మద్దతు నిరాశే
ఉదయగిరి : పట్టెడన్నం కోసం ఆరుగాలం కష్టపడే రైతన్నకు ఈ ఏడాది కూడా కేంద్రం మద్దతు ధర విషయంలో నిరాశే మిగిల్చింది. వ్యవసాయ ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు యాభై శాతం అదనంగా మద్దతుధర ఇస్తానని సార్వత్రిక ఎన్నికల సభల్లో ఊదరగొట్టిన ప్రధాని మోదీ వరుసగా రెండో ఏడాది కూడా మాట తప్పారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చూసి రైతులు గగ్గోలుపెడుతున్నారు. వరికి రూ.50 మద్దతు ధరను పెంచారు. అంటే గతేడాది వరి సాధారణ రకానికి రూ.1360 ఉంటే ఈ ఏడాది రూ.50 పెంచి రూ.1410 చేశారు. అదేవిధంగా రూ.1400 ఉన్న గ్రేడ్-ఏ రకం రూ.1450కి చేరింది.
కనీస మద్దతు ధర రూ.1700గా నిర్ణయించాలని రైతులు గత ఏడాది నుంచి గగ్గోలుపెడుతున్నా పాలకులకు మాత్రం చెవికెక్కలేదు. ఎంఎస్.స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం వరి కనీస మద్దతు ధర రూ.2,500 ఉండాలి. కానీ దాని గురించే కేంద్రం ఆలోచించలేదు. వరికి జాతీయ సగటు ప్రకారం ఒక హెక్టారుకు రూ.74 వేలు ఖర్చవుతోంది. దిగుబడి 52 క్వింటాళ్లు వస్తుంది. అంటే ఒక్కో క్వింటా పండించేందుకు రూ.1,424 ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నమాట. ఈ నేపథ్యంలో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు. రైతుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించడం లేదు. తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర ప్రభుత్వాలు రూ.200 వరకు బోనస్ ఇస్తున్నాయి.
పప్పుధాన్యాలకు ఫర్వాలేదు
పప్పుధన్యాల విషయంలో మాత్రం ప్రభుత్వం మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ప్రకటించడంతో కొంతమేర రైతులకు ఊరట కలిగింది. కందులుకు కనీస మద్దతు ధర రూ.275తో పాటు బోనస్‌గా రూ.200 ఇవ్వడంతో రూ.4250కు చేరుకుంది. పెసలు కనీస మద్దతు దర రూ.250 పెంపు, బోనస్ మరో రూ.200 కలిసి రూ.4,850కి చేరింది. మినుములు బోనస్ ధర రూ.200, కనీస మద్దతు రూ.275 పెంపు కలిపి రూ.4,625కు చేరింది. ప్రత్తి, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు మద్దతుధర నిరాశే మిగిల్చింది.