సాగు సంక్షోభంలో పడింది
అసెంబ్లీలో ప్రభుత్వంపై ఉత్తమ్ మండిపాటు
- తెలంగాణ వచ్చాక దయనీయంగా రైతుల పరిస్థితి
- వ్యవసాయ ఉత్పత్తులన్నీ తగ్గిపోయినా పట్టించుకోరా?
- రైతుల ఆదాయం సగానికి పడిపోయిందని ఆవేదన
- 37 లక్షల మంది రైతుల పాస్‌పుస్తకాలు తాకట్టులో ఉన్నాయి
- రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు చేయడం లేదని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతాంగం పరిస్థితి దయ నీయంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పంట ఉత్పత్తులు, రుణాల మంజూరు, సాగు విస్తీర్ణం... ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవసాయ అనుబంధమైన అన్ని రంగాల్లో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ప్రభుత్వం సమా ధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ ఆధునీకరణ, రైతు రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ అంశంపై బుధవారం శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కాంగ్రెస్ తరఫున ఆయన మాట్లాడారు. ‘‘రైతులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రుణమాఫీ హామీని ఏకకాలంలో ఎందుకు అమలు చేయలేదు? ఎన్నికల సమయంలో ఒకమాట.. గెలిచాక ఇంకోమాట.. 2015లో ఒకటి, 2016లో ఇంకొకటి చెబుతున్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించి రుణ శాతాన్ని 3 నుంచి 3.5 శాతానికి పెంచితే రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్రం నిబంధనలు సడలిం చింది. ప్రభుత్వం దాదాపు రూ.29 వేల కోట్లు అప్పుగా తెచ్చుకుంది. అయినా ఇప్ప టివరకు ఏకకాలంలో రుణమాఫీని ఎందుకు విడుదల చేయలేదు?’’ అని ఉత్తమ్ ప్రశ్నిం చారు. వాటర్‌గ్రిడ్‌లాంటి ప్రాజెక్టులకు వేల కోట్లు అప్పుగా తెస్తున్న ఈ ప్రభుత్వానికి రైతాంగాన్ని ఆదుకునేందుకు ఎందుకు మనసొప్పడం లేదంటూ నిలదీశారు. రాష్ట్రంలో 37 లక్షల మంది రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నింట్లోనూ తగ్గుదలే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందకపోగా, అన్నిఅంశాల్లో తగ్గుదల కని పిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘2014లో తెలంగాణ ఏర్పాటయి నపుడు రాష్ట్రంలో 107.49 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటే అది 2015లో 72 లక్షల టన్నులకు, 2016లో 49 లక్షల టన్నులకు తగ్గిపోయింది. పత్తి ఉత్పత్తి 2014లో 42 లక్షల బేళ్లు ఉంటే 2015లో 35 లక్షల బేళ్లకు తగ్గింది. తెలంగాణలో పండే పంటల విలువ 2014లో రూ.44 వేల కోట్లు ఉంటే 2015లో రూ.41 వేల కోట్లకు, 2016లో రూ.36 వేల కోట్లకు తగ్గిపోయింది. మొత్తమ్మీద ఈ ప్రభుత్వ హయాంలో రైతుల ఆదాయం సగానికి సగం తగ్గిపోయింది’’ అని ఆయన వివరించారు.
కేంద్ర నిధులు ఇతర పథకాలకా?
ఇన్‌పుట్ సబ్సిడీ కింద రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.790 కోట్లు ఏప్రిల్‌లోనే మంజూరు చేసిందని, అయితే ఆ నిధులను ప్రభుత్వం రైతులకు ఇవ్వకుండా ఇతర పథకాలకు మళ్లించిందని ఉత్తమ్ అన్నారు. అధికారంలోనికి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్స్‌ను తెరిపిస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు 1000 రోజులవుతున్నా ఏమీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 2,580 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో కనీసం 10 శాతం మందికి కూడా పరిహారం పంపిణీ చేయలేదన్నారు. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న 2,580 మంది రైతు ఆత్మహత్యల జాబితాను స్పీకర్‌కు పంపారు.