రైతులూ చట్టసభల్లోకి.. సీఎం కేసీఆర్‌ పిలుపు | Ex Odisha CM Giridhar Gamang joins in KCR BRS Party | Sakshi
Sakshi News home page

రైతులూ చట్టసభల్లోకి.. సీఎం కేసీఆర్‌ పిలుపు

Published Sat, Jan 28 2023 4:26 AM | Last Updated on Sat, Jan 28 2023 4:26 AM

Ex Odisha CM Giridhar Gamang joins in KCR BRS Party - Sakshi

గిరిధర్‌ గమాంగ్‌కు పార్టీ కండువా కప్పుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘రైతులు తమ హక్కుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో 13 నెలల పాటు ఆందోళన చేయాల్సిన దుస్థితి భారతదేశంలో తప్ప మరే దేశంలోనైనా ఉంటుందా? ఇంత సుదీర్ఘకాలం ఆందోళన చేసినా ఫలితం శూన్యం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పరిష్కారం కానీ, భరోసా కానీ లభించలేదు. దేశ ప్రజలు, రైతులు, పేదలను కేంద్రం ఇలా హేళన చేయడం భావ్యమేనా? అందుకే భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదాన్ని ఎత్తుకుంది. ఈ దేశ రైతులు నాగలితో పాటు పెన్ను పట్టడం కూడా నేర్చుకుని ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చట్టసభల్లోకి వెళ్లాలి..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్, ఆయన భార్య, మాజీ ఎంపీ హేమ గమాంగ్‌తో పాటు ఆ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. గిరిధర్‌ గమాంగ్‌తో పాటు ఒడిశా నుంచి వచ్చిన నేతలకు కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. 

గెలిచిన తర్వాత లక్ష్యాన్ని మర్చిపోతున్నాయి.. 
‘నేడు భారత్‌ తన లక్ష్యాన్ని కోల్పోయింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా రాజకీయాలు మారాయి. జాతి, మతం పేరిట ప్రజల నడుమ చిచ్చు పెడుతూ విభజిస్తున్నారు. ప్రజాసేవ, దేశాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సిన పార్టీలు గెలుపు అందుకున్న తర్వాత లక్ష్యాన్ని మరిచిపోతున్నాయి. ఒడిశాలోని మహానదిలో అవసరాలకు మించి నీటి లభ్యత ఉన్నా 25 నుంచి 30 శాతమే వాడుకుంటున్నాం. బ్రాహ్మణి, వైతరిణి వంటి నదులు కూడా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం లేదు. జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లుగా భారీ ప్రసంగాలు మినహా తాగునీరు, కరెంటు, యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో భారతదేశ భవిష్యత్తును, ఆలోచనను, భావజాలాన్ని మార్చే సంకల్పంతోనే భారత్‌ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది..’ అని కేసీఆర్‌ తెలిపారు. 

నష్టాలు ప్రజలకు.. లాభాలు ప్రైవేటుకు 
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రస్తుతం మూడో తరం జీవితాలు సాగుతున్నాయి. భారత్‌ కంటే ముందు ఆ తర్వాత స్వాతంత్య్రం పొందిన దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ భిన్న పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ‘సోషలైజేషన్‌ ఆఫ్‌ ది లాసెస్‌ .. ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ ది ప్రాఫిట్‌’ (నష్టాలు ప్రజలందరికీ.. లాభాలు ప్రైవేటు సంస్థలకు) అనే విధానాన్ని అనుసరిస్తోంది. అమెరికా, చైనా తదితర దేశాలకంటే భారత్‌లోనే ఎక్కువ సంపద కేంద్రీకృతమై ఉంది. కానీ నేడు భారత యువత అమెరికాకు వెళ్లేందుకు తాపత్రయ పడుతుండగా, వారికి గ్రీన్‌ కార్డు లభిస్తే వారి తల్లిదండ్రులు ఇక్కడ బంధువులకు విందు ఇవ్వడాన్ని బట్టి మనం ఎక్కడున్నామో ఆర్ధం చేసుకోవచ్చు.

ప్రజలు గెలవడమే అసలైన ప్రజాస్వామ్యం.. 
దేశంలో సంపద ఉన్నా సాగునీరు, విద్యుత్‌ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రజలు వంచనకు గురవుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో నాయకులు, ఎన్నో రంగుల జెండాలను మోస్తున్నా పేదలు, రైతుల పరిస్థితి మారడం లేదు. ఎన్నికల్లో పార్టీలు, నాయకులు గెలుస్తున్నా ఎన్నికల తర్వాత ప్రజలు ఓడిపోతున్నారు. భారతదేశ రాజకీయాల్లో గంభీరమైన మార్పులు రావాలి.. ఎన్నికల్లో పారీ్టలు, నాయకులు కాకుండా ప్రజలు గెలవడమే అసలైన ప్రజాస్వామ్యం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

తెలంగాణలో వర్ధిల్లుతోన్న రైతు సంక్షేమం  
‘సాగునీరు, విద్యుత్‌ కోసం పరితపించిన తెలంగాణ, స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇంటింటికీ నల్లా,  ప్రతి పంట పొలానికీ సాగునీరు, విద్యుత్‌ను అందిస్తూ ముందుకు సాగుతోంది. బంజారా తండాలో గరీబుకు, బంజారాహిల్స్‌లోని అమీరుకు ఒకే రకమైన శుద్ధి చేసిన నీళ్ళు అందిస్తున్నాం. వ్యవసాయం బాగుపడింది. రైతు ఆత్మహత్యలు లేవు. రైతుల సంక్షేమం వరి్ధల్లుతోంది. తెలంగాణలో సాధ్యమైంది ఒడిశాలో ఎందుకు సాధ్యం కాదు? ఇది ధన్‌కీ బాత్‌ కాదు.. మన్‌ కీ బాత్‌ (ధనం లేకపోవడం సమస్య కాదు... మనస్సు పెట్టకపోవడం వల్ల ఏర్పడే సమస్య). దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం అవసరమైన బలమైన రాజకీయ చిత్తశుద్ధి మా దగ్గర ఉంది.  

అధికారమిస్తే దేశవ్యాప్తంగా చేసి చూపిస్తాం..  
బీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే రెండేళ్లలో దేశమంతటికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్, వ్యవసాయానికి ఉచిత్‌ విద్యుత్, రక్షిత మంచినీరు, రైతులకు కిసాన్‌ బంధు, ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధును అమలు చేస్తాం. దేశంలోని 83 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమిని సాధ్యమైనంత ఎక్కువగా సాగులోకి తెస్తాం..’ అని      కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

నాకు వేయి ఏనుగుల బలం 
గిరిధర్‌ గమాంగ్‌ లాంటి మచ్చలేని సీనియర్‌ రాజకీయ నాయకుడు బీఆర్‌ఎస్‌లో చేరడం తనకు వేయి ఏనుగుల బలాన్ని ఇచి్చందని ముఖ్యమంత్రి అన్నారు. పారీ్టలో చేరిన నేతలకు పేరు పేరునా స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిశా నాయకుల్లో గిరిధర్‌ గమాంగ్‌ కుమారుడు శిశిర్‌ గమాంగ్, శౌర్య గమాంగ్, ఒడిశా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి స్నేహరంజన్‌ దాస్, కొరాపుట్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యులు రబీంద్ర మొహపాత్రా, ఫల్గుణి సబర్, పి.గోపాల్‌రావు, మల్యా రంజన్‌ స్వెయిన్, నవనిర్మాణ్‌ కిసాన్‌ సంఘటన్‌ కన్వినర్‌ అక్షయ్‌ కుమార్, మయూర్‌ భంజ్‌ మాజీ ఎంపీ రాంచంద్ర హన్సడా, ఎమ్మెల్యేలు రాఘవ్‌ శెట్టి, దేవ్‌ రాజ్‌ శెట్టి, మాజీ ఎమ్మెల్యేలు నబిన్‌ నందా, బండారి పొఖ్రి, రతాదాస్, అర్జున్‌ దాస్, బృందావన్‌ మాఝీ, దేవాశిష్‌ నాయక్, ప్రశన్న్‌ పడితో పాటు పలువురు నేతలు ఉన్నారు. సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలచారి, ఆంజనేయ గౌడ్, గజ్జెల నాగేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

బస్సుల్లో హైదరాబాద్‌కు రాక 
గిరిధర్‌ గమాంగ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ప్రత్యేక విమానంలో శుక్రవారం భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సుమారు 300కు పైగా వివిధ సంఘాల నేతలు, వివిధ పార్టీల కార్యకర్తలు ప్రత్యేక బస్సుల్లో గురువారం ఒడిశా నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. కాగా ఒడిశా నేతలతో శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ మరోమారు సమావేశమై బీఆర్‌ఎస్‌ విస్తరణ, వచ్చే నెలలో భువనేశ్వర్‌లో బహిరంగ సభ నిర్వహణపై దిశా నిర్దేశం చేస్తారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement