రైతుల్ని నష్టపరుస్తున్న 17 శాతం తేమ నిబంధన
అనేక కారణాల వల్ల 22 శాతం మించుతున్న తేమ
పీపీసీల్లో ధాన్యం కొనుగోలు అంతంత మాత్రమే
తేమపై మినహాయింపునివ్వాలంటున్న అన్నదాతలు
రాజమండ్రి :బ్యాంకు రుణాలందక ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి రావడం, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినడం, డ్రైన్లు ముంచివేయడం.. రైతును కష్టనష్టాల పాలు చేస్తున్న ఈ జాబితాలో ప్రభుత్వం విధిస్తున్న తేమ నిబంధన కూడా ఒకటవుతోంది. ఈ నిబంధనతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అభ్యంతరాలు చెప్పడం, షావుకార్లు, మిల్లర్లు మద్దతు ధరకన్నా తగ్గించి కొనుగోలు చేయడం వల్ల నష్టపోవడం రైతులకు పరిపాటైంది. దీంతో ఖరీఫ్ సాగంటేనే రైతులు జంకుతున్నారు. వరుస పంట నష్టాలతో కోనసీమ రైతులు ఖరీఫ్ సాగును స్వచ్ఛందంగా వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అన్ని విపత్తులను దాటుకుని పంట పండించినా మద్దతు ధరకు కొనుగోలు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. ప్రభుత్వం భారీ ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా ధాన్యం కొంటున్నది అంతంత మాత్రమే. 17 శాతం మించి తేమ ఉండకూడదనే నిబంధన వల్ల ఈ కేంద్రాలు అలంకార ప్రాయంగా మారాయి. ఖరీఫ్‌లో వచ్చే ధాన్యంలో తేమ శాతం 22 మించి ఉంటుంది. భారీ వర్షాలు, తుపానుల సమయంలో కోతలు జరగడం, ఎండబోతకు అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తేమ17 శాతానికి లోపు ఉండడం లేదు. ఖరీఫ్‌లోనే కాదు రబీలో కూడా ఈ కేంద్రాల్లో తేమ నిబంధన వల్ల పెద్దగా కొనుగోలు ఉండడం లేదు. ఇదే అదనుగా మిల్లర్లు, ధాన్యం షావుకార్లు మద్దతు ధరను తగ్గించి ధాన్యాన్ని కొంటున్నారు. గత ఖరీఫ్, రబీలలో బస్తా (75 కేజీలు) రూ.800కు కొనడంతో రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.
రబీలో కొన్నది 18 శాతమే..
రబీ ధాన్యం కొనుగోలుకు జిల్లావ్యాప్తంగా 222 కేంద్రాలు (పీపీసీ) ఏర్పాటు చేసి, కొన్న ధాన్యం కేవలం 2.65 లక్షల మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం. జిల్లాలో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా పీపీసీల ద్వారా కొన్నది కేవలం 18 శాతం మాత్రమే. దీనిలో రైతుల నుంచి నేరుగా కొన్నది 20 శాతం మించి ఉండదు. మిగిలిందంతా షావుకార్లు, మిల్లర్ల నుంచి కొనుగోలు చేసినట్టు చూపించి పీపీసీలు ప్రభుత్వం నుంచి సొమ్ములు చేసుకుంటున్నాయి. ఇందుకు మిల్లర్లు సైతం సైదోడవుతున్నారు.
నిబంధనను సవరించాలి..
17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధనను మార్చాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాగు సమ్మె సమయంలో తేమ నిబంధనకు ప్రభుత్వం కొంత మినహాయింపు ఇచ్చింది. 17 శాతం దాటిన తరువాత ఒక్క శాతానికి రూ.10 చొప్పున మద్దతు ధర తగ్గిస్తూ 25 శాతం వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా అలా చేయాలని, అది ఖరీఫ్ సాగుకు ముందే ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తే ఖరీఫ్ సాగు ఊపందుకునే అవకాశముంది.
‘ఖరీఫ్’పై విరక్తి
Published Fri, Jul 3 2015 1:34 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement