రుణమాఫీ సాగదీతేనా?
- వీడని సందిగ్ధత
- 22న నివేదిక ఇవ్వాల్సిన ప్రత్యేక కమిటీ
- మరింత సమయం కావాలని కోరిన వైనం
- రైతుల్లో ఆందోళన
- తరుముకొస్తున్న ఖరీఫ్ సీజన్
వ్యవసాయ రుణమాఫీపై ప్రభుత్వం తీరు రైతులను అయోమయానికి గురిచేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన హామీ అమలులో సాగదీత ధోరణి వారికి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఖరీఫ్ సీజన్ తరుముకొచ్చిన తరుణంలో రుణమాఫీపై నేటికీ స్పష్టత లేకపోవటం, కొత్త రుణాల అంశం ప్రస్తావనకే రాకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.
మచిలీపట్నం : ఎన్నికల ప్రచారంలో, మేనిఫెస్టోలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణాలు అన్నింటిని మాఫీ చేస్తామని ముందూవెనుకా ఆలోచించకుండా హామీ ఇచ్చేశారు. ఈ నెల ఎనిమిదిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు రుణమాఫీపై స్పష్టత ఇస్తారని రైతులందరూ ఆశించారు. వారి ఆశలను అడియాసలు చేస్తూ రుణమాఫీపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఈ నెల 22 నాటికి రుణమాఫీపై ప్రాథమిక నివేదిక ఇస్తుందని చెప్పారు. అయితే ఈ కమిటీ విధివిధానాలు ఖరారు చేసేందుకు మరింత సమయం కావాలని కోరటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రిజర్వు బ్యాంకు నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా అలవికాని హామీ ఇవ్వటం, రుణమాఫీ చేసే సమయానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయంటూ వంకలు చెప్పడమేమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఎంత మాఫీ జరిగేనో?
జిల్లాలో వ్యవసాయ రుణాలు రూ.9,137 కోట్లు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల రుణాలు రూ.900 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు ఎంత మేర రుణం మాఫీ చేస్తుందో స్పష్టత ఇవ్వటం లేదు. డ్వాక్రా సంఘాలకు రూ.50 వేలు లోపు, రైతులకు లక్ష, లక్షన్నర రూపాయల్లోపు రుణమాఫీ జరుగుతుందంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇస్తూ ఊరిస్తూ వస్తోంది. రుణమాఫీపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు బ్యాంకులకు బాండ్లు ఇవ్వటంతో పాటు రుణాలను రీషెడ్యూలు చేయాలని సిఫార్సు చేశారు. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించకుండా మళ్లీ కొత్త రుణం ఇచ్చే అవకాశం లేదు.
రుణమాఫీ కమిటీ సూచించిన విధంగా బ్యాంకులకు బాండ్లు ఇవ్వటం, రుణాల రీషెడ్యూలు చేస్తే మళ్లీ కొత్త రుణాలు ఇచ్చే అవకాశం ఉండదని రైతులు, రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా కాలంలో రుణమాఫీ జరిగిందని, ఈ సమయంలో ప్రభుత్వం బ్యాంకులకు నగదు మొత్తాన్ని చెల్లించిందని రైతులు చెబుతున్నారు. బ్యాంకులకు నగదు చెల్లించకుండా బాండ్లు ఇచ్చినా, రుణాలు రీషెడ్యూలు చేసినా ఉపయోగం ఉండదనేది రైతుల వాదనగా ఉంది.
ప్రభుత్వం రుణమాఫీపై సత్వర నిర్ణయం తీసుకోకుంటే.. రుణం వాయిదా మీరిపోయి లక్ష రూపాయలకు రూ.7,750 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. అయినా దీనిపై ప్రభుత్వం మిన్నకుండిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రుణమాఫీపై కాలయాపన చేయకుండా త్వరితగతిన సముచిత నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.