాకపోవడంతో అప్పలపాలైపోయారు. కోఆపరేటివ్ బ్యాంకులో 5వేల రూపాయలు, ఇతర బ్యాంకుల్లో 25వేల రూపాయలు అప్పు చేశాడు. వడ్డీతో రూ.70వేలు చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్‌కి మరలా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. పెట్టుబడి పెట్టడానికి అప్పుచేయాల్సిందే. బ్యాంకువారు అప్పు ఉండగా రుణం ఇవ్వడంలేదు. రుణమాఫీ చేసి కొత్తరుణాలు ఇస్తేనే తిరిగి పంట వేయగలనని అప్పారావు చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీని మూడునెలలు వాయదా వేయడం అప్పారావుకి మనస్తాపం కలిగిస్తోంది. అంతవరకూ కొత్తరుణం ఇవ్వకపోతే ఖరీఫ్ ఎలా సాగు చేయగలనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచడం లేదు నాకు ఎకరం 70 సెంట్ల పొలం ఉంది. ఈ పొలంలో ఏటా వరి, చెరకు, అరటి, నువ్వులు తదితర పంటలు సాగు చేస్తాం. నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబ పోషణ వెళ్లదీస్తున్నాను. గత ఏడాది వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం తుమ్మపాల యూనియన్ బ్యాంక్‌లో 10 వేల రూపాయలు లోన్ తీసుకున్నాను. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ రుణాల కోసం బ్యాంకులకు వెళితే పాత రుణాలు చెల్లిస్తే తప్ప ఇవ్వమంటున్నారు. చంద్రబాబు 45 రోజుల తరువాత రుణామాఫీ ప్రకటిస్తే అప్పటికి ఖరీఫ్ సీజన్ మొత్తం దాటి పోతుందన్నారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. - పీలా బుజ్జి, రైతు, వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు, తుమ్మపాల -
రుణమాఫీ రూ.1,226 కోట్లు?
2013-14 పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 3,51,516 మందికి మేలు వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో రైతులకు ప్రధానంగా ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టిసారించింది.ఈ అంశంపైనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బ్యాంకర్లతో సమావేశమయ్యూరు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఈటెల రాజేందర్ సైతం రుణమాఫీపైనే మాట్లాడారు. 2013 జూన్ ఒకటో తేదీ నుంచి రూ. లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే మాఫీ అమలు చేస్తామని కుండబద్ధలు కొట్టారు. బంగారంపై తీసుకున్న పంట రుణాలు, రుణ పాత బకాయిలకు ఈ మాఫీ వర్తించదని తేల్చిచెప్పారు. ఈ లెక్కన జిల్లాలో రూ.1226 కోట్ల పంట రుణాలు మాఫీ కానుండగా... 3,51,516 మంది రైతులకు మేలు జరగనుంది. 2013 జూన్ నుంచి రూ. 1,495 కోట్లు జిల్లాలో జూన్ 2013 నుంచి 4,27,570 మంది రైతులు రూ.1,495.61 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు అధికారుల అంచనా. ఇందులో 76,054 మంది రైతులు పంట రుణాల కోసం బంగారం తాటు ్టపెట్టి రూ.269.42 కోట్లు తీసుకున్నారు. టీఆర్ఎస్ సర్కారు నిర్ణయం ప్రకారం బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తించదు. ఈ లెక్కన జిల్లాలో 3,51,516 మంది రైతులకు సంబంధించి రూ.1226.19 కోట్ల పంట రుణాలు మాత్రమే మాఫీ అయ్యే అవకాశముంది. రైతు రుణాలు రూ.3,970 కోట్లు జిల్లాలో ఇప్పటివరకు రైతులకు సంబంధించి రుణ బకారుులు మొత్తం రూ.3,970 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం సుమారు 4,50,000 మంది రైతులు వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. పంట రుణాల కింద 3,50,000 మంది రైతులు వివిధ బ్యాంకుల వద్ద రూ.1835 కోట్లు, వ్యవసాయ అవసరాలకు పాస్‌బుక్ ఆధారంగా బంగారాన్ని తాకట్టు పెట్టి 40వేల మంది రైతులు రూ.550 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. సాగు అవసరాల నిమిత్తం దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ అనుబంధ బర్రెలు, గొర్రెల పెంపకాని, బోర్లు వేసేందుకు నూతన యంత్రాల కొనుగోలుకు 60వేల మంది రైతులు రూ.1586 కోట్ల మేరకు అప్పుగా పొందారు. 9న తేలే అవకాశం ఈనెల 9తేదీ నాటికి జిల్లాకు సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సర్కా రు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకర్లు పూర్తి స్థాయి కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే జిల్లా లో రుణమాఫీ వర్తించే లబ్ధిదారుల లెక్క తేలనుంది. అందరికీ అవకాశం కల్పించాలి.. పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణ మాఫీ వర్తింపజేయాలి. 2013- 2014ను పరిగణనలోకి తీసుకోకుండా... రూ.లక్ష అప్పు ఉన్న ప్రతి ఒక్క రైతుకూ కొత్త సర్కారు రుణ మాఫీ అవకాశం కల్పించాలి. రైతులకిస్తే సర్కార్ ఏం చెడిపోదు. - కమలాకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పెగడపల్లి రైతులు నిరాశ చెందుతున్నరు రైతులకు సర్కారు రుణ మాఫీ చేస్తుందని ఎంతో అశతో ఉన్నం. గత ఏడాది తీసుకున్న వాటికి మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందుతున్నరు. రూ.లక్ష తీసుకున్న వారందరి అప్పులనూ ప్రభుత్వమే కట్టాలి. - ఆకుతోట సాంబయ్య, రైతు, హసన్‌పర్తి ఏడాదికి పరిమితం చేయొద్దు హన్మకొండ చౌరస్తా : రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలకు సంబంధించి కొన్ని మినహాయింపులతో మాఫీ వర్తిస్తుందని, రూ.లక్ష తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదు. రైతులకు రుణ మాఫీని గత ఆర్థిక సంవత్సరానికే పరిమితం చేయకుండా... ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ అవకాశం కల్పించాలి. - టి.శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి -
పంట రుణంపైనే మాఫీ
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : రైతులకు రుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ సర్కారు స్పష్టమైన విధివిధానాలు జారీ చేయడంతో బ్యాంకర్లలో గందరగోళానికి తెరపడినట్లయింది. పంట రుణాలపైనే మాఫీ ఉంటుందని బుధవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి ఈటేల రాజేందర్ స్పష్టం చేశారు. వ్యవసాయం కో సం బంగారం తాకట్టు రుణాలపై రుణమాఫీ ఉండద ని తెలిపారు. 2013 జూన్ నుంచి ఇచ్చిన పంట రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో రు ణాలు తీసుకున్న కొంతమంది రైతులకు ఈ నిర్ణయం నష్టం చేకూర్చుతుంది. బకాయిలతో సంబంధం లేకుండా ఈ ఖరీఫ్‌కు కొత్త రుణాలు అందజేయాలని సర్కారు ఆదేశించడం రైతులకు సంతోషానిస్తోంది. రూ.లక్షలోపు.. జిల్లాలో గత ఖరీఫ్, రబీలకు కలిపి పంట రుణలక్ష్యం రూ.1,656 కోట్లు నిర్ధేశించగా, రూ. 1,421 కోట్లు మా త్రమే రైతులకు పంపిణీ చేశారు. 3,16,542 మంది రైతులు ఇందులో ఉన్నారు. దీర్ఘకాలిక రుణాల కింద లక్ష్యం రూ.135 కోట్లు ఉండగా, రూ.114 కోట్లు అందజేశారు. వ్యవసాయం కోసం 10వేల మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ.125 కోట్లు రుణాలు పొం దారు. కాగా, రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే ఈ రుణమాఫీ దేనికి వర్తిస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లలో గందరగోళం నెలకొంది. బంగారం తాకట్టు రుణాలకు కూడా ఇది వరిస్తుందా అనే దానిపై సందేహం నెల కొంది. అయితే బ్యాంకర్ల సమావేశంలో రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న వాటికే రుణమాఫీ వర్తిస్తుంద ని స్పష్టం చేశారు. జిల్లాలో 3,16,542 మంది రైతులు రూ.1421 కోట్లు పంట రుణాలు తీసుకోగా, అందులో 2/3 వంతు మంది రూ.లక్షలోపు రుణం తీసుకున్న వారిలో ఉంటారని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 2లక్షలకుపైగా రైతులు రూ.లక్షలోపు రుణం సుమారు రూ.950కోట్లుగా పొందినట్లు అంచనా వేస్తు న్నారు. ఈ వివరాలను వచ్చే సోమవారంలోగా అందజేయాలని ఆదేశాలుండడంతో బ్యాంకర్లు ప్రస్తుతం వీ టిపై దృష్టి సారించారు. రూ.లక్షలోపు రుణం తీసుకు న్న వారి లెక్కలు సేకరిస్తున్నారు. 2013 జూన్ నుంచి రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న రైతులకు ఇదీ వర్తిస్తుందని చెప్పడంతో అంతకు ముందు అంటే ఏప్రి ల్ నుంచి జూన్ వరకు పంట రుణం పొందిన రైతుల కు ఈ నిర్ణయం అశనిపాతమైంది. అప్పటికే రూ.100 కోట్లకుపైగా పంట రుణాలను వేలాది మంది రైతులు తీసుకోవడం జరిగింది. రుణమాఫీ వీరికి వర్తించదు. ఊరట పంట రుణాలకు సంబంధించి గతేడాది మార్చిలో తీ సుకున్న రుణాలకు ఈ యేడాది మార్చి 31, గతేడాది జూన్‌లో తీసుకున్న వారికి ఈ యేడాది జూన్ 30 వర కు రుణం చెల్లించేందుకు గడువు విధించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలు రుణ మాఫీని ప్ర కటించడంతో ఈ ఏడాది రైతులు తీసుకున్న రుణం గ డువులోగా చెల్లించలేదు. ఎన్నికల్లో రుణమాఫీ హామీ ని కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడంతో రైతుల్లో దీనిపై హర్షం వ్యక్తమైంది. సహాజంగా కొంత మంది రైతులు తాము తీసుకున్న రుణం గడువులోగా చెల్లించ డం, ఆ తరువాత కొత్త రుణం పొందడం జరుగుతుం ది. అలాంటి వారే పదిశాతంలోపే రుణాలు చెల్లించిన ట్లు తెలుస్తోంది. మిగతా రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా 2013 ఖరీఫ్ సీజన్లో జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 67,490 హెక్టార్లలో 1,18,621 మంది రైతులు రూ. 61.25 కోట్లు పంట నష్టం చవిచూశారు. ఆ తరువాత 2014 ఫిబ్రవరి, మార్చిలో ఆకాల వర్షాలు దీనికి తోడు వడగండ్లు కురవడంతో 4,107 హెక్టార్లలో 9,091 మంది రైతులు రూ. 2.63 కోట్లు నష్టం జరిగింది. 2014 మేలో ఆకాల వర్షం, వడగండ్ల కారణంగా 144 హెక్టార్లలో 317 మంది రైతులు రూ.13 లక్షల పంట నష్టం కలిగింది. ఇందులో ఫిబ్రవరి, మార్చికి సంబంధించి రూ. 2.63 కోట్లు పంట నష్టాన్ని సర్కారు రైతులకు మంజూరు చేసింది. అయితే జూలై, ఆగస్టుకు సంబంధించి పంట నష్టం ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. -
మన్యంలో ఫ్యాన్ గాలి
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు వైఎస్సార్సీపీ పరం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ పట్నం జిల్లాలో మన్యం వాసులు వైఎస్సార్సీపీ పక్షాన నిలిచారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పవనాలు వీ చినా మన్యంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగిందిు. దివంగత మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలతో లబ్ధిపొందిన గిరిజనులు ఈ ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి బలపర్చిన అభ్యర్థులగు గెలిపించడం ద్వారా తమ రుణం తీర్చుకున్నా రు. ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు మన్యం వాసుల గుండెల్లో రాజన్నను కొలువుంచాయి. అందుకే వారంతా మూకుమ్మడిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రెండు అసెంబ్లీ సీట్లను, ఒక లోక్‌సభ స్థానాన్ని గెలిపించి రాజన్నకు కానుకగా ఇచ్చారు. అరకు నుంచి ఎమ్మెల్యేగా కిడారి సర్వేశ్వరరావును మంచి మెజార్టీతో గెలిపించి గిరిజనులు తమ కలల సారథిగా అసెంబ్లీకి పంపారు. గతంలో శాసన మండలి సభ్యునిగా ఉన్న సర్వేశ్వరరావును ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిపించి తమ సమస్యలు పరిష్కరించే బాధ్యత అప్పగించారు. దీంతోబాటు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీచర్ ఈశ్వరిని సైతం గిరిజనులు నిరాశపర్చకుండా ఓట్లతో ఆశీర్వదించారు. దీంతో ఆమె మొదటి ప్రయత్నంలోనే సునాయాసంగా చట్టసభకు ఎన్నికయ్యారు. అరకు లోక్‌సభ సైతం రెండు అసెంబ్లీ స్థానాలతోబాటు అరకు లోక్‌సభ స్థానంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు విజయాన్ని అందించారు. గతంలో సబ్‌కలెక్టర్‌గా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా ప్రజల సమస్యలను దగ్గర్నుంచి చూసిన గీత అయితే తమ సమస్యలను సమర్థంగా పరిష్కరించగలరన్న నమ్మకంతో ఆమెను తమ ప్రతినిధిగా ఏకంగా పార్లమెంట్‌కు పంపారు. ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉండడంతో ఆమె ఏకంగా రాజకీయ దిగ్గజమైన కిశోర్ చంద్రదేవ్‌ను సునాయాసంగా ఓడించారు. అంతేకాకుండా అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలు సైతం వైఎస్సార్సీపీ గెలుచుకోవడం గిరిజనుల్లో వైఎస్ఆర్ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని చెప్పవచ్చు.