Telangana Cabinet Extends Crop Loan Waiver For Farmers: Check Details - Sakshi
Sakshi News home page

Telangana: రూ.50 వేల వరకు రుణమాఫీ

Published Mon, Aug 2 2021 2:13 AM | Last Updated on Mon, Aug 2 2021 1:15 PM

Telangana Cabinet Nod To Extend Crop loans Waiver Up To Rs 50, 000 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఎన్నికల హామీ మేరకు ఇప్పటివరకు రూ.25 వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా రూ.50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రూ.25 వేల వరకున్న రుణాల మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అలాగే రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం గల అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాను వర్తింప జేయాలని నిర్ణయించింది. ఈ కోటాలో భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 5 ఏళ్లు పెంచాలని కూడా నిర్ణయించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో ఆరున్నర గంటలకు పైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించింది. పైలట్‌ ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దళిత బంధుకు చట్టబద్ధత
దళిత బంధు పథకం అమలు విషయంలో మంత్రివర్గ సహచరుల నుంచి సీఎం సూచనలు స్వీకరించారు. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో 20 శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి  కేవలం 13 లక్షల ఎకరాలేనని, వారి పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని తెలిపారు. అరకొర సహాయాలతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్‌ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్యాంకు రుణాలతో ముడి పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. దళిత బంధు దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్‌ అభిప్రాయ పడింది.

ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రైజ్‌’
దళిత బంధు లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ కల్పించాలని మంత్రివర్గం కోరింది. శిక్షణ, పర్యవేక్షణకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో ‘సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రైజ్‌’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని, వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును మంత్రివర్గం ఆదేశించింది. లబ్ధిదారులకు అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్‌ పరిశీలించింది. దళిత వాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, మిగతా గ్రామంతో సమానంగా దళిత వాడలకు అన్ని హంగులూ ఏర్పడాలని, ఇందుకు నిధుల కొరత లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అనాథ పిల్లలకు అండగా నిలవాలి
‘కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఒంటరిగా మారి మానసిక వేదన, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదముంది. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇప్పుడు కూడా అనాథ పిల్లల సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన మంత్రులు, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కేటీఆర్‌తో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల స్థితిగతుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలి
అన్ని జిల్లాల్లో కరోనా నిర్థారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్య శాఖను కేబినెట్‌ ఆదేశించింది. అన్ని రకాల మందులు, ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని సూచించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఈ సందర్భంగా వైద్యశాఖ నివేదించింది. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో మరోసారి వైద్య బృందాలు పర్యటించి రావాలని మంత్రివర్గం ఆదేశించింది. 

నిమ్స్‌ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
కొత్తగా మంజూరు చేసిన ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అవసరమైన పడకలు, ఇతర మౌలిక వసతులు, కళాశాలలు, హాస్టళ్ల భవనాల నిర్మాణాలకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. వైద్య కళాశాలల భవన నిర్మాణాలను చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను మంత్రివర్గం ఆదేశించింది. నిమ్స్‌ ఆస్పత్రిని మరింతగా అభివృద్ధి పరిచి వైద్య సేవలను విసృత పరిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసి తదుపరి మంత్రివర్గ సమావేశం ముందు ఉంచాలని వైద్య శాఖను మంత్రివర్గం ఆదేశించింది. భవిష్యత్తులో అనుమతించనున్న వైద్య కళాశాలల కోసం స్థలానేష్వషణ, ఇతర సౌకర్యాల కల్పనకు ముందస్తుగా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని సూచించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాది నాటికి వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరింది. 

త్వరలో సూపర్‌ స్పెషాలిటీలకు శంకుస్థాపన
కొత్తగా ఏర్పాటు చేయనున్న 5 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రితో పాటు హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌)’గా నామకరణం చేయాలని తీర్మానించింది. టిమ్స్‌ గచ్చిబౌలి, టిమ్స్‌ సనత్‌నగర్, టిమ్స్‌ ఎల్బీ నగర్, టిమ్స్‌ అల్వాల్‌ ఆస్పత్రులుగా అభివృద్ధి చేసి, అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను ఒక్కచోటే అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించింది. వరంగల్‌లో నిర్మించనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలో చేపట్టాలని ఆదేశించింది.

పటాన్‌చెరులో మల్టీస్పెషాలటీ ఆస్పత్రి
పటాన్‌చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాలకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రివర్గం మంజూరు చేసింది. రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల స్థాపన లక్ష్యంగా, వైద్య కళాశాలలు లేని జిల్లాలను గుర్తించి రెండు మూడేళ్లల్లో దశల వారీగా వాటిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. 

ధోభీ ఘాట్లు, సెల్లూనకు ఉచిత విద్యుత్‌
ధోభీ ఘాట్లు, సెల్లూనకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఎల్బీసీ పనులను ప్రారంభించండి 
నల్లగొండ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు నుండి ప్రారంభించిన ఎస్సెల్బీసీ సొరంగమార్గం పనులను పున:ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దాంతోపాటు ఉదయ సముద్రం లిఫ్టు ఇరిగేషన్‌ స్కీం (బ్రాహ్మణ వెల్లెంల)ను కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కేబినెట్‌ ఆదేశాలు జారీచేసింది. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  

16 నుంచి దళిత బంధు
తెలంగాణ దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయం. దళిత జాతి పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రవేశపెడుతున్న ఈ ప్రతిష్టాత్మక పథకానికి కేబినెట్‌ ఏకగ్రీవ ఆమోదం.

57 ఏళ్లకు పింఛన్లు
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయం అమలు ప్రక్రియ తక్షణమే ప్రారంభం. కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్ధతి కొనసాగింపు. భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు పెన్షన్‌ బదిలీ

అనాథ పిల్లల బాధ్యత సర్కారుదే
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు పెద్దవారై ప్రయోజ కులయ్యే వరకు ఆశ్రయం కల్పించి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి పిల్లల వివరాలు తెప్పించాలని ఆదేశం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement