రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్
మొత్తం రుణమాఫీ చేశామంటూ రాహుల్ అబద్ధాలు చెప్తున్నారు... హామీల అమల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్నిచోట్లా వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తాము ఇచ్చిన హామీ అమలు చేశామని చెప్పే ధైర్యముంటే.. రుణమాఫీ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జికి నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సైతం హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ధ్వజమెత్తారు.
ఏడాది తిరక్కుండానే రూ.లక్ష కోట్ల అప్పులు
మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తే, కాంగ్రెస్ ఏడాది తిరగకుండానే రూ.లక్ష కోట్ల అప్పులు చేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో ‘ప్రచారం ఫుల్ పనులు మాత్రం నిల్’అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు గాను 22 లక్షల మందికే రుణమాఫీ చేసి, మొత్తం చేశామంటూ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు.
నిరుద్యోగ భృతి, మహిళలకు సాయం ఏదీ?
కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక, రాహుల్.. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట ఇచ్చిన అనేక హామీల అమలు ఏమైందని కేంద్రమంత్రి ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలలో మాదిరిగానే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో సైతం మభ్యపెట్టే హామీలు, గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా హామీలను ఎప్పటిలోగా, ఏవిధంగా అమలు చేస్తారనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువవుతోందని అన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, వివాహం చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం హామీలు ఏమయ్యాయని కిషన్‌రెడ్డి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment