బీమా లేదు..ధీమా లేదు | Insurance does not ledudhima | Sakshi
Sakshi News home page

బీమా లేదు..ధీమా లేదు

Published Mon, Aug 3 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

బీమా లేదు..ధీమా లేదు

బీమా లేదు..ధీమా లేదు

ఎకరాకూ దక్కని వైనం
ముగిసిన పంట బీమా గడువు
అధికారుల వైఫల్యం
ఆందోళనలో అన్నదాతలు

 
విశాఖపట్నం: అన్నదాతలకు ధీమా లేకుండా పోతుంది. ఏటా విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలు..కరువు కాటకాల బారినపడే పంటలకు బీమా లేకుండా పోతుంది. ప్రభుత్వ ఉదాశీనత, శాఖల మధ్య సమన్వయ లోపం..ముఖం చాటేస్తున్న బ్యాంకర్ల పుణ్యమాని ఏ ఒక్క రైతు బీమా పొందలేని పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు బీమా పథకం నేడు  అక్కరకు రాకుండా పోతోంది. గతేడాది హుద్‌హుద్ వల్ల సర్వం తుడుచుకుపెట్టుకుపోయినా ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చిందే కానీ బీమా రాలేదు. ఈ పథకం పట్ల రైతుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత ఖరీఫ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క ఎకరానికీ బీమా వర్తించలేదు. ఏరైతూ బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,12,285 ఎకరాలు. ఇందులో 2,57,670 ఎకరాల్లో వరి, 94,570 ఎకరాల్లో చెరుకు, 56,535 ఎకరాల్లో రాగి పంటలు సాగు చేస్తుండగా, ఇతర పంటలన్నీ మరో 1,3,510 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చెరకుతో పాటు వరిపంటలకు మాత్రమే పంట బీమా వర్తిస్తుంది.

ఈ రెండింటి విస్తీర్ణమే మూడొంతులుంటుంది. 80 శాతం మంది ఈ పంటలే పండిస్తుంటారు. అయినా సర్కార్ పంట బీమా పథకం అమలు పట్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. నాలుగేళ్లుగా కవరైన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. 2014-15లో అతి కష్టమ్మీద 3 వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే బీమా కల్పించారు. ఈ ఏడాది ఒక్క ఎకరాకు కూడా బీమా కల్పించ లేదు. ఒక్క రైతు కూడా ఒక్కరూపాయి ప్రీమియం చెల్లించలేదు. వరికైతే ఎకరాకు పెద్దరైతు రూ.522లు, సన్నకారు రైతు 470లు, చెరకుకైతే రూ.2806, రూ.2229, మొక్క జొన్న కైతే రూ.277లు, రూ.249 చొప్పున ప్రీమియం చెల్లించాలి. జూలై-31తో గడువు ముగిసినా ఎవరూ ప్రీమియం చెల్లించిన వైనం లేదు. హుద్‌హుద్ విరుచుకుపడిన గతేడాదితో సహా గడిచిన నాలుగేళ్లలో బీమా చేయించుకున్న ఏ ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు కూడా బీమా సొమ్ము విడుదల కాలేదు. 2012-2014 మధ్య పంటల బీమా చేయించుకున్న రైతులకు సుమారు రూ.8కోట్ల మేర బీమా మొత్తం రావాల్సి ఉంది. ఒక్క పైసా విడుదల కాకపోవడం కూడా రైతుల్లో ఈపథకం పట్ల నిరాశ కలిగించింది. రైతులను చైతన్య పర్చడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎకరాకు ఎంత కట్టాలి..ఎప్పటిలోగా చెల్లించాలి అనేది ఏ వ్యవసాయాధికారి మా వద్దకు వచ్చి చెప్పిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. కరువుఛాయలు తరుముకొస్తున్నాయి. మరొక పక్క రోజుకో వాయుగుండం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటువంటి తరుణంలో ఏ దశలో పంట ను కోల్పోవల్సి వస్తుందో తెలియని పరిస్థితి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement