
సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశానని సీఎం కేసీఆర్ అన్నారు. రైతుల పోరాటం న్యాయబద్దమైనదని అన్నారు. గెలవాలంటే చిత్తశుద్ది ఉండాలని, తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. పరిష్కారం లేని సమస్యలు ఉండని చెప్పారు. శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర రైతు నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్‌తో సహా పలువురు రాష్ట్ర నేతలకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ది ఉండాలన్నారు. ‘తెలంగాణలో ఏం చేశామో మీరంతా ఒకసారి చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని మిమ్మల్ని కోరుతున్నా. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు ఉండకపోతే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వాళ్లు కాదు. రైతుల పోరాటంపై మోదీ సానుభూతి చూపలేదు. 750 రైతులు చనిపోతే కనీసం మోదీ స్పందించలేదు. రైతులను ఖలీస్థానీలన్నారు, ఉగ్రవాదులని అన్నారు. రైతుల గోస చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించుకున్నాం.’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడునీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్‌రావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
చదవండి: Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాక్..
Comments
Please login to add a commentAdd a comment