- ప్రణాళిక సిద్ధం
- 21న వ్యవసాయ మంత్రి సమీక్ష
- 6.34 లక్షల ఎకరాల్లో వరి
- 1.75 లక్షల ఎకరాల్లో పత్తి
- వెదజల్లే పద్ధతిలో వరిసాగుకు ప్రాధాన్యం
మచిలీపట్నం : ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతోంది. 2015-16 సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ నెల ఒకటిన జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ, అనుబంధ విభాగాల ప్రిన్సిపల్ కార్యదర్శులకు వారు వివరించారు. గుంటూరు, కృష్ణా, ఒంగోలు జిల్లాలకు సంబంధించి వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళికలపై ఈ నెల 21న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం ఈ నెల 22న జిల్లా వ్యవసాయ ప్రణాళికను ప్రకటించనున్నారు. వెదజల్లే పద్ధతి ద్వారా వరిసాగు చేసి అధిక దిగుబడులు సాధించడంపై ఈ ఏడాది ప్రణాళికలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
ప్రణాళిక ఇలా...
వరి, అపరాల సాగులో 16 శాతం, చెరుకులో 11 శాతం, మొక్కజొన్నలో 100 శాతం మేర సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో జిల్లాలో 87,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి సరాసరిన 34 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి మొక్కజొన్న సాగు విస్తీర్ణాన్ని లక్షా 75 వేల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. హైబ్రీడ్ విత్తనాలను రైతులకు అందజేసి ఎకరానికి 38 క్వింటాళ్ల దిగుబడి సాధించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జూన్ ఒకటిన కాలువలకు సాగునీరు విడుదల చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు. దాని ప్రకారం సాగునీటి విడుదల జరిగితే వ్యవసాయ శాఖ అధికారులు మరింత వేగంగా తమ ప్రణాళికను అమలు చేయాల్సి ఉంది.
సూక్ష్మధాతు
లోపాల నివారణ పై దృష్టి...
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరి, 1.75 లక్షల ఎకరాల్లో పత్తి, 50 వేల ఎకరాల్లో చెరుకు సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది బీపీటీ 5204, 1061, 1001, 1010 రకం వంగడాలను అధికంగా సాగు చేస్తారని అంచనా వేశారు. వరి విత్తనాల కోసం ఏపీ సీడ్స్‌కు ఇండెంట్ పెట్టామని, జూన్ మొదటి వారంలో విత్తనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వెదజల్లే పద్ధతిపై రైతులకు మరింతగా అవగాహన క ల్పించి ఈ ఏడాది ఈ పద్ధతి ద్వారా లక్షా 80 వేల ఎకరాల్లో వరినాట్లు వేయాలని నిర్ణయించారు. భూసార పరీక్షల ఆధారంగా ఆయా ప్రాంతాల్లోని భూముల్లో సూక్ష్మధాతు లోపాలను గుర్తించి సూక్ష్మధాతు ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో 1.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, 3.50 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
3.10 లక్షల టన్నుల ఎరువులు...
జిల్లాలో సాగయ్యే వరి, చెరుకు, పత్తి, మిర్చి, వేరుశెనగ, జొన్న తదితర పంటలకు సుమారు 3.10 లక్షల టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ఖరీఫ్ సీజన్‌లో యూరియా 1,20,748 టన్నులు, డీఏపీ 54,607 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,04,167 టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) 28,492 టన్నులు అవసరమని గుర్తించి ఇండెంట్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో విత్తనాలు, ఎరువులు అవసరాన్ని బట్టి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించారు. వర్షాలు కురిస్తే భూమి దుక్కులకు అనుకూలంగా మారుతుంది. వర్షాలు ఆలస్యమైతే వివిధ పంటల సాగు ఆలస్యమయ్యే అవకాశముంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయశాఖ అధికారులు, రైతులు ముందడుగు వేయాల్సి ఉంది.
ఖరీఫ్‌పై కోటి ఆశలు
Published Fri, May 15 2015 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement