సాగు.. జాగు
- సాగునీటి విడుదలపై స్పష్టత కరువు
- నత్తనడకన వ్యవసాయ పనులు
- 12,700 ఎకరాల్లో నారుమడులు
- నాట్లు వేసింది 50 ఎకరాల్లో..!
జిల్లాలో వ్యవసాయ పనులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి.. అన్న చందంగా సాగుతున్నాయి. సాగునీటి విడుదలపై స్పష్టత కొరవడింది. వర్షపాతం కూడా తక్కువగా నమోదైంది. అన్నదాతలు నారుమడులు పోయాలా.. వద్దా.. అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది.
మచిలీపట్నం : జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 8.81 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న, కంది, పెసర తదితర పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో కురవకపోవటంతోపాటు కాలువలకు సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. దీంతో వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయి. గత ఏడాది జూలై 16వ తేదీ నాటికి 23శాతం వ్యవసాయ పనులు పూర్తి కాగా, ఈ ఏడాది కేవలం 14 శాతమే పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జూలై 16వ తేదీ నాటికి జిల్లాలో 197.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 112.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 43 మిల్లీమీటర్లు తక్కువగా ఉంది.
వర్షాధారంగానే నారుమడులు
జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు జరగాల్సి ఉంది.
జూన్, జూలై నెలల్లో వర్షాలు సరిగా కురవకపోవటంతో వరిసాగు ప్రశ్నార్ధకంగా మారింది. భవిష్యత్తులో వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయనే అశ లేకపోవటంతో రైతులు నారుమడులు పోయాలా.. వద్దా.. అనే మీమాంసలో ఉన్నారు.
ఇప్పటి వరకు 12,700 ఎకరాల్లో మాత్రమే నారుమడులు పోశారు. ఈ విస్తీర్ణం 40శాతం మాత్రమేనని ఇంకా 60శాతం మేర నారుమడులు పోయాల్సి ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఖరీఫ్ సీజన్ మించిపోతుండటంతో ఇప్పటి వరకు కురిసిన కొద్దిపాటి వర్షాల ఆధారంగా మొవ్వ, ఉంగుటూరు, పెడన మండలాల్లో 3,987 ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, బోరు నీటి ఆధారంగా మరో 50 ఎకరాల్లో వరినాట్లు పూర్తి చేశారు.
మొక్కజొన్న 2,377 ఎకరాలు, కంది 25 ఎకరాలు, పెసర 3,162 ఎకరాలు, వేరుశెనగ 350 ఎకరాలు, నువ్వులు 30 ఎకరాల్లో ఇప్పటి వరకు సాగు చేశారు. మరో 41,430 ఎకరాల్లో చెరకు సాగవుతోంది.
కాలువలకు నీరు రాకపోవటం, వర్షాలు సక్రమంగా లేకపోవటంతో చెరకు ఎదుగుదల లోపించింది.
జిల్లా వ్యాప్తంగా సబ్సిడీపై 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సరఫరా చేయనున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నా, ఇప్పటి వరకు 10వేల క్వింటాళ్లు మాత్రమే ఆయా మండలాలకు పంపారు. మిగిలిన విత్తనాలు జిల్లాకు రావాల్సి ఉంది.
సగానికి తగ్గిన పత్తిసాగు
జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయాల్సి ఉంది. నందిగామ, వీరులపాడు, కంచికచర్ల, గంపలగూడెం, మైలవరం, జగ్గయ్యపేట, జి.కొండూరు తదితర మండలాల్లో ఈ నెలలో కురిసిన వర్షాల ఆధారంగా 70,267 ఎకరాల్లో పత్తి విత్తారు. ఈ మండలాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలు పత్తి మొక్కలకు మేలు చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినా చిరుజల్లులే కురిశాయి. బుధవారం ఉష్ణోగ్రతలు పెరగటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉష్ణోగ్రతలు పెరిగితే నారుమడుల్లో ఎదుగుదల లోపిస్తుందని రైతులు చెబుతున్నారు.