కంటితూడుపేనా? | Farmers concerned | Sakshi
Sakshi News home page

కంటితూడుపేనా?

Published Fri, Aug 8 2014 1:14 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

కంటితూడుపేనా? - Sakshi

కంటితూడుపేనా?

  • నీరొచ్చినా.. పొలం తడిసేనా?
  •  కాలువల్లో పేరుకుపోయిన తూడు, గుర్రపుడెక్క
  •  తొలగింపు పనుల టెండర్ల అమలుపై తర్జనభర్జన
  •  కాంట్రాక్టర్ల పన్నాగం
  •  ఆందోళన చెందుతున్న రైతులు
  • మచిలీపట్నం : జిల్లాలోని ప్రధాన కాలువలు, డ్రెయిన్ల పరిస్థితి అధ్వానంగా ఉంది.  తూడు, గుర్రపుడెక్క, నాచు పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితిలో సాగర్‌నుంచి నీరు విడుదలైనా తమ పొలాలకు అందుతాయా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో టెండర్లు ఖరారై తూడు, గుర్రపు డెక్క పనులు ప్రారంభం కాకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు. ఖరీఫ్ సీజన్ ముంచుకొచ్చినప్పటికీ పనులు చేపట్టకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపిస్తున్నారు.
     
    పనుల నిర్వహణపై మీమాంస
     
    ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధాన కాలువలు, డ్రెయినేజీలలో తూడు, గుర్రపుడెక్క, నాచులను తొలగించి నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చూడటం కోసం  నీటిపారుదల శాఖ  రూ.3.10 కోట్ల వ్యయం అయ్యే పనులకు ఈ-టెండర్లు పిలిచింది. జూన్ నెల నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు డెక్క, తూడు, నాచు తొలగింపు పనులు పూర్తిచేయాలి. అయితే కాంట్రాక్టర్లు కుమ్మక్కై    అధికశాతం పనులకు తక్కువ టెండరు కోట్ చేయటంతో ఈ పనులు నిర్వహించాలా, మళ్లీ టెండర్లు పిలవాలా అన్న మీమాంసలో నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు. తక్కువ మొత్తానికి టెండర్లు దాఖలైన పనులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని,  వారే తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
     
    61శాతం లెస్‌కు జింజేరు కాలువ పనులు
     
    సముద్రతీరంలోని జింజేరు కాలువ  పరిధిలో జొన్నలవారిమోడి, కానూరు, తాళ్లపాలెం తదితర గ్రామాలకు సాగునీరు సరఫరా అవుతోంది. ఈ ఆయకట్టు పరిధిలోనే తాళ్లపాలెం డ్రెయిన్ కూడా ఉంది. డ్రెయిన్, పంటకాలువలో తూడు, గుర్రపుడెక్క, నాచులను తొలగించే పని కోసం ఏడాదికి రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని నీటిపారుదలశాఖాధికారులు నిర్ధారించి టెండర్లు పిలిచారు. జింజేరు గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఈ పనులు వేరే వ్యక్తులకు వెళ్లకుండా తమ చేతుల్లోనే ఉండాలనే ఉద్దేశంతో 61శాతం లెస్‌కు టెండర్లు దాఖలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే 39శాతం నిధులతో ఏడాది పాటు ఏం పనులు చేస్తారనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. ఇలాంటి ఉదాహరణలే ఇంకా చాలా ఉన్నాయని రైతులు చెప్పుకుంటున్నారు.
     
    కాలువలకు నీరు విడుదల చేస్తే ఇబ్బందులే..
     
    ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు  కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ప్రాజెక్టులు నిండుతుండటంతో కొద్దిరోజుల్లో ప్రకాశం బ్యారేజీకి నీరు చేరే అవకాశం ఉంది. అక్కడి నుంచి పంటకాలువలకు సాగునీటిని విడుదల చేయాలి. ఈ కాలువలు ఇప్పటికే పూడుకుపోయి గట్లు బలహీనంగా మారాయి. సాగునీటి విడుదల జరిగితే నాచు, గుర్రపుడెక్క, తూటుకాడ ఇట్టే పెరిగిపోతుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ, బందరుకాలువ, రైవస్‌కాలువలకు రోజు మొత్తం మీద 16 నుంచి 17వేల క్యూసెక్కులు మించి నీరు విడుదల చేయడానికి అవకాశం లేదు. ఈ నీటిని విడుదల చేసినా కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, నాచు, తూడు  నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. వీటిని వెంటనే తొలగిస్తేనే శివారు ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉంది.

    ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పనులకు టెండర్లు పిలిస్తే అతి తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేయటం.. కాంట్రాక్టర్ల తీరుకు అద్దం పడుతోంది. నీటిలో చేసే పనే కాబట్టి మసిపూసి మారేడుకాయ చేసి బిల్లులు చేసుకునేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని, తమకు ఒరిగేదేమీ లేదని రైతులు అంటున్నారు. సెప్టెంబరు, నవంబరులో తుపానులు సంభవిస్తే భారీ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క, నాచు తొలగించకుంటే చేతికొచ్చే దశలో ఉన్న పైరు నీటమునిగే ప్రమాదం ఉంది. అధికారులు రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని డ్రెయిన్లు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement