2013-14 పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 3,51,516 మందికి మేలు
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో రైతులకు ప్రధానంగా ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టిసారించింది.ఈ అంశంపైనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బ్యాంకర్లతో సమావేశమయ్యూరు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఈటెల రాజేందర్ సైతం రుణమాఫీపైనే మాట్లాడారు. 2013 జూన్ ఒకటో తేదీ నుంచి రూ. లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకు మాత్రమే మాఫీ అమలు చేస్తామని కుండబద్ధలు కొట్టారు. బంగారంపై తీసుకున్న పంట రుణాలు, రుణ పాత బకాయిలకు ఈ మాఫీ వర్తించదని తేల్చిచెప్పారు. ఈ లెక్కన జిల్లాలో రూ.1226 కోట్ల పంట రుణాలు మాఫీ కానుండగా... 3,51,516 మంది రైతులకు మేలు జరగనుంది.
2013 జూన్ నుంచి రూ. 1,495 కోట్లు
జిల్లాలో జూన్ 2013 నుంచి 4,27,570 మంది రైతులు రూ.1,495.61 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు అధికారుల అంచనా. ఇందులో 76,054 మంది రైతులు పంట రుణాల కోసం బంగారం తాటు ్టపెట్టి రూ.269.42 కోట్లు తీసుకున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు నిర్ణయం ప్రకారం బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తించదు. ఈ లెక్కన జిల్లాలో 3,51,516 మంది రైతులకు సంబంధించి రూ.1226.19 కోట్ల పంట రుణాలు మాత్రమే మాఫీ అయ్యే అవకాశముంది.
రైతు రుణాలు రూ.3,970 కోట్లు
జిల్లాలో ఇప్పటివరకు రైతులకు సంబంధించి రుణ బకారుులు మొత్తం రూ.3,970 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం సుమారు 4,50,000 మంది రైతులు వాణిజ్య, సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. పంట రుణాల కింద 3,50,000 మంది రైతులు వివిధ బ్యాంకుల వద్ద రూ.1835 కోట్లు, వ్యవసాయ అవసరాలకు పాస్‌బుక్ ఆధారంగా బంగారాన్ని తాకట్టు పెట్టి 40వేల మంది రైతులు రూ.550 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. సాగు అవసరాల నిమిత్తం దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ అనుబంధ బర్రెలు, గొర్రెల పెంపకాని, బోర్లు వేసేందుకు నూతన యంత్రాల కొనుగోలుకు 60వేల మంది రైతులు రూ.1586 కోట్ల మేరకు అప్పుగా పొందారు.
9న తేలే అవకాశం
ఈనెల 9తేదీ నాటికి జిల్లాకు సంబంధించిన పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సర్కా రు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకర్లు పూర్తి స్థాయి కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే జిల్లా లో రుణమాఫీ వర్తించే లబ్ధిదారుల లెక్క తేలనుంది.
అందరికీ అవకాశం కల్పించాలి..
పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణ మాఫీ వర్తింపజేయాలి. 2013- 2014ను పరిగణనలోకి తీసుకోకుండా... రూ.లక్ష అప్పు ఉన్న ప్రతి ఒక్క రైతుకూ కొత్త సర్కారు రుణ మాఫీ అవకాశం కల్పించాలి. రైతులకిస్తే సర్కార్ ఏం చెడిపోదు.
- కమలాకర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పెగడపల్లి
రైతులు నిరాశ చెందుతున్నరు
రైతులకు సర్కారు రుణ మాఫీ చేస్తుందని ఎంతో అశతో ఉన్నం. గత ఏడాది తీసుకున్న వాటికి మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు నిరాశ చెందుతున్నరు. రూ.లక్ష తీసుకున్న వారందరి అప్పులనూ ప్రభుత్వమే కట్టాలి.
- ఆకుతోట సాంబయ్య, రైతు, హసన్‌పర్తి
ఏడాదికి పరిమితం చేయొద్దు
హన్మకొండ చౌరస్తా : రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలకు సంబంధించి కొన్ని మినహాయింపులతో మాఫీ వర్తిస్తుందని, రూ.లక్ష తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదు. రైతులకు రుణ మాఫీని గత ఆర్థిక సంవత్సరానికే పరిమితం చేయకుండా... ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రైతులందరికీ అవకాశం కల్పించాలి.
- టి.శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి
రుణమాఫీ రూ.1,226 కోట్లు?
Published Fri, Jun 6 2014 6:02 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM
Advertisement
Advertisement