
కష్టాల ఖరీఫ్
- చినుకు జాడ లేదు...విత్తనాల ఊసు లేదు
- రుణం తీరదు...కొత్త అప్పు పుట్టదు
- కష్టాల ఖరీఫ్‌లో అన్నదాత ఎదురీత
ఈ ఏడాదీ ఖరీఫ్‌కు కష్టాలు తప్పేట్టు లేదు...సకాలంలో రాని రుతుపవనాలు, విత్తనాలకు రాయితీ ఎత్తివేత వీటితో పాటు రుణమాఫీ ప్రకటనతో అప్పులివ్వని బ్యాంకర్లు వెరసి ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సకాలంలో ఖరీఫ్ సాగు కాకపోతే ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ప్రమాదం ఉంది.
నర్సీపట్నం : ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.27 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుచేయాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. జిల్లా సాధారణ విస్తీర్ణం 2.03 లక్షల హెక్టార్లు కాగా, వాతావరణం అనుకూలిస్తే మరింత ఎక్కువ సాగుచేయాలనే లక్ష్యంతో ప్రణాళిక తయారు చేశారు. దీనిలో అధికంగా లక్ష హెక్టార్లకు మించి విస్తీర్ణంలో వరి పంటను సాగుచేస్తారని భావిస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో ప్రధానంగా చెరకు 40 వేలు, రాగులు 25 వేలు, చిరు ధాన్యాలు 16,500, గంటి 6 వేలు, మొక్కజొన్న 6,500 హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా చేసుకున్నారు.
వినిపించని ‘రుతు’రాగం
కేరళను తాకిన రుతుపవనాలు ఈ నెల ప్రారంభానికే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసినా, జిల్లాలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రస్తుత విషయానికొస్తే జూన్ సాధారణ వర్షపాతం 128.8 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 36.9 మి.మీ నమోదయ్యింది.
గత ఏడాది ఇదే సమయానికి 90.3 మి.మీ వర్షపాతం నమోదయ్యిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రుణాల విషయానికొస్తే 2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లకు గాను జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది.
కాలం కలిసి రాకపోవడంతో పాటు రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 700కోట్లు ఇచ్చేందుకు అధికారులు లక్ష్యంగా చేసుకున్నా ఇంతవరకు ఒక్కరికి రుణం ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పుల కోసం రైతులు వెతుకులాట ప్రారంభించారు.
విత్తనాల్లో రాయితీకి కోత
ఇక విత్తనాల విషయానికొస్తే జిల్లాలో వరి సాగుచేసేందుకు వివిధ రకాలైన 19.5 వేల క్వింటాళ్లు విత్తనాలను ఏపీ సీడ్స్ సిద్ధం చేసింది. వీటిలో అధికశాతం రైతులు వినియోగించే శ్రీకాకుళం సన్నాలు (ఆర్‌జీఎల్) విత్తనాల్లో రాయితీకి కోత విధించడంతో రైతులకు మరికొంత భారంగా మారింది. ప్రస్తుతం ఆర్జీఎల్ 510 క్వింటాళ్లు సిద్ధం చేయగా, మరో 340 క్వింటాళ్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎరువుల విషయానికొస్తే జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన 4,917 మెట్రిక్ టన్నుల యూరియా, 6,600 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను సిద్ధం చేశారు. ఈ విధంగా ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల మయంగా మొదలు కాబోతుంది.