అదును దాటుతోంది బాబూ..!
- మొదలైన ఖరీఫ్ సాగు
- ఇంకా జిల్లాకు చేరని విత్తన కాయలు
- పంట రుణాల కోసంరైతుల ఎదురుచూపు
- రుణమాఫీ ప్రకటన వచ్చే వరకు తప్పని తిప్పలు
- ప్రభుత్వం పట్టించుకోకుంటే అదును దాటిపోయే ప్రమాదం
- అదే జరిగితే తీవ్రంగా నష్టపోనున్న రైతులు
సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది తొలకరి ముందస్తుగానే పలకరించింది. దీంతో రైతన్నలు దుక్కిదున్ని విత్తనం వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలను పంపిణీ చేయలేదు. జిల్లాలో 2.2 లక్షల హెక్టార్లు సాగు భూమి ఉంటే అందులో 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. సబ్సిడీపై వేరుశనగ విత్తనకాయలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం మే నెల లోనే ప్రణాళికలు సిద్ధం చేసింది. 1.05 లక్షల క్వింటాళ్లు ఏపీసీడ్స్, ఆయిల్‌ఫెడ్, ఏపీ అయిల్ ఫెడరేషన్ సరఫరా చేయాలి.
అయితే రెండు వే ల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. జిల్లా రైతులు కే-6 రకం కాయలు కావాలని కోరారు. లక్ష క్వింటాళ్లు కే-6 కోసమే అధికారులు ప్రతిపాదనలు పంపారు. అనంతపురం జిల్లా రైతులు కూడా ఈ రకం విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కే-6 విత్తనాలను పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖకు కష్టసాధ్యమైంది. విత్తనకాయలు అందుబాటులో లేకపోవడంతో పంపిణీ ప్రక్రియ మొదలు కాలేదు.
రైతులు మాత్రం పది రోజులుగా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. పశ్చిమ ప్రాంతంలోని మదనపల్లె, పలమనేరు, చిత్తూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా 5 వేల హెక్టార్లలో ఇప్పటికే సాగు చేశారు. వీరంతా అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని రైతుల వద్ద విత్తన కాయలు కొనుగోలు చేశారు.
వీడని పీటముడి
ఖరీప్‌లో పంట సాగుకు సిద్ధమయ్యే రైతన్నలకు పెట్టుబడి కష్టసాధ్యంగా పరిణమించింది. టీడీపీ అధికారంలోకి వస్తే పంట రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో రైతులంతా ఎదురు చూస్తున్నారు. అయితే రుణాల మాఫీపై చంద్రబాబు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. పరిశీలనకు కమిటీ వేశారు. దీనికి 45 రోజులు గడువిచ్చారు. అప్పటి వరకు రైతులు రుణాల కోసం ఎదురుచూడాల్సిందే! లేదంటే పాత బకాయిలు చెల్లించి కొత్త రుణాలు తెచ్చుకోవాలి.
రైతులు, లేదా ప్రభుత్వం పాతబకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే లేదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. 45 రోజుల వరకు ఆగితే సాగుకు అదును దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చాలామంది రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు బంగారు నగలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. పంట రుణాల మాఫీపై ప్రభుత్వం త్వరతిగతిన నిర్ణయం వెలువరించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో రైతులకు సంబంధించి 7693.75 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. రుణాల మాఫీ ప్రకటన కోసం 8.7 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సప్తగిరి గ్రామీణ బ్యాంకు యాజమాన్యం పాతబకాయిలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీ లోపు ప్రభుత్వం నుంచి మాఫీ ప్రకటన వెలువడకపోతే తప్పని సరిగా రీషెడ్యూల్ చేసుకోవాలని తేల్చి చెబుతున్నారు. సప్తగిరి గ్రామీణబ్యాంకు శాఖలు జిల్లాలో 104 ఉన్నాయి. వీటి ద్వారా 7.55 లక్షల మంది రైతులకు 5,810 కోట్ల రూపాయల పంటరుణాలు పంపిణీ చేశారు. బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో రుణాలు తీసుకున్న రైతులంతా ఆందోళన చెందుతున్నారు.
తెగని పంచాయితీ
వేరుశనగ విత్తనకాయల ధరలపై వ్యవసాయశాఖ, నోడల్ ఏజెన్సీల మధ్య పీటముడి వీడలేదు. ప్రభుత్వం పంపిణీ సంస్థల నుంచి బస్తా (30 కిలోలు) కాయలను 1380 రూపాయలకు కొనుగోలు చేసి, రైతులకు 930 రూపాయలకు పంపిణీ చేయాలి. అయితే పంపిణీ సంస్థలు కిలోకు నాలుగు రూపాయల చొప్పున పెంచి బస్తాకు 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు వ్యవసాయశాఖ కమిషనర్ అంగీకరించలేదు. దీంతో విత్తనకాయల సరఫరాకు బ్రేక్ పడింది. ధరల సర్దుబాటు కారణంతోనే ఏజెన్సీల వద్ద కాయలు ఉన్నా సరఫరా చేయలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటే రైతులకు సమయానికి వేరుశెనగ విత్తనకాయలు అందే అవకాశం ఉంది .