ఎదురుచూపులే..! | Kharif when the water release ..! | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులే..!

Published Sat, Jun 21 2014 1:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఎదురుచూపులే..! - Sakshi

ఎదురుచూపులే..!

  •  ఖరీఫ్‌కు సాగునీటి విడుదల ఎప్పుడో..!
  •  25న తాగునీరు విడుదల!
  •  అధికారులకు అందని ఉత్తర్వులు  
  •  కాలువ పనుల టెండర్లు రద్దు
  •  ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా రీటెండర్లు
  • చినుకు రాలడం లేదు. పాలకులు పట్టించుకోవడం లేదు. తాగు, సాగు నీటి విడుదలపై అధికారులకే స్పష్టత కొరవడింది. ఫలితంగా ఖరీఫ్ సీజన్‌లో సాగు సాగేదెలా.. అని రైతులు మథనపడుతున్నారు. సాగు ఆలస్యమైతే నవంబరులో వచ్చే తుపానుల వల్ల తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ప్రగల్భాలు పలికినవారు నేడు పాలకులుగా మారిన తర్వాత తమను పట్టించుకోకపోయినా.. కనీసం వరుణుడైనా కరుణిస్తే నారుమడులైనా పోసుకుంటామని రైతన్నలు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.
     
    మచిలీపట్నం : ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. వాతావరణం అనుకూలంగా మారితే పొలం పనులు ప్రారంభించేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. ఖరీఫ్‌కు సాగునీటిని ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే విషయంపై పాలకులు, అధికారులు పెదవి విప్పటం లేదు. అయితే ఈ నెల 25న కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేస్తామని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు.

    అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటన వెలువడలేదు. నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తే ప్రకాశం బ్యారేజీకి చేరడానికి కనీసం మూడు రోజులు పడుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద పూర్తిస్థాయిలో నీటి మట్టం పెరిగేందుకు మరో రోజు పడుతుంది. బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తే శివారు ప్రాంతాలకు చేరేందుకు మరో నాలుగైదు రోజుల సమయం పట్టడం ఖాయం. ఈ లెక్కన నెలాఖరు వరకు కాలువలకు నీరు చేరడం అసాధ్యమని తెలుస్తోంది.
     
    తాగునీటితో నారుమడులు పోస్తే..
     
    తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నెల 25వ తేదీన కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న తాగునీటి చెరువులను నింపేందుకే ఈ నీటిని వినియోగించాలని సూచిస్తున్నారు. ఒకసారి కాలువలకు నీరు విడుదల చేసిన తర్వాత తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించేలా నిఘా పెట్టడం అసాధ్యం. తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన నీటితో రైతులు నారుమడులు పోసుకోవటం ఖాయం. నారుమడులు పోసిన తర్వాత తప్పనిసరిగా సాగునీటిని విరామం లేకుండా విడుదల చేయాల్సి ఉం టుంది. ఈ పరిస్థితుల్లో సాగునీటి విడుదలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పటం గమనార్హం.
     
    ఖరీఫ్‌కు 80 టీఎంసీల నీరు అవసరం..
     
    జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 6.34 లక్షల ఎకరాల్లో వరి, 45 వేల ఎకరాల్లో చెరకు, మరో 2.5 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందుకోసం 80 టీఎంసీల నీరు అవసరం. జూన్ నెలలోనూ ఉష్ణోగ్రతలు పెరగటంతో భూగర్భజలాలు అడుగంటాయి. కాలువలకు సాగునీరు విడుదల చేస్తేనే పంటలు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాదుకు తాగునీటిని విడుదల చేస్తున్నారని, కృష్ణాజిల్లాకు మాత్రం తాగునీటి అవసరాల నిమిత్తం ఇప్పటి వరకు నీటినివిడుదల చేయలేదని ప్రజలు మండిపడతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో రైతులు సాగునీటి విడుదల కోసం, వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.
     
    పులిచింతల పూర్తయి ఉంటే...
     
    కృష్ణా డెల్టాలోని శివారు ప్రాంతాలకు సకాలంలో సాగునీటిని విడుదల చేయాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే గత ఏడాది నవంబరులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రస్తుత పాలకులు ఆగస్టు నాటికి పులిచింతల పనులను పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి కృష్ణాడెల్టాకు సకాలంలో సాగునీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవటంతోపాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో డెల్టాకు సాగునీటి విడుదల గురించి మాట్లాడేందుకు సైతం అధికారులు సంశయిస్తున్నారు.
     
    సముద్రం పాలవుతున్న నీరు
     
    రైతులకు అవసరమైన సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి సక్రమంగా నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో కృష్ణానదికి వరదనీరు వచ్చి చేరితే ఆ నీటిని సముద్రంలోకి వదిలివేయటం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణాడెల్టాలో ఖరీఫ్, రబీ సీజన్లకు 130 టీఎంసీల నీరు అవసరమని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 399 టీఎంసీల నీటిని వదిలినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత నీరు వృథా అవుతున్నా శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితి ఏటా తలెత్తుతూనే ఉంది. జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటంతో కృష్ణాడెల్టాకు సాగునీటిని సక్రమంగా విడుదల చేయించేందుకు  చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.
     
    కాలువల నిర్వహణ పనుల టెండర్లు రద్దు
     
    ఈ ఏడాది సాగునీరు సక్రమంగా రైతులకు అందించేందుకు నీటిపారుదల శాఖాధికారులు కాలువల నిర్వహణ కోసం రూ.9.50 కోట్లతో టెండర్లు పిలిచారు. వేసవిలో చేయాల్సిన పనులను జూన్‌లోనూ ప్రారంభించకపోవడంతో టెండర్లను రద్దు చేశారు. ఈ నిధులతో కాలువల్లో ఉన్న తూటుకాడ, గుర్రపుడెక్క, నాచు తదితరాలను రసాయనాలు పిచికారీ చేసి నిర్మూంచాల్సి ఉంది. నీటిపారుదల శాఖాధికారులు ఆలస్యంగా టెండర్లు పిలిచారు.

    లక్ష రూపాయల్లోపు పనులకు టెండర్లు పిలవకుండానే కాంట్రాక్టర్లకు అప్పగించే వెసులుబాటును అధికారులకు కల్పించారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో ఈ సమయంలో పనులు ఎలా చేస్తారంటూ ఇటీవల జరిగిన నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో చర్చకు వచ్చింది. దీంతో టెండర్లను రద్దు చేయటంతోపాటు లక్ష రూపాయల లోపు ఉన్న పనులను కూడా ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారానే టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కాలువలకు నీటిని విడుదల చేసినా నాచు, గుర్రపుడెక్క తీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
     
    గతంలో ఉద్యమాలు... నేడు మౌనం

    గతంలో కృష్ణా డెల్టాకు సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని ప్రకాశం బ్యారేజీపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించిన టీడీపీ నాయకులు నేడు అధికారంలో ఉన్నారు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. గతంలో సాగునీటి విడుదలపై అప్పటి ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసిన ఆయన ఈ ఖరీఫ్ సీజన్‌లో డెల్టాకు సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం గురించి నోరుమెదపకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement