రైతు గోస పట్టదా? | Insurance premium is not paid bye the government from last one year | Sakshi
Sakshi News home page

రైతు గోస పట్టదా?

Published Sun, Sep 4 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

రైతు గోస పట్టదా?

రైతు గోస పట్టదా?

పంటలు నష్టపోయినా.. అందని బీమా సొమ్ము
- ఏడాదిగా బీమా ప్రీమియం చెల్లించని సర్కారు
- రూ.360 కోట్ల పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టిన బీమా కంపెనీ
- కేంద్రం ఇచ్చిన కరువు నిధులనూ రైతులకు ఇవ్వని సర్కారు
- ఊసు లేని రూ.720 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు
- మూడో విడత రుణమాఫీలో మరో సగం పెండింగ్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరడం లేదు. వరుస కరువులతో తల్లడిల్లుతున్న అన్నదాతలను ప్రభుత్వ నిర్లక్ష్యం మరింత అగాధంలోకి నెట్టివేసింది. దెబ్బతిన్న పంటలకు బీమా కంపెనీలు ఇచ్చే నష్ట పరిహారం అందకుండా చేసింది. పంటల బీమా కోసం తన వంతుగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో.. దాదాపు 20 లక్షల మంది రైతులు నిరాశలో మునిగిపోయారు.

 గత ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పంటలకు బీమా చేసుకున్నారు. ఈ బీమా ప్రీమియంలో కొంత శాతాన్ని రైతులు చెల్లిస్తారు, మిగతా సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు వాటాగా నేరుగా జాతీయ వ్యవసాయ బీమా కంపెనీకి చెల్లిస్తాయి. రైతులు పంట రుణాలు తీసుకున్నప్పుడే తమ వంతు ప్రీమియం చెల్లించేశారు. కేంద్రం కూడా తన వంతు మేర ప్రీమియం సొమ్మును విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా జమ చేమాల్సిన రూ.30 కోట్లను బీమా కంపెనీకి చెల్లించలేదు. మరోవైపు తీవ్ర వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో పంటలు నష్టపోయి ఏడు జిల్లాల్లో రైతులు కోలుకోని విధంగా దెబ్బతిన్నారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా బీమా కంపెనీలు పరిహారం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

ఈ ఏడు జిల్లాల పరిధిలోని రైతులకు రూ.360 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు అంగీకరించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తన వంతు ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా కంపెనీ కొత్త మెలికపెట్టింది. ప్రీమియం పూర్తిగా చెల్లించకుండానే పరిహారమెలా చెల్లిస్తామని కొర్రీ పెట్టింది. రూ.30 కోట్లు చెల్లించే వరకు పరిహారమివ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్లు సమాచారం. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు. మరోవైపు దాదాపు 20 లక్షల మంది రైతులు బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సొమ్ము అందితే తమ కష్టాలు కొంతైనా గట్టెక్కుతాయని ఆశతో ఉన్నారు.

 ఇన్‌పుట్ సబ్సిడీకీ ఇదే గతి
 గత ఖరీఫ్‌లో 231 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికీ అక్కడి రైతులకు ఒక్క రూపాయి ఇన్‌పుట్ సబ్సిడీ అందించలేదు. దీంతో ఖరీఫ్‌లో పెట్టుబడులకు కనీస సాయం అందుతుందని ఎదురుచూసిన రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇక కేంద్రం నాలుగు నెలల క్రితమే రాష్ట్రానికి కరువు సాయం కింద రూ.712 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు చెల్లించేందుకు రూ.1,018 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. మిగతా మొత్తం సర్దుబాటు చేసే పరిస్థితి లేకపోవటంతో ఇన్‌పుట్ సబ్సిడీ ఊసెత్తకుండానే కాలం వెళ్లబుచ్చుతోంది. గత ఖరీఫ్‌లో కరువు దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 30.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాదాపు 20.91 లక్షల మంది రైతులు నష్టపోయారు. వారికి ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసేందుకు ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపినా.. ఇప్పటికిప్పుడు రూ.712 కోట్లు విడుదల చేయడం సాధ్యం కాదంటూ ఆ ఫైలును ఆర్థిక శాఖ పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది.
 
 రుణమాఫీ నిధులకు కత్తెర
 ఇక రైతుల రుణ మాఫీ మూడో విడత కోసం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.4,250 కోట్లు కేటాయించింది. ఆర్థిక ఇబ్బంది దృష్ట్యా జూన్‌లో సగం, జూలైలో సగం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. జూన్ ఒకటిన రూ.2,019.99 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చినా.. సరిగా నిధులు విడుదల చేయలేదు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతులకు సంబంధించి ఈ విడత నిధులు విడుదల చేయలేదు. దీంతో బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో కొర్రీలు పెడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement