- దుక్కులకు అనుకూలం
- విత్తిన పత్తికి మేలు
- నారుమడులకు ఊతం
మచిలీపట్నం : గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ సీజన్‌పై రైతులకు ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇప్పటి వరకు కాలువలకు సాగునీరు విడుదల చేయకపోవటంతో ఖరీఫ్ సాగుపై రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. తాగునీటి కోసం కాలువలకు నీరు విడుదల చేసినా వాటిని నారుమడులకు ఉపయోగించుకునే అవకాశం లేకపోవటంతో మిన్నకుండిపోయారు.
జూలైలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో పాటు వరుణుడు ముఖం చాటేయటంతో నారుమడులు పోసుకునేందుకు వెనుకంజ వేశారు. గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఈ వర్షంతో భూములు దుక్కికి అనుకూలంగా మారుతాయని రైతులు చెబుతున్నారు.
ఉంగుటూరు, తోట్లవల్లూరు, పామర్రు, చల్లపల్లి, కంకిపాడు, మొవ్వ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే బోరు నీటి ద్వారా దాదాపు వెయ్యి ఎకరాల్లో నారుమడులు పోశారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నారుమడుల్లో ఎదుగుదల లోపించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నారుమడుల ఎదుగుదలకు దోహదపడతాయని వ్యవసాయాధికారులు, రైతులు చెబుతున్నారు. వర్షాలు ఇలాగే కొనసాగితే మెట్ట నారుమడులు పోసుకుంటామని రైతులు అంటున్నారు.
పత్తికి మేలు...
జిల్లా వ్యాప్తంగా లక్షా 40 వేల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయాధికారుల అంచనా. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, గంపలగూడెం, తిరువూరు, వీరులపాడు తదితర ప్రాంతాల్లో దాదాపు పదివేల ఎకరాల్లో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు పత్తి విత్తనాలు చల్లారు. మైలవరం, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో సోమవారం 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావటంతో పత్తికి మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
నందిగామ నియోజకవర్గంలో సుమారు 56 వేల ఎకరాల్లో పత్తి సాగు జరగాల్సి ఉంది. గత నెల 28న కురిసిన వర్షానికి రైతులు పత్తి విత్తనాలు చల్లారు. మొలకెత్తిన మొక్కలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా గిడసబారటంతో పాటు ఎదుగుదల లోపించింది. సోమవారం ఆశించిన మేర వర్షం కురవటంతో పత్తి మొక్కలకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. నందిగామ నియోజకవర్గంలో దాదాపు ఆరువేల ఎకరాల్లో మిర్చి సాగు జరగాల్సి ఉంది.
వర్షాలు ఇలాగే కొనసాగితే మిర్చి నారుమడులు పోసుకుంటామని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 40 వేల ఎకరాల్లో చెరుకు సాగు జరుగుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు చెరుకు పంట ఎదుగుదలకు మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. భారీ వర్షం నమోదైతే పత్తి పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.