వర్షాతిరేకం
- జిల్లాలో 59.2 మి.మీ. వర్షపాతం నమోదు
- నందిగామలో 94.2, పెడనలో 36.0 మి.మీ.
- అన్ని పంటలకు మేలంటున్న అన్నదాతలు
మచిలీపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. వేసవి అనంతరం తొలిసారిగా జిల్లాలో భారీ వర్షం నమోదైంది. మూడు రోజుల వరకు ఊరించి ఉసూరుమనిపించిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి విడుదల ఎప్పుడన్నది ప్రభుత్వం స్పష్టం చేయకున్నా వరుణుడు కరుణించడంతో వ్యవసాయ పనులకు వాతావరణం అనుకూలంగా మారిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో సోమవారం 59.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నందిగామలో 94.2, అత్యల్పంగా పెడనలో 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు రోజులుగా ముసురుపట్టి వానలు కురవడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాలువలకు సాగునీరు విడుదలచేస్తే వరిసాగు మరింత వేగవంతమవుతుందని పేర్కొంటున్నారు.
వరి, పత్తికి మేలు
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ఇప్పటివరకు 41.250 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి, నాట్లు ద్వారా వరి సాగు చేపట్టారు. పశ్చిమ కృష్ణాలోని వివిధ మండలాల్లో 75వేల ఎకరాల్లో పత్తి విత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, పత్తి మొక్కలకు మేలుచేస్తాయని రైతులు చెబుతున్నారు. మొక్కల ఎదుగుదలకు వాతావరణం అనుకూలంగా మారిం దంటున్నారు. ఇప్పటివరకు నారుమడులు పోయని రైతులు విత్తనాలు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు.
వర్షలు సక్రమంగా కురవక పోవడంతో పత్తిసాగు సగమే పూర్తయింది. వర్షాలరాకతో పత్తి విత్తేందుకు రైతులు సంసిద్ధులవుతున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పాటు, కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవడంతో వరినాట్లు ఈ ఏడాది ఆలస్యమయ్యాయి. కాలువలకు సాగునీరు విడుదల చేయకున్నా కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న వజినేరు, మున్నేరు, కట్టలేరు. వైరా, కొండవీటివాగు పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షపునీరు కృష్ణానదిలోకి చేరుతోంది. మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు సమృద్ధిగా కురిస్తే వర్షపునీరు కృష్ణానదిలోకి చేరుతుంది.
ఈ నీటిని కాలువలకు విడుదల చేసినా వ్యవసాయానికి ఉపయోగపడతాయని రైతులు సూచిస్తున్నారు. 2012లో అధికారికంగా సాగునీటిని అక్టోబర్‌లో విడుదల చేశారు. ఆ ఏడాది అక్టోబర్ నెల వరకు కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదిలోకి చేరిన నీటినే సాగునీరుగా కాలువలకు విడుదల చేశారు. 2013లో ఆగస్టులో కాలువలకు విడుదల చేశారు.
ఈ ఏడాది సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఈ నేపథ్యంలో వర్షపునీటినైనా సక్రమంగా కాలువలకు సక్రమంగా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకుతోడు కాలువల ద్వారా సాగునీరు వస్తే వరినాట్లకు ఎలాంటి ఆటకం ఉండదనే ఆశతో రైతులు ఉన్నారు.
వర్షపాతం వివరాలు ఇవీ..
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చాట్రాయి 85.4 మిల్లీమీటర్లు, తిరువూరు 82.2, వీరులపాడు 78.4, కలిదిండి 75.6, విజయవాడ 76.2, తోట్లవల్లూరు 74.8, మొవ్వ 74.0, జగ్గయ్యపేట 73.2, ఇబ్రహీంపట్నం 72.2, కంకిపాడు 71.2, వత్సవాయి 68.2, పెనుగంచిప్రోలు 68.2, గన్నవరం 68.0, మోపిదేవి 67.0, పామర్రు 66.2, పెనమలూరు 64.6, కంచికచర్ల 64.2, చందర్లపాడు 63.6, చల్లపల్లి 63.2, ఘంటసాల 62.8, విస్సన్నపేట 60.8, గూడూరు 60.0, మైలవరం 58.2, నూజివీడు 56.8, అవనిగడ్డ 55.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. జి.కొండూరు 55.2, కైకలూరు 55.0, ఆగిరిపల్లి 54.8, గంపలగూడెం 54.4, ఉయ్యూరు 52.8, ఎ.కొండూరు 52.6, పమిడిముక్కల 51.6, మచిలీపట్నం 50.4, మండవల్లి 50.2, ముసునూరు 47.6, బాపులపాడు 46.2, కోడూరు 46.2, రెడ్డిగూడెం 45.4, ఉంగుటూరు 45.2, గుడ్లవల్లేరు 44.6, బంటుమిల్లి 44.2, నందివాడ 42.4, గుడివాడ 42.4, నాగాయలంక 41.0, పెదపారుపూడి 40.4, కృత్తివెన్ను 40.2, ముదినేపల్లి 38.6, పెడన 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.