కట్టకుంటే ఖబడ్దార్
- అప్పులు చెల్లించాలంటూ బ్యాంక్‌లు నోటీసులు
- డ్వాక్రా మహిళల నుంచి రికవరీకి రంగం సిద్ధం
- రుణమాఫీ ప్రకటనలో ప్రభుత్వ తాత్సారం
- ఆందోళన చెందుతున్న రైతులు
రుణాల ఉచ్చులో రైతులు, డ్వాక్రా మహిళలు గిలగిల కొట్టుకుంటున్నారు. రుణమాఫీ ఆశతో వారంతా ఆరు నెలల నుంచి చెల్లింపులు ఆపేశారు. రూ. వందల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కుదేలయ్యే ప్రమాదం ముంచుకురావడంతో దానిని అధిగమించేందుకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. రైతులకు నోటీసులు పంపడంతోపాటు అప్పు తీర్చాలంటూ ఫోన్లు చేస్తున్నారు.
నర్సీపట్నం/చోడవరం : రుణమాఫీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం తో బ్యాంకులు రైతులపై ఒత్తిడి పెంచుతున్నా యి. తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలం టూ నోటీసులు జారీ చేస్తున్నాయి. ఈ పరిస్థితితో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. చం ద్రబాబు ప్రకటనతో పాటు కాలం కలిసిరాక ఆరు నెలలుగా రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించలేదు.
జిల్లాలో సుమారు రెండు లక్షల మందికి సంబంధించి రూ.1700 కోట్లు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వీలైనంతమేరకు వసూళ్లకు బ్యాంకర్లు చర్యలు చేపట్టారు. అప్పు తీర్చాలంటూ నేరుగా రైతులకు ఫోన్లు చేయడంతో పాటు నోటీసులు జారీచేస్తున్నారు. ఉదాహరణకు మాకవరపాలేనికి చెందిన రైతు కోలా బాబూరావు గత ఖరీఫ్‌లో నర్సీపట్నం జాతీయ బ్యాంకు లో రూ. 80వేలు అప్పు తీసుకున్నాడు. ప్రస్తుతం అసలుతో పాటు వడ్డీతో చెల్లించాల్సి ఉంది. గతేడాది కాలం కలిసి రాకపోవడంతో బకాయి చెల్లించలేదు.
రుణం తీసుకుని ఏడాది పూర్తికావడంతో అధికారులు నోటీసులు జారీచేశారు. అలాగే రోలుగుంట మండలం జానకిరాంపురానికి చెందిన రైతు దేవాడ సత్తిబాబు జాతీయ బ్యాంకులో రూ. 90వేల రుణం తీసుకున్నాడు. రుణమాఫీ అమలు చేస్తారని అప్పు విషయంలో నిర్లక్ష్యం చేశాడు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేశారు.
జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో రూ.300కోట్లకు పైబడే బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చాయి. మూడు రోజులుగా చోడవరం ఆంధ్రాబ్యాంక్ రైతులకు అప్పు తీర్చాలంటూ నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. బంగారు వస్తువులపై తీసుకున్న పంట రుణాలు నెలాఖరులోగా చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ బ్యాంక్ 200 మందికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
ఇదే తరహాలో మిగతా కమర్షియల్ బ్యాంక్‌లు కూడా బకాయి ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాయి. మరో పక్క వెంటనే పంట రుణాన్ని చెల్లించాలంటూ యూనియన్‌బ్యాంక్ రైతులకు సెల్ ఫోన్లలో మెసేజ్‌లతో ఒత్తిడి తెస్తోంది. ఇక నిత్యం రైతులతో మమేకమయ్యే డీసీసీబీ బ్యాంక్‌లు కూడా పరోక్షంగా తమ సిబ్బందితో రైతులకు సమాచారం ఇస్తున్నారు.
దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం రుమాఫీ చేయకపోతే పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. ఇక డ్వాక్రా సంఘాల విషయానికొస్తే జిల్లా వ్యాప్తంగా రూ. 521 కోట్ల రుణాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకు లు సన్నద్ధమయ్యాయి. ఒక్కో డ్వాక్రా సంఘానికి కనీసం రూ. లక్ష వరకు అప్పు ఉంటుందని బ్యాంకర్ల అంచనా.