అనుకున్నట్టే..! | Employed farmers to expand | Sakshi
Sakshi News home page

అనుకున్నట్టే..!

Published Tue, Jun 10 2014 12:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

అనుకున్నట్టే..! - Sakshi

అనుకున్నట్టే..!

  • రుణమాఫీపై మాటమార్చిన చంద్రబాబు
  •  కమిటీతో జాప్యం
  •  కర్షకుల్లో కలవరం
  • విశాఖ రూరల్ : ఊహించినట్టే జరిగింది... అధికారం చేపట్టిన మరుక్షణమే రైతుల రుణమాఫీపై తెలుగుదేశం ప్రభుత్వం మాట మార్చింది. రుణాల రుద్దు సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు నిర్ణయం కర్షకులను కలవరపెడుతోంది. ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. రుణమాఫీపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో కొత్త రుణాల మంజూరుపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరుసగా మూడేళ్లు ప్రకృతి ప్రకోపాలతో అన్నదాత నష్టాల ఊబిలో కూరుకుపోయాడు.

    కరువు, వరదలు కలిసి రైతు వెన్ను విరిచాయి. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారు.  ఇటువంటి తరుణంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రుణమాఫీ హామీని గుప్పించారు. ఎటువంటి మెలికలు లేకుండా రైతులు తీసుకున్న అన్ని రుణాలను రద్దు చేస్తామని ప్రకటనలు చేశారు.

    దీంతో రైతులు కొండంత ఆశతో టీడీపీకి పట్టం కట్టారు. అయితే అధికారం చేజిక్కాక రుణమాఫీపై మెలికలు పెట్టే యోచన చేస్తున్నారు. వీలైనంత తక్కువ మందిని లబ్ధిదారులుగా చూపించి కేవలం వారి రుణాలను మాత్రమే రద్దు చేసి హామీని నేరవేర్చామని చెప్పకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
     
    రుణమాఫీతో 2,10,881 మంది రైతులకు లబ్ధి

    గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.600 కోట్లు రుణాలు  లక్ష్యంగా నిర్ధేశించారు. అయితే 1,32,375 మందికి లక్ష్యాన్ని మించి రూ.640 కోట్లు అందజేశారు. అలాగే రబీ 2013-14 సీజన్‌కు గాను రూ.200 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 14,548 మందికి రూ.104 కోట్లు రుణాలు మంజూరు చేశారు. జిల్లాలో గతేడాది 3729 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికీ కేవలం 287 మందికి రూ.56.1 లక్షలను మాత్రమే పంట రుణాల కింద ఇచ్చారు.

    గతేడాది నుంచి ఇప్పటి వరకు పావలా వడ్డీ కింద 7505 రైతులకు రూ.2.65 కోట్లు అందజేశారు. దీంతో పాటు లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వారిలో 56,166 మంది రైతులకు రూ.11.73 కోట్లను వడ్డీ లేని రుణాలుగా బ్యాంకుల ద్వారా అందించారు. వీటితో రూ.150 కోట్లు వరకు బంగారంపై రుణాలు అందజేశారు. గత ఏడాది వరుసగా తుపాన్లు, అల్పపీడనం రావడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేకపోయారు.
     
    కొత్త రుణాల కోసం ఆందోళన
     
    ఖరీఫ్ ప్రణాళిక సిద్ధమైంది. జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు. ఈ సీజన్‌లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే రుణాలను అందించనున్నారు.

    రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నష్టాల్లో ఉన్న రైతులు  తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో వారికి రుణాలు రెన్యువల్స్ చేసే అవకాశం లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. కొత్తగా కొలువు తీరిన తెలుగుదేశం ప్రభుత్వం కమిటీ వేసి రుణాల రద్దుకు సాధ్యాసాధ్యాలపై 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే అప్పట్లోగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైపోతుంది. దీంతో కర్షకుల్లో ఆందోళన మొదలైంది.
     
     కాలయాపనకే కమిటీ
     ఎన్నికల మ్యానిపేస్టోలో వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని చెప్పినచంద్రబాబు కాలయాపన చేసేం దు కు కమిటీ వేశారు. ఎటువంటి  కాలపరిమితులు లేకుం డా రుణాలు రద్దు  నెరవేర్చాలి.
     -చిక్కాల రామారావు, పాయకరావుపేట జెడ్పీటీసీ
     
     తాకట్టులో బంగారం
     నాకు ఎకరా పొలం ఉంది. చెరకు, వరి సాగుచేస్తున్నాను. గత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.20వేలు రుణం తీసుకున్నాను. పెట్టిన పెట్టుబడి రాలేదు. రబీలో కూడా కలిసిరాలేదు. దీంతో అప్పులపాలయ్యాం. బ్యాంకు రుణం తీర్చలేకపోయాను.
      - బి.వెంకటఅప్పారావు, రైతు, వడ్డాది.
     
     ప్రైవేటు అప్పులే దిక్కు....!
     మాకవరపాలెం :  జి.కోడూరుకు చెందిన  రమణకు మూడెకరాల భూమి ఉంది. గత ఏడాది సాగుచేసేందుకు కొండలఅగ్రహారం, గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ. 50 వేలు రుణంగా తీసుకున్నాడు. కాలం కలిసి రాకపోవడంతో రుణం తీర్చలేకపోయాడు. దీంతో కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక ఆవేదన చెందుతున్నాడు. రుణ మాఫీ అమలు కాకపోతే ప్రైవేటు అప్పే దిక్కని వాపోతున్నాడు.
     
     మాఫీపై ఆశతో ఉన్నాం
     నాకున్న రెండెకరాల పొలంలో వరి, చెరకు పంటలు సాగు చేస్తుంటాను.   గత ఏడాది వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం  బ్యాంక్‌లో గోల్డు లోన్‌పై 3 లక్షల రూపాయలు అప్పుతీసుకున్నాను. ఆ తరువాత పంటల దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో  రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయాను. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ పై స్పష్టత ఇవ్వాలి.     
    - సూరిశెట్టి చిన మోదినాయుడు, తుమ్మపాల
     
     కొత్త రుణాలు ఎలా..?
    అచ్యుతాపురం : పెదపాడుకి చెందిన అప్పారావు అనే రైతు ఎకరం స్వంతభూమి, ఎకరం కౌలుకి చేస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాకపోవడంతో అప్పలపాలైపోయారు. కోఆపరేటివ్ బ్యాంకులో 5వేల రూపాయలు, ఇతర బ్యాంకుల్లో 25వేల రూపాయలు అప్పు చేశాడు. వడ్డీతో రూ.70వేలు చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్‌కి మరలా పెట్టుబడి పెట్టాల్సి ఉంది.  పెట్టుబడి పెట్టడానికి అప్పుచేయాల్సిందే. బ్యాంకువారు అప్పు ఉండగా రుణం ఇవ్వడంలేదు. రుణమాఫీ చేసి కొత్తరుణాలు ఇస్తేనే తిరిగి పంట వేయగలనని అప్పారావు చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు రుణమాఫీని మూడునెలలు వాయదా వేయడం అప్పారావుకి మనస్తాపం కలిగిస్తోంది. అంతవరకూ కొత్తరుణం ఇవ్వకపోతే ఖరీఫ్ ఎలా సాగు చేయగలనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
     దిక్కుతోచడం లేదు
     నాకు ఎకరం 70 సెంట్ల పొలం ఉంది. ఈ పొలంలో ఏటా వరి, చెరకు, అరటి, నువ్వులు తదితర పంటలు సాగు చేస్తాం. నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబ పోషణ వెళ్లదీస్తున్నాను. గత ఏడాది వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం తుమ్మపాల యూనియన్ బ్యాంక్‌లో 10 వేల రూపాయలు లోన్ తీసుకున్నాను. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నందున వ్యవసాయ రుణాల కోసం బ్యాంకులకు వెళితే పాత రుణాలు చెల్లిస్తే తప్ప ఇవ్వమంటున్నారు. చంద్రబాబు 45 రోజుల తరువాత రుణామాఫీ ప్రకటిస్తే అప్పటికి ఖరీఫ్ సీజన్ మొత్తం దాటి పోతుందన్నారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచడం లేదు.
     - పీలా బుజ్జి, రైతు, వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు, తుమ్మపాల
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement